One Nation One Election : దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడమే జమిలి ఎన్నికలు. ప్రస్తుతం శాసనసభలకు, లోక్‌సభకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం-ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానిగా మోదీ తొలిసారి అధికారం చేపట్టిన నాటి నుంచే దీనిపై మాట్లాడుతున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ఎందుకంటే ఇందుకు ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. జమిలి ఎన్నికల బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదం తెలపాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక దానికి మద్దతు ఇచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఎన్‌డీఏకు లోక్‌సభలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61శాతానికి సమానం. మరో 5శాతం ఓటింగ్‌ను బీజేపీ సాధించాల్సి ఉంటుంది. ఇక రాజ్యసభలో కేవలం 38శాతం మాత్రమే సీట్లు ఉన్నాయి. ఇక్కడ మూడింట రెండొంతుల మెజార్టీతో బిల్లు నెగ్గడం కష్టంతో కూడుకున్న పని.
Election Expenditure In India 2019 :దేశంలో లోక్‌సభ, శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ఎంతో ఆర్థిక భారం పడుతోంది. అదంతా ప్రజల నుంచి పన్నుల ద్వారా వచ్చే సొమ్మే. 2019లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లు వెచ్చించినట్లు అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్ర ఎన్నికలకు ప్రభుత్వం రూ. 250 కోట్ల నుంచి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం. ఇక ఈ ఖర్చుకు రాజకీయ పార్టీల వ్యయం తోడైతే కళ్లు తిరగడం ఖాయం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల రూ. 60 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు (political party expenditure) అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ వివరాలు వెల్లడించింది. భారతదేశ చరిత్రలోనే అవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి.
జమిలి ఎన్నికలతో లాభాలు..
- చాలా వరకు ఆర్థిక భారం తగ్గే అవకాశం.
- ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థంగా వినియోగించుకొనే వెసులుబాటు.
- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా సమయం ఆదా.
- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, పథకాలను అమలు చేయడంలో ఎన్నికల కోడ్ రూపంలో వచ్చే అడ్డంకులు తగ్గే అవకాశం. ప్రాజెక్టుల ప్రారంభ వంటివి ఎక్కువ వాయిదా పడవు.
- జమిలి ఎన్నికలతో ఒకేసారి అన్ని రకాల ఓటింగ్‌లు జరగడం ఓటర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఫలితంగా పోలింగ్ శాతం పెరుగుతుంది.