తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రమాదంలో బహుళత్వ భావన

బహుళ సాంస్కృతికతతో ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించిన భారత్​లో ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. విభిన్న సంస్కృతులను కాపాడేందుకు రాజ్యాంగం హక్కులు కల్పించినా, పలు సంఘ విద్రోహక శక్తులు దాడులకు తెగబడుతున్నాయి. దేశాలన్నీ ప్రపంచీకరణ ప్రక్రియలో ముందుకు పోతున్న తరుణంలో ఇటువంటి చర్యలు దేశాభివృద్ధిని కుంటువడేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

secularism, opinion
ప్రమాదంలో బహుళత్వ భావన

By

Published : Jan 26, 2021, 7:41 AM IST

భారతదేశం బహుళ సాంస్కృతికతకు, భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు. దీనికి ప్రధాన కారణం- ఏ దేశంలోనూ లేనన్ని విభిన్న జాతులు, గిరిజన తెగలు, మతాలు, కులాలు, ఎన్నో ఆచార సంప్రదాయాలు ఇక్కడ ఉండటమే. ఆంత్రొపొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 1985లో చేపట్టిన ‘పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ అధ్యయనం ప్రకారం- భారత్‌లో 3,539 హిందూ కులాలు ఉన్నాయి. ఇస్లాం మతంలో 584, క్రైస్తవుల్లో 339, సిక్కుల్లో 130, బౌద్ధుల్లో 93, జైన మతంలో 100, పార్సీల్లో తొమ్మిది, యూదుల్లో ఏడు చొప్పున తెగలు ఉన్నాయి. 705 ఆదివాసీ జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ- దేశంలోని ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసి మెలిసి జీవించడం విశేషం. భారత్‌లోని బహుళ సాంస్కృతిక జీవన విధానాలు పాశ్చాత్య దేశాలనూ ఆకట్టుకొంటున్నాయి.

రాజ్యాంగం కల్పించిన హక్కులు

భారత్‌లో విభిన్న సంస్కృతుల అస్తిత్వాన్ని కాపాడేందుకు స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగంలో 25 నుంచి 28 వరకు అధికరణలు పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని ఆచరించే హక్కును కల్పించాయి. మతపరమైన ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించేందుకు, చట్టప్రకారం ఆస్తులను నిర్వహించేందుకు సైతం హక్కులను ప్రసాదించాయి. 46వ అధికరణ సైతం పౌరులకు సాంస్కృతిక, విద్యా హక్కులను కల్పించడం సహా దేశంలోని కొన్ని షెడ్యూల్డ్‌, గిరిజన ప్రాంతాలను, ఆయా జాతుల సంస్కృతిని పరిరక్షించేందుకు 5, 6 షెడ్యూళ్లను పొందుపరచింది. దీని ప్రకారం నిర్దేశించిన ప్రాంతాల్లో పరిపాలనను గవర్నర్ల ద్వారా కొనసాగిస్తున్నారు.

చెలరేగుతున్న హింస

రాజ్యాంగం ద్వారా వారికి సంక్రమించిన ప్రత్యేకతను, హక్కులను ఓర్వలేక కొన్ని సంఘ విద్రోహ శక్తులు వారిపై పలు కారణాలు చెబుతూ- దాడులకు తెగబడుతున్నాయి. మత మార్పిడులు చేస్తున్నారంటూ హింసకు దిగుతున్నాయి. ఈ ధోరణి సాంస్కృతిక బహుళత్వానికి ప్రమాదకారిగా మారుతోంది. కొన్ని పార్టీలూ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఈ దాడులను ప్రోత్సహించడం సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకొనేలా చేస్తోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ మధ్య కొన్ని రాష్ట్రాలు కరోనా కష్టకాలంలో నూతన మత మార్పిడి నిరోధక చట్టాలను ఆర్డినెన్సు రూపంలో తీసుకురావడం వల్ల కొన్ని వర్గాలకు వేధింపులు తప్పడం లేదు.

లవ్​ జిహాద్​ వివాదం

లవ్‌ జిహాద్‌ పేరుతో ఇతర మతాలవారు హిందువులను మతమార్పిడులు చేస్తున్నారన్న నెపంతో వారి మీద దాడులకు తెగబడటం సహా పోలీసుల వేధింపులు సైతం తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 22 ఏళ్ల పింకీ అనే హిందూ యువతిని లవ్‌ జిహాద్‌ కేసు కింద నిర్బంధ వసతి గృహంలో ఉంచారు. ఈ సందర్భంగా ఆమెకు గర్భస్రావం జరిగింది. ఆ యువతి ఇష్టపూర్వకంగానే రషీద్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు చెప్పినా- ఆమె భర్తను, బావను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. అదే రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరులో అలహాబాద్‌ హైకోర్టు 'స్త్రీ తన సొంత నిబంధనలతో జీవించవచ్చు' అని పేర్కొంటూ 21 ఏళ్ల శిఖా అనే హిందూ మహిళను తన ముస్లిం భర్త అయిన సల్మాన్‌ను మళ్లీ కలిపింది.

తరచూ చోటు చేసుకుంటున్న అమానవీయ ఘటనలను నిరసిస్తూ సుమారు వందకు పైగా విశ్రాంత సివిల్‌ సర్వీస్‌ అధికారులు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలంటూ బహిరంగ లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశాభివృద్ధి కుంటువడేలా..

మతాంతర ప్రేమలు-పెళ్ళిళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాజస్థాన్‌లోని ఖైరాబాద్‌లో- అమ్మాయిలు రజస్వల అయిన తరవాత ప్రత్యేక బాలికల పాఠశాలలో మాత్రమే చదవాలనే కట్టుబాటు విధించారు. దీంతో వారు మిగతావారిలా భవిష్యత్తులో ఉన్నత విద్యను కొనసాగించడం ప్రశ్నార్థకంగా మారనుంది. దేశాలన్నీ ప్రపంచీకరణ ప్రక్రియలో ముందుకు పోతున్న తరుణంలో ఇటువంటి చర్యలు దేశాభివృద్ధిని కుంటువడేలా చేస్తున్నాయి. అనాదిగా విభిన్న మతాలు, సంస్కృతులతో భారత జాతి పరిఢవిల్లుతోంది.

ఇటీవల ఇండియాలో పంటకోతకు సంబంధించిన పండుగను లోహ్రి, మకర సంక్రాంతి, పొంగల్‌, బిహు వంటి వివిధ పేర్లతో పలు రాష్ట్రాల్లో హిందువులతో పాటు అన్య మతలవారూ జరుపుకోవడం చూశాం. ఈ బహుళ సంస్కృతులను కాపాడాలంటే మానవ హక్కుల పరిరక్షణ కీలకం. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే మత మార్పిడి నిరోధక చట్టాలను పునస్సమీక్షించాలి. ప్రసార మాధ్యమాలు, సాహితీవేత్తలు, కవులు, విజ్ఞాన చైతన్య సంస్థలు- సహనం, సుహృద్భావం పెంపొందించాలి. భిన్నత్వంలో ఏకత్వం గొప్పదనాన్ని చాటిచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలందరి పైనా ఉంది!

-డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

ఇదీ చదవండి :అలా చేస్తే ప్రభుత్వ పనితీరుపై ప్రభావం: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details