తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆన్‌లైన్‌ విద్య.. ఇంకా ఎంత దూరం?

కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యా రంగంలో విశేష మార్పులు వస్తోన్నాయి. ఆన్​లైన్​ విద్యకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ విషయంలో అధ్యాపకులు, విద్యార్థులతో సహా తల్లిదండ్రులపై అదనపు భారం పడనుంది. అయినప్పటికీ విద్యాసంవత్సరం వృథా కాకుండా ఆన్​లైన్​ విధివిధానాలపైనే దృష్టిసారిస్తోంది ప్రభుత్వం.

Online Education
ఆన్‌లైన్‌ విద్య.. ఇంకా ఎంత దూరం?

By

Published : Jun 8, 2020, 11:15 AM IST

మహా దావానలాన్ని తలపిస్తున్న కొవిడ్‌ కేసుల ప్రజ్వలనానికి విశ్వవ్యాప్తంగా అనేక రంగాలు కమిలిపోతున్నాయి. ముఖ్యంగా విద్యారంగాన కరోనా ప్రభావం విశేష మార్పులకు తెరతీస్తోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా నేడు ఎన్నోచోట్ల, ఆన్‌లైన్‌ విద్య సాధక బాధకాలపై ముమ్మర చర్చ సాగుతోంది. తప్పనిసరై ఆన్‌లైన్‌ బోధనకు అలవాటు పడటానికి విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని; ప్రపంచం నలుమూలలా 70 శాతం విద్యార్థుల చదువులు పెద్ద కుదుపునకు లోనయ్యాయన్నది ఇటీవలి అధ్యయన సారాంశం. అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరం వృథా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో తరగతులు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం విధివిధానాలపై మార్గదర్శకాలూ వెలుగు చూస్తున్నాయి.

అదనపు భారం..

'ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌' ప్యాకేజీలో భాగంగా వంద ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌ కోర్సులకు అనుమతించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు, ఆన్‌లైన్‌ విద్యా సన్నాహకాలు దిగువ, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్లను తలకిందులు చేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభిస్తున్న నేపథ్యంలో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, వైఫై కనెక్షన్ల నిమిత్తం ఈ ఏడాది ఒక్క తెలంగాణలోనే తల్లిదండ్రులపై రూ. 5,500 కోట్ల దాకా అదనపు భారం పడిందని అంచనా. తరతమ భేదాలతో తక్కిన రాష్ట్రాల్లోనూ ఇదే కథ. వ్యవస్థాగతంగా సన్నద్ధత ఏపాటి అని ఆరా తీయబోతే నిస్పృహ రగలక మానదు. నెట్‌వర్క్‌ సమస్యల్ని చురుగ్గా పరిష్కరించనంతవరకు దేశీయంగా ఆన్‌లైన్‌ బోధన సరైన గాడిన పడదు!

ఇంటర్నెట్​ సేవలు - ప్రాథమిక హక్కు

నిరుడు ఆగస్టులో జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు దరిమిలా అక్కడ నిషేధాజ్ఞల విధింపుతోపాటు టెలిఫోన్‌ అంతర్జాల సదుపాయాలపై వేటు రాజ్యాంగ విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. అంతర్జాల సేవలు పొందడమూ పౌరుల ప్రాథమిక హక్కేనని అప్పట్లో న్యాయపాలిక స్పష్టీకరించింది. దీర్ఘకాలం ఆ సేవల్ని నిలిపివేయడం కుదరదనీ ప్రభుత్వాలకు నిర్దేశించింది. దురదృష్టవశాత్తు, దేశంలో ఎన్నో చోట్ల ఆ ‘హక్కు’ కొల్లబోతూనే ఉంది! గ్రామ పంచాయతీలన్నింటికీ అంతర్జాల సేవలు అందించడానికి 2012లోనే ‘జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌’ ప్రయోగం మొదలైనా కార్యాచరణలో చతికిలపడింది. బ్రాడ్‌బ్యాండ్‌ హైవేలు, పౌరులందరికీ అంతర్జాల సేవలంటూ మోదీ ప్రభుత్వం ‘డిజిటల్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టింది.

'ఫైబర్‌గ్రిడ్'​ వస్తేనే..

భారత్‌నెట్‌ ద్వారా లక్షా 30 వేల గ్రామపంచాయతీలు, సుమారు 48 వేల గ్రామాలు ఇప్పటికే అనుసంధానమయ్యాయని, మొత్తం రెండున్నర లక్షల పంచాయతీల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ స్వప్నం త్వరలో ఈడేరుతుందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరు నెలల క్రితం ప్రకటించారు. పనులు పూర్తయ్యాయన్న గ్రామ పంచాయతీల్లో నెట్‌ సేవలకు నిజంగా సిద్ధమైనవి కేవలం ఎనిమిది శాతమేనన్న గణాంకాలు- ప్రకటనలకు, వాస్తవిక స్థితిగతులకు మధ్య భారీ అంతరాన్ని ప్రస్ఫుటీకరిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 42 శాతం, పల్లెల్లో 15 శాతమే అంతర్జాల వసతి కలిగి ఉండగా- దేశవ్యాప్తంగా సొంత కంప్యూటర్లు ఉన్న కుటుంబాలు 11 శాతమేనని రెండేళ్లనాటి జాతీయ నమూనా అధ్యయనం వెల్లడించింది. బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌కన్నా తీసికట్టుగా ఇండియా 132వ స్థానాన నిలిచింది. దేశవ్యాప్తంగా ఫైబర్‌గ్రిడ్‌ పనులు చురుగ్గా చేపట్టి అంతర్జాల వేగాన్ని ఇనుమడింపజేస్తేనే- ప్రాథమిక హక్కుగా నెట్‌ అనుసంధానత సాకారమవుతుంది. దేశంలో ఆన్‌లైన్‌ విద్యావ్యవస్థ పట్టాలకు ఎక్కుతుంది!

ఇదీ చదవండి:ఆఫీస్​ పనుల్లో రోబోలు.. అందుకోసమే!

ABOUT THE AUTHOR

...view details