పద్నాలుగు పంక్తుల 'శవ వాహిని గంగ'లో గుజరాతీ కవయిత్రి అక్షరబద్ధం చేసిన ఆవేదన జాతి గుండె గాయానికి అద్దం పట్టింది. కొవిడ్ మృత్యు ఘాతాలకు సామాజిక జనజీవనం కకావికలమైపోతుంటే- వారం రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుముఖం పడుతున్న జిల్లాల సంఖ్య మూడు వందలు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది. కరోనా గెరిల్లా యుద్ధం చేస్తోందంటూ, మహమ్మారి నియంత్రణకు మూడంచెల వ్యూహాన్ని నిపుణులు ప్రతిపాదిస్తుంటే, వాటిని పెడచెవిన పెట్టి- 98శాతం జనాభాకు ఇంకా కొవిడ్ ముప్పు ఉందన్న నీతి ఆయోగ్ హెచ్చరికలు, యుద్ధంలో 'ఫీల్డ్ కమాండర్'లా పని చేయాలన్న ప్రధాని ఉద్బోధలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే 116 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగలేఖ- కరోనాపై సమరం ఎంత అసమగ్రంగా సాగుతోందో సూటిగా ప్రస్తావించింది. 'దేశానికి తక్షణ కార్యాచరణ కావాలిప్పుడు' అంటూ రాసిన లేఖ- మంత్రివర్గ సమష్టి బాధ్యతాపాలన కొడిగట్టి, రాష్ట్రాలతో సమాఖ్యతా స్ఫూర్తి అడుగంటి, నిపుణులు పార్లమెంటరీ కమిటీలతో సంప్రతింపులు కొండెక్కి, సమన్వయం కొరవడిన ఫలితంగానే ఇంత దురవస్థ దాపురించిందని స్పష్టీకరించింది. భిన్న దశల్లో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపడమే కాకుండా, దిద్దుబాటుకు పది విలువైన సూచనల్నీ చేసింది. కొవిడ్‌పై సమరంలో అందర్నీ కలుపుకొని పోతూ, పారదర్శక వ్యూహం అనుసరించాలన్న సూచనలతో భిన్న వర్గాల నుంచి ప్రధానికి ఇప్పటికే పలు లేఖలు అందాయి. పీఎం కేర్స్ నిధి నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనం కోరుతూ వందమంది మాజీ సివిల్ సర్వెంట్లు జనవరిలోనే లేఖ రాశారు. ఉచిత వ్యాక్సినేషన్ సహా తొమ్మిది సూచనలతో పది రోజుల నాడు 12 ప్రతిపక్ష పార్టీల నేతలూ మరో లేఖ సంధించారు. దేశంలో కన్నీటి కాష్ఠం ఆరాలంటే, మేలిమి సూచనలకు కేంద్రం చెవి ఒగ్గాలిప్పుడు!
పెడచెవిన సూచనలు