ఎవరెంత అదిలించినా ఏమాత్రం సరకు చేయని మదమత్తేభంలా జనచైనా చెలరేగుతున్న తీరు తీవ్రాందోళన కలిగిస్తోంది. 2035నాటికి సాధించదలచిన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన పద్నాలుగో పంచవర్ష ప్రణాళికకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌తో 'మమ' అనిపించిన చైనా - బ్రహ్మపుత్ర నదిపై అతి భారీ జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి పూర్వరంగం సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్ జల విద్యుత్ ప్రాజెక్టుకు ఏకంగా మూడింతల పరిమాణంతో బ్రహ్మపుత్ర దిగువన, మన అరుణాచల్ ప్రదేశ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో 'సరిసాటి లేనిది'గా కొత్త ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు చైనా ప్రకటిస్తోంది. 60వేల మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో నిర్మించనున్న ఈ జలవిద్యుత్ కేంద్రం- చైనా అభివృద్ధి లక్ష్యాలకే కాదు, విద్యుత్ అంతరాయాలతో సతమతమవుతున్న ఈశాన్య భారతావనికీ ఎంతగానో అక్కరకొస్తుందని బీజింగ్ నమ్మబలుకుతోంది.
బ్రహ్మపుత్ర ఎగువన, మధ్యభాగంలోనూ ఇప్పటికే నాలుగు ఆనకట్టలు నిర్మించిన చైనా- నది ఇండియా దిశగా ప్రవాహగతి మార్చుకొనే కీలక ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణంపై ఏనాడో కన్నేసినా.. పర్యావరణ దుష్ప్రభావాల రీత్యా వెనక్కి తగ్గింది. భారత్‌కు నష్టం కలిగేలా బ్రహ్మపుత్రపై ప్రాజెక్టులు కట్టబోమంటూ 2010లో ఇచ్చిన హామీని అటకెక్కించి తలపెట్టిన ఈ ప్రాజెక్టు అక్షరాలా తలకొరివి కానుంది. 2015 నాటికే దేశీయ అవసరాలకు మించి అదనంగా మూడు లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఒడిసిపట్టిన చైనా- పాత విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదకతను 50శాతం దిగువకు పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో- స్వచ్ఛ ఇంధనం పేరిట ఇండియాపై చైనా ఎక్కుపెడుతున్న అతి పెద్ద జలాయుధంగా ఈ ప్రాజెక్టును విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చైనా ఇండియా బంగ్లాదేశ్‌లకు వరదాయిని అయిన బ్రహ్మపుత్ర మీద, హిమాలయ సానువుల్లో అత్యంత సున్నిత ప్రాంతంలో వేల కోట్ల ఘనపు మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో బీజింగ్ కట్టనున్న ప్రాజెక్టు కలవరదాయినిగా మారనుంది!
దిగువ దేశాలకు నష్టం