సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఒక పక్క రైతుల ఉద్యమం సాగుతుండగానే, ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ కాలంనాటి చౌరీచౌరా సంఘటనకు సంబంధించిన వేడుకల్ని జరిపింది. ఆ పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర యోధుల కుటుంబాలను కీర్తించింది. స్వతంత్ర పోరాట కాలంలో మహాత్మాగాంధీ సారథ్యంలో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. అందుకు ప్రతిగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలో చౌరీచౌరా పోలీసుస్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టడం వల్ల 22 మంది పోలీసులు మరణించారు. ఆ హింసాత్మక ఘటనతో గాంధీజీ చలించిపోయారు. మొత్తం ఉద్యమాన్నే ఆపేశారు. పోలీసులతోపాటు ఠాణాను తగలబెట్టిన ఘటనలో పాలుపంచుకున్న ప్రజల మనోభావాలు అర్థం చేసుకోదగ్గవే కానీ, అవి సమర్థనీయం కాదు.
నాటి ఘటనలో పాలుపంచుకున్న వారిలో 19 మందిని ఉరితీయగా, 110 మందికి జీవిత ఖైదు పడింది. తాజాగా భాజపా ఆనాటి ఘటనలో పాలుపంచుకున్నవారి బంధువులను గౌరవించడం- మహాత్మాగాంధీ విజ్ఞతను ప్రశ్నించడమే కాకుండా, హింసను సమర్థించడమే అవుతుంది. మరోవైపు, ఇటీవల గణతంత్ర దినం రోజున చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రభుత్వం ఖండించింది. దీనిద్వారా ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రమేయం ఉన్న ముఖ్యమైన ఉదంతాలను విస్మరిస్తూ, ఎంచుకొన్న కొన్ని సంఘటనలనే కీర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రకృతి విపత్తులు
వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్ రైతుల పోరాటానికి సంఘీభావం తెలపడంపై ప్రభుత్వం నుంచి, దాని మద్దతుదారులు, అనుకూల మీడియా నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన ఎదురైంది. దీని తరవాత రోజుల వ్యవధిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తు సంభవించింది. చమోలిలో కొండచరియలు విరిగిపడటం, రిషిగంగ, ధౌలిగంగ నదుల్లో మెరుపు వరదలు సంభవించడంవల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తపోవన్ విష్ణుగఢ్, రిషిగంగ జలవిద్యుత్తు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఈ సందర్భంగా- దేశీయ ఉద్యమకారుడు స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్‌గా పేర్కొనే ప్రొఫెసర్ జి.డి.అగ్రవాల్ 112 రోజులపాటు ఆమరణ దీక్షతో 2018లో ప్రాణాలు విడిచిన ఘటనను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.