'ఒక నిర్దిష్ట సమయంలో మన జీవితంలో జరుగుతున్న వాటిపై మనం అదుపు కోల్పోతాం. తరవాత నియంత్రణ అంతా ఆ విధి చేతుల్లోకి మారిపోతుంది' అనే సమాధానం- ప్రపంచంలో గొప్ప అబద్ధంగా ప్రచారంలో ఉంది. ఒక బాలుడు అడిగిన ప్రశ్నకు ఓ పెద్దాయన ఇచ్చిన జవాబుగా దీన్ని చెబుతారు. అంతకంటే పెద్ద అసత్యంతో ఈ రికార్డును విరగ తిరగరాశారు మన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు మన్సుఖ్ మాండవీయ. ఇప్పట్లో ఈ రికార్డును బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాకపోవచ్చు.
'కొవిడ్ కాలంలో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని, ఆ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా ఏమీ నివేదించలేదు' అని రాజ్యసభకు తెలియజెప్పడం ద్వారా ఆయన ఆ ఘనతను సాధించారు. ఇందులో ఆయన నిమిత్తమాత్రుడు. మనసావాచా కర్మణా కేంద్ర ప్రభుత్వం చెప్పమన్నది అక్షరం పొల్లుపోకుండా యథాతథంగా అప్పజెప్పారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే అది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేసి ఉండాలి. ఆ పెద్దాయన చెప్పినట్లు ఈ దశలో మన మంత్రిగారు స్వీయ నియంత్రణ కోల్పోయి అంతా కేంద్రం అనే విధి చేతికి అప్పగించేశారు. తనపై వేసిన క్రూర మరణాల ఆరోపణల తీవ్రతను తగ్గించినందుకు ఘోర కరోనా సైతం సజల నయనాలతో మంత్రి మహాశయుడికి మనసులో వేనవేల కృతజ్ఞతలు చెల్లించుకొని ఉంటుంది.
రాష్ట్రాల వైపు మళ్లించేందుకు యత్నం..
మహాభారత యుద్ధంలో పాండవ సేనపై చెలరేగిపోతున్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి సాక్షాత్తు ధర్మరాజుతో 'అశ్వత్థామ హతః... కుంజరః' అని కృష్ణుడు చెప్పించాడు. 'అశ్వత్థామ హతః..' అని పెద్దగా చెప్పిన తరవాత 'కుంజరః' అనే సమయంలో భేరీలు మోగించారట, ద్రోణాచార్యుడికి పూర్తిగా వినిపించకుండా. అలాగే ఉంది ప్రస్తుతం కేంద్రం పరిస్థితి. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక తాకిడిని రాష్ట్రాల వైపు మళ్ళించే ప్రయత్నమో ఏమో, 'ప్రాణవాయువు కొరతతో ఎవరూ చనిపోలేదు' అని చెప్పి, దానికి- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం మేరకు అనే ట్యాగ్‌లైన్ తగిలించి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. రోగులకు అవసరమైనంత ఆక్సిజన్ ప్రభుత్వాలు అందించడం లేదని కొన్ని ఆసుపత్రులు కోర్టులకు మొరపెట్టుకోవడం మంత్రిగారి దృష్టికి వచ్చినట్లు లేదు.
ప్రత్యేక రైళ్లు, రోడ్డు, జల, వాయు మార్గాల్లో ఆక్సిజన్ సిలిండర్లను హుటాహుటిన తరలించిన సంగతిని అంత త్వరగా మరచిపోగలగడాన్ని మెచ్చుకోవాల్సిందే. విదేశాల ఔదార్యంతో వెల్లువెత్తిన ఆక్సిజన్ ట్యాంకర్లు, కాన్సన్‌ట్రేటర్ల విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం సందర్భోచితంగా తోస్తోంది. ప్రాణ, విత్త, మానహాని విషయాల్లో బొంకవచ్చని భావించి, అబద్ధాలు అప్పుడప్పుడు రాజకీయాలకు ఆక్సిజన్ వంటివని గుర్తించి ఆచరించడాన్ని అర్థం చేసుకోకుండా మంత్రిగారిపై విపక్షాలు విరుచుకుపడటం విడ్డూరమే. మొత్తానికి చూసింది వదిలేసి, చెప్పింది వినండి.. కళ్లను కాదు చెవులను నమ్మండి అని అమాత్యులు ఆ రకంగా సెలవిచ్చినట్లున్నారు. కాబట్టి తమ ఆత్మీయులు, బంధువులు ఆక్సిజన్ లేక అసువులు బాశారని, గుండెలు బాదుకుంటూ బాధితులు వాపోయినట్లు వచ్చిన మీడియా కథనాలను, టీవీల ప్రసారాలను, సామాజిక మాధ్యమ షేరింగ్‌లను కట్టుకథలుగా కొట్టేయాల్సిందే.