తూర్పు లద్దాఖ్ సరిహద్దుల నుంచి భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ జోరందుకుంది. ఆసియా దిగ్గజాలైన ఇరుదేశాలు పలు దఫాలుగా జరిపిన చర్చల ద్వారా ఇప్పటికైతే తమ దళాలను వెనక్కి తీసుకున్నా, అంతర్గతంగా విభిన్న ప్రణాళికలతో ఉన్నాయి. సీనియర్ సైనిక కమాండర్ల మధ్య పది విడతలుగా చర్చలు జరిగాయి. కఠినతర పరిస్థితులు ఉండే శీతకాలం కూడా ముగిసింది. దీంతో తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత, చైనా దళాలు వెనక్కి మరలడం మొదలుపెట్టాయి.
అధికార వర్గాల సమాచారం ప్రకారం - ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ బలగాల ఉపసంహరణ పూర్తయ్యాకే గోగ్రా - హాట్ స్ప్రింగ్స్, డెస్పాంగ్ వంటి ఘర్షణలు తలెత్తిన ఇతర ప్రాంతాల గురించి యోచించే అవకాశం ఉంది. బలగాల ఉపసంహరణకు సంబంధించిన దృశ్యాల్లో ట్యాంకులు తిరిగి వెళుతూ ఉండటం, గుడారాలు, షెల్టర్లను ధ్వంసం చేయడం, బలగాలు వెనక్కి తరలుతుండటం వంటి అంశాలకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల దశ దిశ భారత్, చైనాల ప్రణాళికల మేరకే జరగడం లేదని తెలుస్తోంది.
అగ్రరాజ్యం ప్రభావం
భారత్, చైనా ఘర్షణలపై అమెరికా ఎన్నికల ప్రభావమూ పడిందని చెప్పాలి. ట్రంప్ ఓటమి భారత్ దూకుడుకు కొంత కళ్లెం వేసింది. ఎందుకంటే, చైనాతో ఘర్షణ మరింత విస్తృత స్థాయికి పెచ్చరిల్లితే, భారత్‌కు ప్రత్యక్షంగా సాయం చేసేందుకు కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోని అమెరికా రంగంలోకి దిగుతుందనే గ్యారంటీ లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. భారత్, చైనాల వైఖరులు, పరస్పరం ఢీకొనడం వంటి చర్యలు- ఈ రెండు దేశాలపట్లా అమెరికా అనుసరించే ధోరణి ఎలా ఉంటుందనే అంశంపైనా ఆధారపడి ఉన్నాయి.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠంపై కొనసాగడానికి ఈ పరిణామాలకూ సంబంధం ఉంది. అయితే, ట్రంప్ అధికారం కోల్పోవడం కీలక మలుపుగా భావించవచ్చు. అది - చైనాపై అమెరికా విధానంలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. ట్రంప్ నిష్క్రమణతో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన 'క్వాడ్' సమూహానికి కళ తగ్గింది. చైనా దుందుడుకు చర్యలను ఎదుర్కొనే విషయంలో కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఎంతమేర ముందుకు సాగుతారనే దానిపై తదుపరి పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి.
ఇప్పటికైతే, బైడెన్ రష్యా వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఐరోపా కేంద్రంగా 'నాటో'ను పునరుద్ధరించడానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. చైనా వ్యతిరేక ఇండో - పసిఫిక్ విధానంపై దూకుడుగా వెళ్లకపోవచ్చు. 'క్వాడ్' అడుగుల్లో తడబాటు కనిపించడం, చైనాకు వ్యతిరేకంగా అమెరికా కఠిన చర్యలు తీసుకొనే పరిస్థితులు లేకపోవడం వల్ల భారత్‌పై తన వ్యవహారశైలిని మార్చుకునేందుకు చైనాకూ పెద్దగా కారణాలు కనిపించడం లేదు.
వైఖరి మారింది..
మొత్తంగా- చైనా విషయంలో భారత్ వైఖరిలో ఇటీవల స్పష్టమైన తేడా కనిపించింది. అత్యంత ప్రతికూల వాతావరణం, అసాధ్యమైన భూభాగంలో సైతం భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలతో చైనా సైన్యం దూకుడును విజయవంతంగా అడ్డుకొని మన భూభాగాన్ని కాపాడారు. ఇందుకోసం తెలివైన ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయడం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ప్రత్యేకించి, గత ఏడాది ఆగస్టు 28-30 తేదీల్లో ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరం వెనక ప్రాంతాల్లో భారత్ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి చైనాను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సరిహద్దుల విషయంలో స్పష్టత కరవైన నేపథ్యంలో చైనా తరచూ చొరబాటు, దురాక్రమణ చర్యలకు పాల్పడేది. అయితే, భారత్ ఈసారి గత వైఖరికి భిన్నంగా స్పందించడం గమనార్హం.
ఇక ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య చిక్కుకుపోయిన రష్యా.. భారత్, చైనాలను సంప్రతింపులకు దిగాల్సిందిగా ఒప్పించడంలో తన వంతు పాత్రను పోషించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సంక్షోభం రష్యాపై మధ్యవర్తిత్వ బాధ్యతను మోపింది. తటస్థ వైఖరి ద్వారా రెండు ఆసియా దిగ్గజాలకు సమాన దూరంలో ఉండేలా చేసింది. భారత్, చైనా సరిహద్దు వివాదాలకు కొన్ని కొత్త లక్షణాలూ జతచేరాయి. 1959 నాటి ఏర్పాటు ఆధారంగా సరిహద్దు వివాదానికి పరిష్కారం గుర్తించాలంటూ చైనా కొత్త వాదనతో ముందుకొచ్చింది. ప్యాంగాంగ్ దక్షిణ తీరం ఈ వివాదానికి మరో కోణాన్ని జోడించింది. ఇక ఇప్పట్నుంచి భవిష్యత్తులో జరిగే అన్నిరకాల సరిహద్దు వివాదాల సంప్రదింపుల్లో ఈ ప్రాంతాన్ని కూడా చేర్చే అవకాశం ఉంది. సరిహద్దులో చోటుచేసుకున్న పరిణామాలు - సైనిక బలగాలు, ఉపకరణాల విషయంలో ఇరుదేశాలకూ కొత్త పాఠాలు నేర్పాయి. భారత్ విషయానికొస్తే పశ్చిమ భాగం నుంచి ఉత్తర భాగంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి తప్పనిసరి అని స్పష్టమయింది!
- సంజీవ్ కె.బారువా
ఇదీ చదవండి :'వారిని బ్రిటన్‌కు పంపాం.. మోదీని నాగ్‌పుర్ పంపిస్తాం'