తాము పుట్టిన పల్లెకు పునర్జన్మ ఇవ్వాలని, తల్లిలాంటి గ్రామంలో ఉపాధి అవకాశాలు సృష్టించాలనే ఉద్దేశంతో కొంతమంది కృషీవలుర సంకల్పంతో కొన్ని పల్లెలు అభివృద్ధి పథంలో పయనించి, ఆదర్శ గ్రామాలుగా అవతరించాయి. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని సివరేబజార్ సర్పంచిగా ఎన్నికైన పొప్పట్రావ్ పవార్ తన గ్రామాన్ని అభివృద్ధి పట్టాలెక్కించి దేశమంతటికీ ఆదర్శంగా నిలిపారు. ఆ ఊరు ప్రజల తోడ్పాటుతో జల సంరక్షణ కార్యక్రమాలతో నీటి కొరతను అధిగమించి, పాడిపంటలతో కళకళ లాడుతూ ఆర్థిక పునరుజ్జీవనం వైపు అడుగులేసింది. పేదరికాన్ని పారదోలి, దేశంలోనే అత్యధిక కోటీశ్వరులున్న గ్రామంగా ఖ్యాతి గడించి, దోమల రహిత పల్లెగా మారడం విశేషం.
మహారాష్ట్ర బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు
ప్రజల సమష్టి కృషికి నిదర్శనమైన మరో ఆదర్శ గ్రామం తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి. ప్రతి కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం అంతర్లీనమై, నీటి నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలకు కమిటీలను ఏర్పాటు చేసుకొని, సమర్థ భాగస్వామ్యంతో, ప్రగతికి బాటలు పరిచింది. ఇలా గంగదేవిపల్లి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచింది. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటైన పలు కమిటీలు పరిపాలన వికేంద్రీకరణను, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించి, ప్రజలే నిజమైన నిర్ణాయక విధాతలుగా రూపొందడం వల్ల ఆదర్శ గ్రామంగా కీర్తి గడించింది.
ఇదే తరహాలో గుజరాత్ రాష్ట్రంలోని పున్సారీ.. వై-ఫై సౌకర్యం, సీసీటీవీ కెమెరాలు, పాఠశాలలో శీతల తరగతి గదులు వంటివి కల్పించి ఆదర్శ గ్రామంగా పేరొందింది. మేఘాలయ రాష్ట్రం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని మవులనాంగ్ ఆసియాలోనే పరిశుభ్ర గ్రామంగా గుర్తింపు పొందింది. అక్కడ చెత్త సేకరణకు వెదురుతో తయారు చేసిన చెత్తకుండీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరుస్తూ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దారు. తద్వారా అది పర్యాటక గ్రామంగా మారి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. పూర్తిస్థాయిలో సౌర విద్యుత్తును కలిగిన మొదటి గ్రామంగా బిహార్‌లోని ధార్నయి పేరు గడించింది. కేరళలోని పొతనిక్కడ్ గ్రామం నూరు శాతం అక్షరాస్యతను సాధించింది.
అభివృద్ధికి తార్కాణాలు
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్.. గ్రామాభివృద్ధి కమిటీల తోడ్పాటుతో అభివృద్ధి పథాన సాగుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, బహుళ పంటల విధానం, మేలైన వంగడాలు, సమష్టి వ్యవసాయంతో సంఘటితంగా విజయగాథ నమోదుచేసింది. ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లాలోని ములుకనూరు గ్రామం సహకార ఉద్యమస్ఫూర్తిని పుణికిపుచ్చుకొని బ్యాంకింగ్, పాల కేంద్రం నిర్వహిస్తూ, సహకార ఫలాలను ప్రజలకు అందించి, వ్యవసాయ అభివృద్ధితో ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట జిల్లాలో ఇబ్రహీంపూర్ వంటివి ఆదర్శ గ్రామాలుగా మారి, అభివృద్ధికి తార్కాణాలుగా విలసిల్లుతున్నాయి. ఆదర్శ గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యం విరివిగా పెరగడం వల్లే సాధికారత, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సుపరిపాలన సాధ్యమైంది.