నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని సత్యం. సంప్రదాయ సామాజిక శాస్త్రాలతో పాటు శాస్త్ర సాంకేతిక, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి విభిన్న కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎయిమ్స్‌లలో చేరుతున్న మహిళల శాతం ఏటా పెరుగుతోంది. ఈ పరిణామాలు మహిళల సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో తల్లిదండ్రులు తమ కుమార్తెలకు భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి పరిమిత అంశాల్లో మాత్రమే చదువు చెప్పిస్తూ వచ్చారు. ‘సైన్సు, టెక్నాలజీవంటివి ఆడపిల్లలకు ఎందుకులే’ అనే భావం ఉండేది. క్రమంగా మార్పు వచ్చింది.
అయినప్పటికీ పురుషులతో పోల్చిచూస్తే విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్త్రీల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో లేదనేది వాస్తవం. దిల్లీలోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 2016లో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ప్రకారం భారత్‌లో ఉన్నత విద్యారంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉంది. ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల కోర్సుల్లో 40శాతం చేరితే; ఇంజినీరింగ్, టెక్నాలజీలో 16.34శాతమే ఉన్నారు. సైన్స్‌లో 12.6శాతం, ఐటీ-కంప్యూటర్స్‌లో 4.11శాతం, మెడిసిన్‌లో 2.87శాతం చొప్పున ఉన్నారు.
పలు రంగాలకే పరిమితం
భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళా సాధికారత సంతృప్తికరంగా లేదని అధ్యయనాలు చాటుతున్నాయి. కళాశాలల్లో బాలికల ప్రవేశాలు తగినంత ఉండటం లేదు. మన దైనందిన జీవితానికి, శాస్త్రసాంకేతిక రంగాలకు విడదీయరాని బంధం ఉంది. అందువల్ల సమాజ పురోగతికి, దేశాభ్యున్నతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాల్లో పురుషులతో పాటు మహిళలూ సమానంగా ప్రవేశించినప్పుడే మహిళా సాధికారత సాకారమవుతుందని నిపుణులు అంటున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళల శాతం ఒకింత మెరుగ్గానే ఉన్నా- ఆపై పరిశోధనాపరమైన చదువుల్లో (ఎంఫిల్, పీహెచ్‌డీ) వారి నిష్పత్తి పడిపోతోంది. పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో పనిచేసే మొత్తం నిపుణుల్లో మహిళల శాతం కేవలం 14 మాత్రమేనని చెప్పే యునెస్కో గణాంకాలు వారి పట్ల కొనసాగుతున్న దుర్విచక్షణకు నిదర్శనం.
మరోవైపు భారతదేశంలో 2016, 2019 మధ్య కాలంలో టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితానికి సంబంధించిన ఉద్యోగాల్లో 44శాతం పెరుగుదల నమోదు కావడం ఆహ్వానించదగినది. ఈ ధోరణి నిస్సందేహంగా ప్రపంచంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం అందించేదే అయినా- ఇందులో మహిళా భాగస్వామ్యం తగ్గడం ఆందోళన కలిగించే విషయం. మహిళలు శాస్త్ర సాంకేతిక రంగంలో దుర్విచక్షణను ఎదుర్కోనడానికి గల కారణాలను పరిశీలిస్తే... చారిత్రకంగా అనేక కట్టుబాట్ల మధ్య పెరిగిన ఆడపిల్లలపై కుటుంబ సామాజిక, ఆర్థిక సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో సాధారణ విద్య అభ్యసించడమే భారమైంది.
శాస్త్రవేత్తల స్థాయికి వెళుతున్నవారు తక్కువ..
సైద్ధాంతికతతో కూడిన తర్కబద్ధమైన సైన్స్ విద్య మరింత కష్టతరమైంది. ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి పాత్ర అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. ఇటీవల సైన్స్‌లో పట్టభద్రులైన మహిళల్లో చాలామంది జూనియర్, డిగ్రీ కళాశాలల్ల్లో అధ్యాపకులవుతున్నారు. శాస్త్రవేత్తల స్థాయికి వెళుతున్నవారు తక్కువేనని చెప్పాలి. వైజ్ఞానిక, పరిశోధనాశాలల్లో కర్మాగారాల్లో స్త్రీలు పనిచేస్తున్నప్పటికీ శాస్త్రవేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా చాలా కొద్దిమంది మాత్రమే ఎదగగలుగుతున్నారు.