స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ; రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు, శాసనసభల నిర్మాణం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులు, వర్గాలకోసం కాకుండా- సమాజంలోని అన్ని వర్గాల ప్రగతికి ప్రభుత్వాలు కృషి చేస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. భిన్న అభిప్రాయాలు, ధోరణుల పట్ల ప్రభుత్వాలు సహనాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వం సక్రమమైన పాలనను అందించనప్పుడు ప్రశ్నించి, నిలదీసి- ప్రజాస్వామ్యం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ మధ్యకాలంలో భారత ప్రజాస్వామ్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చర్చనీయాంశం అవుతోంది. సరళీకృత ఆర్థిక సంస్కరణల ప్రతికూల ప్రభావానికి ప్రజలు గురికావడం- పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు గాడి తప్పి నియంతృత్వ పోకడలు చోటుచేసుకోవడం ఇందుకు కారణాలు.
దిగజారిన ‘సూచీ’
బ్రిటన్‌కు చెందిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల పనితీరును విశ్లేషిస్తూ 2006 నుంచి ప్రజాస్వామ్య సూచీ వార్షిక నివేదికలను ప్రచురిస్తోంది. ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ సంస్కృతి, ప్రభుత్వాల పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, పౌర స్వేచ్ఛ వంటి అరవై కొలమానాల ప్రాతిపదికగా దేశాలను వర్గీకరించి- సూచీని రూపొందిస్తారు. ఈ సంస్థ ప్రకటించిన 2014 వార్షిక నివేదికలో పదికి 7.92 స్కోరుతో భారత దేశం 27వ స్థానంలో నిలిచింది. 2019 నివేదికలో ఇండియా 6.9 స్కోరుతో 51వ స్థానంలో ఉంది. 2021 ఫిబ్రవరిలో ప్రచురించిన వార్షిక నివేదిక(2020)లో గత సంవత్సరంకంటే రెండు స్థానాలు తగ్గి 6.61 స్కోరుతో 53వ స్థానానికి దిగజారింది. ప్రజాస్వామ్య సూచీ పతనానికి నివేదిక రెండు కారణాలను తెలిపింది.
ఒకటి అధికారవర్గం ప్రజాస్వామ్య పద్ధతులను విడనాడి అప్రజాస్వామిక లక్షణాలు ప్రదర్శించడం, రెండోది పౌర హక్కుల అణచివేత చర్యలు తీవ్రతరం కావడం. నార్వే 9.87 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, స్వీడన్ దేశాలను ఉత్తమ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా నివేదిక పేర్కొంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సంఘటనలు, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అధిక సంఖ్యాక ప్రజలు పెదవి విరుస్తున్నారు. సంఖ్యాబలంతో ప్రభుత్వాలు పార్లమెంటరీ సంప్రదాయాలను, పద్ధతులను కాలరాచి చట్టాలను, విధానాలను రూపొందించడం వివాదాలకు దారితీస్తోంది. వివాదాస్పద సాగు చట్టాలు రైతుల ఆందోళనకు కారణమయ్యాయి. రాజ్యాంగ వ్యవస్థల కంటే నీతి ఆయోగ్ వంటి రాజ్యాంగేతర సంస్థలు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.