మానవ ప్రగతి ప్రస్థానంలో విద్యే సిసలైన వికాస దీపం. ఆ కాంతిపుంజాల వెలుగులో రేపటి పౌరుల జీవితాలు తేజోమయమయ్యేలా గురుశ్రేష్ఠులు సాగించే నిబద్ధ కృషే అర్థవంతమైన జాతి నిర్మాణం. ప్రతి బడీ దేశప్రగతికి నారుమడై వర్ధిల్లాలంటే- సరైన మౌలిక వసతులు, ఆహ్లాదభరిత వాతావరణం, అంకితభావం కలిగిన బోధన సిబ్బందికి విద్యాలయ ప్రాంగణాలు చెరగని చిరునామాలు కావాలి. వాస్తవంలో తాగునీటికి, మరుగుదొడ్లకు సైతం నోచని పాఠశాలలు దేశంలో ఇంకా వేలసంఖ్యలో ఉన్నట్లు కేంద్ర విద్యామంత్రి రమేశ్ పోఖ్రియాల్ పార్లమెంట్లో తాజాగా చేసిన ప్రకటన స్పష్టీకరిస్తోంది. 42వేల సర్కారీ బడుల్లో గుక్కెడు గంగకు, 15వేల పాఠశాలల్లో అత్యవసరమైన మరుగుదొడ్లకు నేటికీ కరవేనని అమాత్యులు చెబుతున్నా- నిర్దేశిత గడువులోగా నూరుశాతం లక్ష్యం సాధించేసినట్లు 'స్వచ్ఛ విద్యాలయ పోర్టల్' ఆమధ్య ఘనంగా చాటింపు వేసింది. ఆ బడాయి కబుర్లకు 'కాగ్' నివేదిక ఆరు నెలలక్రితమే గాలి తీసేసింది.
కాగ్ నివేదిక
మచ్చుకు 15 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట్ల చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో 75 శాతం టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించడం లేదని, కనీసం లక్షా 40వేల మరుగుదొడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని, అసలు నిర్మాణానికే నోచనివి 40 శాతందాకా లెక్క తేలాయని 'కాగ్' తూర్పారపట్టింది. యథార్థాలకు మసిపూసి మారేడు చేసిన చందంగా నీటి సదుపాయలేమి, టాయిలెట్ల నిర్మాణం, మరుగుదొడ్ల అధ్వాన నిర్వహణపై దొంగలెక్కలు ఇప్పటికీ విరివిగా చలామణీ అవుతూనే ఉన్నాయి! మరోవైపు, దేశంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలెన్నో అవినీతిమయమై నేలబారు ప్రమాణాలకు నెలవయ్యాయన్న అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనాంశాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. గురువులకు సరైన ఒరవడి దిద్దాల్సిన శిక్షణ సంస్థలే సర్వభ్రష్టమైతే వాటిల్లే దుష్పరిణామాలు అడుగడుగునా ప్రస్ఫుటమవుతున్నాయి. బడి చదువుల గతిరీతుల ప్రాతిపదికన ఇండియా యాభైఏళ్లు వెనకబడి ఉందన్న 'యునెస్కో' నిర్ధారణకు మూలాలు ఎక్కడున్నాయో వేరే చెప్పేదేముంది?