కరోనా సృష్టించిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఓపెన్ బుక్ పరీక్ష పద్ధతి సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలు నిర్ణయాన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల విచక్షణకే విడిచిపెట్టాయి. పుస్తకాల్లో చూసి పరీక్షలు రాసే పద్ధతిని కరోనా కంటే ముందు నుంచే ప్రపంచంలో చాలా విద్యాసంస్థలు అనుసరిస్తున్నాయి. మన దేశంలోనూ లాగరిథమ్స్ పుస్తకాలు, చట్టాల పత్రాలను, దత్తాంశాల్ని పరిశీలించేందుకు విద్యార్థులకు అనుమతి ఉంది. దిల్లీ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఈ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపాయి. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచి పాలిటెక్నిక్ కోర్సుల్లో పాక్షికంగా ఓపెన్ బుక్ పద్ధతిని ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. దేశంలో వివిధ వర్సిటీలు, విద్యాసంస్థలు భవిష్యత్తులో ఈ పద్ధతి దిశగా అడుగులు వేసే అవకాశాలున్నాయి.
జ్ఞానసముపార్జనకు పెద్దపీట
విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, నోట్సు చూసి పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు రాసే పద్ధతి ఓపెన్ బుక్ పరీక్ష. దీన్ని రెండు విధాలుగా నిర్వహిస్తారు. సంప్రదాయంగా నిర్దిష్ట కాల వ్యవధితో పరీక్ష గదిలో నిర్వహించడం ఒకటైతే, ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే పరీక్షలు రాసే వీలు కల్పించడం రెండోది. దిల్లీ విశ్వవిద్యాలయం ఈ పద్ధతిలో ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించింది. ఇందులో ఆమోదించిన నిర్దిష్ట పుస్తకాలు, సమాచారాన్ని మాత్రమే పరీక్ష గదిలోకి తీసుకెళ్ళేందుకు అనుమతించడం ఒక పద్ధతి; ఎలాంటి పరిమితులూ లేకుండా సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడం మరొక పద్ధతి. సంప్రదాయ పరీక్ష పద్ధతిలో విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరీక్షించేందుకే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులు తరగతిలో విన్న, చదివిన, విషయాలను జ్ఞాపకం ఉంచుకొని పరీక్షలో తిరిగి రాయవలసి ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు బట్టీ పద్ధతిని అనుసరిస్తారు. ఇందుకు భిన్నంగా, ఓపెన్ బుక్ పరీక్ష పద్ధతి- విద్యార్థుల అవగాహన, జ్ఞానసముపార్జన, జిజ్ఞాస, శోధన నైపుణ్యానికి పెద్దపీట వేస్తుంది. విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు పొందేందుకు, ఉద్యోగాల్లో ఉన్నతికి ఈ తరహా జ్ఞానసముపార్జన ఎంతో అవసరం.
జవాబులు రాబట్టేలా..
ఓపెన్ బుక్ పరీక్షా పద్ధతిలో పుస్తకాల నుంచి నేరుగా సమాధానాలు రాసేలా ప్రశ్నలు ఉండవు. అధ్యయన అంశానికి సంబంధించి సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా జవాబులు రాబట్టేలా ప్రశ్నలు సంధిస్తారు. అధ్యయన విషయంపై పరిపూర్ణ పరిజ్ఞానం, మౌలిక భావనలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రశ్నలకు సమాధానం రాయడం సాధ్యమవుతుంది. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే ఆలోచనా నైపుణ్యాన్ని వెలికి తీసేలా ప్రశ్నలు ఉంటాయి. ఈ విధానంలో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ప్రత్యేకంగా శ్రమించాల్సి ఉంటుంది. అధ్యయన అంశంపై పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగించేందుకు ఓపెన్ బుక్ పద్ధతి ఒక సాధనం. సంప్రదాయ పరీక్షా పద్ధతితో పోలిస్తే, ఈ పద్ధతి కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. అధ్యయన అంశానికి చెందిన ముఖ్య అంశాలను, సూత్రాలను బట్టీపట్టాల్సిన అవసరం లేదు. సమాధానం రాయడంలో ఎక్కడైనా గుర్తుకు రాకపోతే విద్యార్థులు ఆందోళనకు, భయానికి, ఒత్తిడికి గురికావాల్సిన అవసరం ఉండదు. కాపీ కొట్టే పరిస్థితి ఉండదు. సంప్రదాయ పరీక్ష పద్ధతి కంటే, విద్యార్థులు అధిక మార్కులు, గ్రేడ్లను పొందగలరని ఈ పద్ధతిపై జరిపిన అధ్యయనాల్లో తేలింది. పరీక్షల నిర్వహణ వ్యయం, సమయం, కాగితం వినియోగం ఆదా అవుతాయి. విద్యార్థులు పరీక్షలను తేలికగా తీసుకుని చదవడం మానేస్తారని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని, వారి పురోగతికి హానికరమనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ పద్ధతిపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తే, మెరుగైన మానవ వనరులుగా రూపొంది, పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారు.