'ఎవరి ఒత్తిళ్లకూ లోనుకాకుండా, స్వతంత్ర సంస్థగా కార్యనిర్వాహక స్వయంప్రతిపత్తితో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పనిచేసేలా ఓ చట్టాన్ని కేంద్రం తీసుకువస్తుందా?'- సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర సర్కారుకు ఆ ప్రశ్న సంధించి ఎనిమిదేళ్లు కావస్తోంది. కేంద్రంలోని పాలకపక్షం చేతిలో రాజకీయ పనిముట్టులా అంతకంతకూ భ్రష్టుపట్టిపోతున్న సీబీఐ- విధి నిర్వహణలో తాను ఎదుర్కొంటున్న అవరోధాల్ని పార్లమెంటరీ కమిటీ ఎదుట ఇటీవల ఏకరువు పెట్టింది. పశ్చిమ్ బంగ, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, పంజాబ్ వంటి ఎనిమిది రాష్ట్రాలు తమ పరగణాల్లో కేదసకు బేషరతు దర్యాప్తు అవకాశాన్ని నిరాకరించాయంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు, పీఎస్‌యూల్లోని పెద్దల ఆర్థిక అవకతవకలు, అవినీతిపై దర్యాప్తు జరపడం కష్టతరంగా మారిందని వాపోయింది. ఆ దురవస్థకు విరుగుడుగా ప్రస్తుత చట్టాన్ని సవరించడం, లేదా కేదస పనిపోకడల్ని స్పష్టంగా నిర్వచిస్తూ కొత్త చట్టం చేసి మరిన్ని అధికారాలు దఖలు పరచే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీ తాజాగా సూచించింది.
సంస్కరణలు అవసరం
కేదసకు మాతృక అయిన 1946 నాటి డీఎస్‌పీఈ చట్టంలోని ఆరో విభాగం- కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప తక్కినచోట్ల కేదస దర్యాప్తునకు ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని నిర్దేశిస్తోంది. సమాఖ్య స్ఫూర్తి భావనకు, కేంద్రం రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణకు గొడుగుపట్టే ఆ నిబంధనను నీరుగార్చేలా సీబీఐ కోసం ప్రత్యేక చట్టాన్ని చేసే అధికారం కేంద్రానికి లేదని అటార్నీ జనరల్‌గా పనిచేసిన న్యాయకోవిదులు సీకే దఫ్తరి, నిరేన్ దె అయిదు దశాబ్దాల క్రితమే స్పష్టీకరించారు. కేదస దర్యాప్తులకు రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి అని నిరుడు నవంబరులో సుప్రీంకోర్టూ రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి పట్టం కట్టింది. విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా కేదస పనితీరు దిగజారబట్టే దాని విశ్వసనీయత కొడిగట్టిపోయింది. దాని ప్రతిష్ఠ ఇనుమడించాలంటే ప్రత్యేక చట్టం కాదు, పాలక పార్టీ పంజరం నుంచి విముక్తం చేసే గట్టి సంస్కరణలు పట్టాలకెక్కాలి!