విలయ తాండవం చేస్తున్న కరోనా నియంత్రణలో ముందు జాగ్రత్తలదే కీలక పాత్రగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యవహారశైలి, ప్రవర్తనా సరళి తదితరాలు ఆరోగ్య సంరక్షణలో ఎప్పుడూ ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలను ఎరుకపరచే మన పాత పద్ధతుల్లోని మేలిమి బాటల్లోకి తిరిగి మళ్ళడం అందరికీ మేలే చేస్తుంది. ఆర్ధిక స్థితి మెరుగు పడటం వల్ల కొత్త పుంతలు తొక్కాలనే తపనతో పాత పద్ధతులను చాలామంది కాలదన్నుకున్నారు. కాన్వెంట్, కార్పొరేట్ చదువుల మోజుతో పాటు 'అప్పట్లో మనం ఎలాగూ అనుభవించలేదు. వాళ్లనైనా అనుభవించనీ' అనే ఆలోచనతో అన్నింటిలోనూ పిల్లల అడుగులకు మడుగులు వత్తారు. విచ్చలవిడితనానికి వంతపాడారు. సుద్దులు, బుద్ధులు, అలవాట్లు, సదాచారాలు, ఆరోగ్య సూత్రాలు వంటివి చెప్పకుండా ఆత్మవంచన చేసుకున్నారు. అలా చెయ్యడాన్ని సమర్థించుకుంటూ 'చెబితే వినరు' అనో, 'వాడి వయసుకు ఇప్పుడివన్నీ ఎందుకు?' అనో సమర్థించుకోసాగారు. నిజానికి పెద్దలు అలా చేయడానికి అసలు కారణం తమలో నిజాయతీ లోపించడమే!
పిల్లలకు చెప్పాలంటే ముందు తాము ఆచరించాలి. సుఖాలకు అలవాటు పడ్డ వారు ఆచరించలేరు. అందుకే పిల్లలకు చెప్పడానికి జంకుతో పెద్దలు చెప్పడమే మానేశారు. పిల్లలను వీధితిళ్లకు అలవాటు చేశారు. తమకు శ్రమ తగ్గుతుందని, పిల్లలను గొప్పగా పెంచుతున్నామనిపించుకోవాలని బజారులో దొరికే ప్రతి వస్తువునూ కనీస నాణ్యత పరిశీలించకుండా కొనిపెట్టడం ప్రారంభించారు. చిన్నతనంలో తాము ఉమ్మడి కుటుంబాలు, ఆర్ధిక పరిస్థితుల వల్ల కొన్నింటిని కోల్పోయామని, తమ పిల్లలకు ఆ పరిస్థితి కలగకూడదని తలచి చేతులారా ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు. స్వయంగా తామూ పెద్దలు చెప్పిన ఆరోగ్య సూత్రాలన్నింటినీ చాదస్తంగా కొట్టిపారేసి కొత్త అలవాట్లు చేసుకున్నారు. ఫలితంగా... కళ్ళాపి, కాళ్ళకు పారాణి, పెందరాళే మేల్కోనడం(నిద్రించడం) లాంటి పద్ధతులను చాలావరకు మరిచిపోయి, వాటి స్థానంలో ప్లాస్టిక్ అలంకరణలు, కృతకమైన అలవాట్లు చోటుచేసుకున్నాయి.
ఇంటి వంటల స్థానంలో ఇన్‌స్టంట్ ఫుడ్
ఇంటి వంటలు, తినుబండారాలు, రోటి పచ్చళ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అటకెక్కించేశారు. వాటి స్థానాన్ని ఇన్‌స్టంట్ ఫుడ్‌తో భర్తీచేశారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేశారో, ఎన్నాళ్లు నిల్వపెట్టారో తెలియని అనారోగ్యకర ఆహార పదార్థాలను ఆస్వాదించడం ఆరంభించారు. జీలకర్ర, వాము, అల్లం, వెల్లుల్లి, శొంఠి, పసుపు, ఇంగువ, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిని చెక్క, తులసి, వేప.. లాంటివన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే. అన్నీ ఔషధ గుణాలున్నవే. అతి సులువుగా దొరికేవి, సులభంగా మలచుకోగలిగేవి, ఆరోగ్యాన్నిచ్చేవి. కానీ వాటిని ఉపయోగించడం మానేసి మార్కెట్‌లో దొరికే మెరుపులు, మెరుగుల ప్యాకెట్లను వాడటం హోదాకు చిహ్నంగా భావించి మురిసిపోయారు. ఇందులో నాణ్యత, లోపాలు, నిజ నిర్ధారణల జోలికి పోలేదు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని మరిన్ని సులువులు, దినుసులు కొత్త పేర్లు, రూపాలతో మార్కెట్లో ప్రవేశించాయి. వాటికీ అలవాటు పడ్డారు తప్ప నాణ్యత మీద కనీస దృష్టి పెట్టలేదు. తిరగలి, రుబ్బురోలు, రోకలి, వంగి ఇల్లు అలకడం, చీపురుతో ఇల్లు చిమ్మడం లాంటి శరీరానికి వ్యాయామం కూర్చే పద్ధతుల స్థానంలోనూ ఆధునికత తిష్ఠ వేసింది. ఫలితం వ్యాయామ లేమి, కొవ్వుకు కలిమి. తప్పని పరిస్థితుల్లో యంత్రాలు వాడవచ్చు. కానీ అదే అలవాటుగా మారింది.