చైనా పని పడతానంటూ మొదటి నుంచీ హుంకరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య టిక్‌టాక్‌ను నిషేధించబోతున్నట్లు ప్రకటించారు. తమ దేశ డిజిటల్ మార్కెట్‌లోకి విదేశీ సంస్థలను అనుమతించకుండా- తాను మాత్రం ప్రపంచ మార్కెట్‌లోకి దూసుకుపోతున్న చైనాకు, ట్రంప్ కళ్లెం బిగిస్తారని చాలామంది ఆశించారు.
అన్ని దేశాలూ ఇచ్చిపుచ్చుకొనే వైఖరితో స్వేచ్ఛగా ఇంటర్నెట్‌ను నిర్వహించాలని, దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్న చైనాను దారికి తీసుకురావాలని అందరి అభిప్రాయం. కానీ, ఒన్ బెల్ట్ ఒన్ రోడ్, సముద్ర సిల్క్ రూట్ లతోపాటు డిజిటల్ సిల్క్ రూట్ లతో ప్రపంచంలో అగ్ర ఆర్థిక శక్తిగా అవతరించాలనుకుంటున్న చైనా వ్యూహం వేరు. ఆ వ్యూహంలో టిక్‌టాక్ యాప్ ఒక కీలక అంతర్బాగం. ఈ యాప్‌ను కనుక అమెరికా నిషేధించి ఉంటే- చైనాకు 10,000 కోట్ల డాలర్ల (రూ.7లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లేది.
చైనాకు కత్తీ డాలుగా అమెరికా కంపెనీలు
చైనా యాప్ టిక్‌టాక్‌వల్ల అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదమంటూ ట్రంప్ ఆగస్టు 6న నిషేధం విధించారు. తరవాత ఆగస్టు 14న జారీ చేసిన ఉత్తర్వులో టిక్‌టాక్ అమెరికాలో తన వ్యాపారాన్ని నవంబరు 12లోగా స్థానిక సంస్థలకు విక్రయించాలని, లేకుంటే తమ దేశం నుంచి నిష్క్రమించాలని షరతు విధించారు.
సెప్టెంబరు 20లోగా గూగుల్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్‌ను తొలగించాలని ఆదేశించారు. ఇంతలో సెప్టెంబరు 19న టిక్‌టాక్ అమెరికన్ కంపెనీలు ఒరాకిల్, వాల్‌మార్ట్‌లతో కలిసి టిక్‌టాక్ గ్లోబల్ అనే నూతన సంస్థగా ఏర్పడతాయని ప్రకటన వెలువడింది. అమెరికా నుంచి కార్యకలాపాలు నడిపే ఆ సంస్థలో ఒరాకిల్, వాల్‌మార్ట్‌లకు చెరి 20శాతం వాటాలు ఉంటాయి. ఈ ఒప్పందం ఖరారు కావడానికి వ్యవధి ఇస్తూ, టిక్‌టాక్ డౌన్‌లోడ్‌లపై నిషేధాన్ని సెప్టెంబరు 27 వరకు పొడిగించారు. దీనిపై టిక్‌టాక్ కోర్టుకు వెళ్లగా, డౌన్‌లోడ్‌లపై నిషేధాన్ని జడ్జి తాత్కాలికంగా వాయిదా వేశారు. టిక్‌టాక్‌ను అమెరికన్ సంస్థలకు విక్రయించాలనే షరతును నవంబరు 12లోగా నెరవేర్చకపోతే మాత్రం టిక్‌టాక్ ఇక అమెరికా నుంచి నిష్క్రమించాల్సిందే.
ఇంతలో, టిక్‌టాక్ విక్రయ ఒప్పందం చిక్కులో పడినట్లుంది. టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డాన్స్‌కు ఈ యాప్‌లో 80శాతం వాటా ఉంది. అమెరికా కేంద్రంగా ఏర్పడే కొత్త కంపెనీ టిక్‌టాక్ గ్లోబల్‌లో చెరి 20శాతం వాటా ఉన్న ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు కొత్త సంస్థలో బైట్ డాన్స్‌కు ప్రమేయం ఉండరాదంటున్నాయి.
అమెరికన్ వెంచర్ పెట్టుబడి సంస్థలు సెకోయియా, జనరల్ అట్లాంటిక్ భాగస్వాములకు బైట్ డాన్స్‌లో 40శాతం వాటా ఉంది. ఒరాకిల్, వాల్‌మార్ట్ వాటాలతో కలిపితే, టిక్‌టాక్ గ్లోబల్‌లో అమెరికన్ కంపెనీలకే మెజారిటీ వాటా లభించినట్లవుతుంది. అమెరికాలో ఈ సంస్థ సర్వర్లను ఒరాకిల్ నిర్వహిస్తుంది. ట్రంప్ నిషేధంవల్ల తమ పెట్టుబడులు దెబ్బతినకుండా చూసుకోవడానికి వెంచర్ పెట్టుబడిదారులు వాషింగ్టన్‌లో పెద్దయెత్తున పైరవీలు చేస్తున్నారు.