కొవిడ్ సంక్షోభంతో విద్యాసంస్థలను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 160 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. ఇందులో భారత్‌కు చెందిన విద్యార్థులూ 32 కోట్లమంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా పాఠశాలలు, 50 వేల ఉన్నత విద్యాసంస్థలు కరోనా సంక్షోభంలో మూత పడ్డాయి. పరీక్షలను రద్దు చేయడం, అంతర్గత మూల్యాంకనంతో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడంవంటి పద్ధతుల ద్వారా కొన్ని తరగతుల విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోమార్గం లేకపోయినప్పటికీ- ఈ పద్ధతులు భవిష్యత్తులో వారి ఉన్నత విద్యాభ్యాసం, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తాజా విద్యాసంవత్సరం (2021-2022)లో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించి, పటిష్ఠ విధానాలను రూపొందించి అమలు చేయాలి.
ఆశాకిరణంగా డిజిటల్ బోధన
విద్యాసంస్థలు కరోనా విసిరిన సవాలును దీటుగా ఎదుర్కొంటూ, విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి. ప్రత్యక్ష బోధన స్థానంలో ఆన్‌లైన్ అభ్యసనం ప్రవేశించింది. విద్యాపరమైన రేడియో, టీవీ ఛానళ్లు, యాప్‌ల వినియోగం అకస్మాత్తుగా ఊపందుకుంది. లాక్‌డౌన్ సమయంలో వాట్సాప్, జూమ్, గూగుల్ మీట్, యూట్యూబ్ లైవ్, ఫేస్‌బుక్ లైవ్ వంటి డిజిటల్ వేదికల ద్వారా ఆన్‌లైన్ బోధన జరిగింది. నూతన విద్యావిధానం సైతం డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించాలని.. ప్రత్యక్ష, ఆన్‌లైన్ పద్ధతులను కలగలిపిన మిశ్రమ విద్యాబోధనను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి.
మాధ్యమిక విద్యా బోధనలో దీక్ష, ఈ-పాఠశాల, నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ వంటి పోర్టళ్లు, యాప్‌లను వినియోగించుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. ఉన్నత విద్యాసంస్థలు స్వయం, స్వయంప్రభ, ఈ-పీజీ పాఠశాల తదితర వేదికల ద్వారా డిజిటల్ విద్యను ప్రోత్సహించాలని పేర్కొంది. ఉన్నత విద్యారంగంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కోర్సులను 40శాతం ఆన్‌లైన్ ద్వారా, మిగిలిన 60శాతం సంప్రదాయ బోధనా పద్ధతుల ద్వారా నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా పత్రాన్నీ రూపొందించింది.
భవిష్యత్తులో డిజిటల్ బోధన అనివార్యంగా మారుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మానసికంగా, మౌలిక వసతులపరంగా, సంసిద్ధతను కలిగి ఉండాలి. నూతన విద్యావిధానం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు మిశ్రమ బోధన పద్ధతిని ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభను మదింపువేయడంలో ఈ పద్ధతి కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిరంతర, విస్తృత మూల్యాంకన ప్రక్రియ ద్వారా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థుల సామర్థ్యాన్ని మదింపు చేస్తాయి. మిశ్రమ విద్యాబోధన వంటి సంస్కరణల అమలు అంత సులభం కాదు. అవగాహన స్థాయి, సాంకేతిక అంతరం, మౌలిక సదుపాయాల కొరత, విద్యుత్ సమస్య వంటివి ఇందులో ప్రధాన అవరోధాలుగా నిలుస్తాయి.