హిమాలయ దేశం నేపాల్‌లో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభం రగులుతోంది. పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలే ఈ స్థితికి కారణం. ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలికీ సొంత పార్టీలో అసమ్మతి నాయకుడైన పుష్ప కుమార్ దహల్ (ప్రచండ)కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఓలీ- ప్రజాప్రతినిధుల సభను రద్దు చేసి, అందర్నీ దిగ్భ్రాంతపరిచారు. ఓలీ అప్రజాస్వామిక చర్యపై తాము జరుపుతున్న పోరుకు అండగా నిలవాల్సిందిగా ప్రచండ- భారత్, చైనాలతో పాటు అంతర్జాతీయ సమాజాన్నీ కోరారు. పదవీ పీఠాన్ని కాపాడుకునేందుకు ఓలీ ఏకంగా పార్లమెంటు రద్దుకే తెగబడటాన్ని ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా భారత్, నేపాల్ మధ్య సంబంధాలు సజావుగా లేవు. లింపియాధురా-లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు మావంటే మావని రెండు దేశాలూ భీష్మించడం దీనికి కారణం. ఈ అభిప్రాయ భేదాలు రెండు దేశాల మధ్యనున్న చిరకాల స్నేహ, సాంస్కృతిక బంధాన్ని దెబ్బతీయకూడదనే భావన బలంగా ఉండటంతో, పొరపొచ్చాలు అధిగమించడానికి గట్టి కృషి జరుగుతోంది. ఓలి చర్యతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన తరుణంలో- భారత్ ఎలా వ్యవహరించాన్నది కీలకంగా మారింది. రాజకీయ ప్రతిష్టంభనను అధిగమించడానికి ఎవరి సహాయాన్నయినా కోరే హక్కు సార్వభౌమ దేశమైన నేపాల్‌కు ఉందనడంలో సందేహం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్‌లో జోక్యానికి భారత్ సంసిద్ధంగా లేదు.
నేపాల్‌లో ప్రస్తుతం జరుగుతున్నది పూర్తిగా ఆ దేశ ఆంతరంగిక వ్యవహారమనీ, దాన్ని నేపాలీయులే పరిష్కరించుకోవాలని దిల్లీ భావిస్తోంది. ‘భారత్, నేపాల్ నాగరికతల మధ్య తరతరాలుగా ఆదానప్రదానాలు ఉన్నమాట నిజం. మనం ఎల్లప్పుడూ నేపాల్ శ్రేయోభిలాషులమే. అక్కడ ఏర్పడిన ఎలాంటి భేదాభిప్రాయాలనైనా నేపాలీయులు తమ రాజ్యాంగ చట్రంలో శాంతియుత సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోగలరని భారత్ నమ్ముతోంది. అలానే జరగాలని కోరుకొంటోంది. అదే దిల్లీ అధికార వైఖరి కూడా. నేపాల్ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు’ అని భారత మాజీ రాయబారి విష్ణు ప్రకాశ్ స్పష్టం చేశారు. నేపాలీలు, వారి నాయకులు ఎంతో ఆత్మాభిమానం కలిగినవారనీ, వారు అసలుసిసలు జాతీయవాదులనీ ఆయన ఉద్ఘాటించారు. నేపాలీలు చైనాకు వ్యతిరేకమా, అనుకూలమా అనేది ముఖ్యం కాదు, వారు సర్వకాల సర్వావస్థల్లో నేపాల్‌కే అనుకూలమనేది నిర్వివాదాంశమన్నది విష్ణు ప్రకాశ్ పరిశీలన.
275మంది సభ్యులు గల నేపాల్ ప్రజాప్రతినిధుల సభను ప్రధాని ఓలీ రద్దుచేయడంపై దేశమంతటా నిరసన ప్రదర్శనలు పెల్లుబికాయి. పాలక కమ్యూనిస్టు పార్టీలోని ప్రచండ వర్గం దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్‌ల నాయకత్వంలోని ఈ వర్గం రాజధాని ఖట్మండూలో భారీ ర్యాలీ నిర్వహించింది. పార్లమెంటు రద్దుకు ఓలీ తీసుకున్న అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాన్ని నేపాల్ సుప్రీంకోర్టు ఆమోదించదన్నది ప్రచండ అభిప్రాయం. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరువురి నాయకుల్లో ఏ ఒక్కరి వైపూ మొగ్గే ప్రసక్తి కనిపించడం లేదు.