ఏ కారణంగానైనా సరఫరా, గిరాకీల మధ్య అంతరం పెరగనుందన్న సంకేతాలు వెలువడటం తరువాయి, విపణి శక్తుల గూడుపుఠాణితో వినియోగదారుల వీపులపై వాతలు తేలడం చూస్తున్నాం. ఉల్లి రేటుకు ఉన్నట్టుండి రెక్కలు మొలుచుకురావడం- ఆ కోవలోని తాజా దృష్టాంతం. లాక్‌డౌన్ సమయంలో కొనుగోలుదారులు కానరాక పంటను పొలాల్లోనే వదిలేసిన రైతులు, రోజుల వ్యవధిలో ఇంతటి మార్పా అని వినియోగదారులు బిత్తరపోయి చూస్తుండగానే- చిల్లర మార్కెట్లో ఉల్లి ధర కిలో వంద రూపాయల దాకా ఎగబాకింది. దేశీయ విపణుల్లో ఉల్లిగడ్డల సరఫరా పెంచి ధరల ప్రజ్వలనాన్ని నియంత్రించేందుకంటూ గత నెలలోనే కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు విధించినా- జరిగింది వేరు.
వరదల పర్యవసానం..
వరదల పాలబడిన పర్యవసానంగా, ఖరీఫ్ తొలి అంచెలో అక్కరకు రావాల్సిన ఉల్లి చాలాచోట్ల నేలలోనే కుళ్ళిపోయింది. నవంబరు చివరి నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ల నుంచి కొత్త పంట అందుబాటులోకి వచ్చేదాకా తామేం చేసినా చెల్లుబాటవుతుందన్న టోకు వ్యాపారుల తెంపరితనం- తరతమ భేదాలతో దేశమంతటా ఉల్లి రేటును భగ్గుమనిపించింది. దేశంలో ఏటా సుమారు రెండు కోట్ల 35 లక్షల టన్నుల మేర ఉల్లిపాయలు ఉత్పత్తవుతుండగా, దాదాపు కోటీ 50 లక్షల టన్నుల దాకా వినియోగమవుతున్నట్లు అంచనా. ఆ లెక్కన దేశీయావసరాలు పోను నికరంగా విదేశాలకు ఎగుమతి చేయాల్సింది పోయి, అడపాదడపా దిగుమతులపై ఎందుకు ఆధారపడాల్సి వస్తోంది? తాజాగా విదేశీ దిగుమతులకు కేంద్రం కల్పించిన వెసలుబాటు తాత్కాలిక ఉపశమనమే! భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫిక్కి) వంటివి బ్రెజిల్, ఇజ్రాయెల్ తరహా నమూనాలు సూచించినా- ఆ సలహాలు అరణ్య రోదనమవుతున్నాయి. సరైన నిల్వ వసతులు కొరవడి ఉల్లి పంటలో 40శాతందాకా చేజారుతోందన్న గణాంకాలు సమస్య మూలాల్ని కళ్లకు కడుతున్నాయి.
ఉల్లితో పాటు పళ్లు..
ఒక్క ఉల్లిగడ్డలనేముంది- దేశంలో పండించే పళ్లు, కూరగాయల్లో కనీసం 16శాతం, తృణధాన్యాలు తదితరాల్లో 10శాతం వరకు ఏటా నష్టపోతున్నట్లు సర్కారీ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అవసరమైన చోట్ల తగినన్ని శీతల గిడ్డంగులు కరవై దేశంలో ఆనవాయితీగా సంభవిస్తున్న వార్షిక నష్టం ఎకాయెకి రూ.92వేల కోట్లు! టార్పాలిన్లు సైతం కరవై మార్కెట్ యార్డుల్లో అపార ధాన్యరాశి వృథాగా పోతోంది. అందివచ్చిన సేద్య ఉత్పత్తుల్ని భద్రపరచడంలో ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా ధరవరల్లో ఊహాతీత హెచ్చుతగ్గులు సంభవిస్తున్నాయి. అందుకు అటు రైతులు, ఇటు వినియోగదారులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా మూడు కోట్ల టన్నులకు పైగా సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా- అందులో మూడొంతుల మేర ఆలుగడ్డల నిల్వలకు ఉద్దేశించినవే. ఆసేతు హిమాచలం జోన్లవారీగా ఏయే పంటల సాగుకు అనుకూలమో పంచాయతీల సాయంతో శాస్త్రీయంగా మదింపు వేశాక, అందుకు అనుగుణంగా రాష్ట్రాల సమ్మతితో జాతీయ సేద్య ప్రణాళిక పట్టాలకు ఎక్కాలి.
ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వచ్చినట్లయితే ఎక్కడా వృథా కాని రీతిలో నిల్వ చేయడానికి, ఏ కారణంగానైనా ఫలానా పంట దెబ్బతింటుందన్న సూచనలు రాగానే దిగుమతులు రప్పించడానికి వ్యవస్థాగత ఏర్పాట్లు రూపుదిద్దుకోవాలి. సేద్య ఉత్పత్తుల నిల్వకు అనువైన గోదాముల నిర్మాణం; విదేశాలకు ఎగుమతులు, అత్యవసరమైనప్పుడు దిగుమతుల అంశాల్ని కేంద్రమే నిభాయించాలి. గిడ్డంగుల నిర్వహణ, వివిధ రకాల పంటల బాగోగుల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్రాలు తలకెత్తుకోవాలి. అర్థవంతమైన సమన్వయంతో సేద్యాన్ని పండించే వ్యూహాన్ని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సాకారం చేసినప్పుడే- ప్రజానీకం తరచూ ధరాఘాతాల పాలబడే పీడ విరగడ అవుతుంది!
ఇదీ చూడండి:నావికాదళంలో చేరనున్న 'ఐఎన్ఎస్ కవరత్తి' యుద్ధనౌక