Ocen Framework India : 1.64కోట్ల యూనిట్లు.. సుమారు 11కోట్ల ఉద్యోగాలు.. జీడీపీలో 30% వాటా.. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల-ఎంఎస్ఎంఈ రంగం స్వరూపం ఇది. ఉత్పత్తి రంగంలో 45%, ఎగుమతుల్లో 40% వాటాలతో భారత దేశ ప్రగతి రథానికి ఇంజిన్‌లా పనిచేస్తోంది ఎంఎస్ఎంఈ రంగం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న కల సాకారానికి ఊతమివ్వగల ఎంఎస్ఎంఈలకు.. బ్యాంకు రుణాలు పొందడం అతిపెద్ద సమస్య. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్-ఐఎఫ్‌సీ నివేదిక ప్రకారం.. దేశంలోని 80% ఎంఎస్ఎంఈలకు సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రుణం అందడం లేదు. ఆయా పరిశ్రమలకు అవసరమయ్యే రుణాల విలువ ఏకంగా రూ.16.66లక్షల కోట్లని అంచనా.
Msme Loan Scheme : ఈ దుస్థితికి కారణం.. సంక్లిష్టమైన బ్యాంకింగ్ నిబంధనలు. రుణం ఇవ్వాలంటే బ్యాంకులు క్రెడిట్ హిస్టరీ చూస్తాయి. నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపే ఎంఎస్ఎంఈలకు ఇది పెద్ద సమస్య. లోన్ ఇస్తే దేనిపై పెట్టుబడి పెడతారు, ఎంత వ్యాపారం చేయగలరు, లాభం ఎంత వస్తుంది, రిస్క్ సంగతేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. బ్యాంకు అధికారుల్ని ఒప్పించడం చిన్నకారు సంస్థలకు సవాలే. బ్యాంకులకు భరోసా కల్పించేలా ఆస్తులు తనఖా పెట్టే స్థాయీ ఉండదు. ఒకవేళ ఈ అవరోధాలన్నీ దాటుకుని వచ్చినా.. బ్యాంకు రుణం మంజూరయ్యేందుకు పట్టే సమయం చాలా ఎక్కువ. ఇతర రుణాలతో పోల్చితే.. ఇలాంటి రిస్క్‌తో కూడిన పరిశ్రమల వద్ద బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటూ అధికమే. ఫలితంగా.. అనేక ఎంఎస్ఎంఈలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలే దిక్కు. అధిక వడ్డీల రుణ చట్రంలో చిక్కుకుని అవి ఎప్పటికీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలగానే మిగిలిపోతున్నాయి.
దారి చూపే ఓకెన్..
Ocen India Msme : డిజిటలీకరణ.. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది. చిరు పరిశ్రమలకు రుణాల విషయంలోనూ ఇదే దారి చూపనుంది. ఓకెన్ది.. ఇందులో ముఖ్య భూమిక! ఓకెన్ అంటే ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెటవర్క్(ఓసీఈఎన్). ఐరోపాలో ఇప్పటికే ఉన్న ఓపెన్ బ్యాంకింగ్ వ్యవస్థకు భారతీయ వెర్షన్ ఇది. రుణగ్రహీతలు, రుణదాతల మధ్య వారధిగా పనిచేస్తుంది. భారతీయ ఐటీ రంగం పురోగతి కోసం పనిచేసే మేధో సంస్థ అయిన ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్(ఐస్పిరిట్).. ఈ వికేంద్రీకృత క్రెడిట్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. 2020 జులై 22న ఓకెన్ను లాంఛ్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ వేదికగా ప్రకటించారు.
ఓకెన్ ఎలా పనిచేస్తుంది?
ఓకెన్ అంటే ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ లేదా యాప్ ఏమీ ఉండదు. ఇదొక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఏపీఐ సాంకేతికత ఆధారంగా నిర్దేశిత నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. రుణగ్రహీతలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. లోన్ల సమాచారాన్ని పారదర్శకంగా, సురక్షితంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. రుణ మంజూరు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏకైక వేదికగా నిలుస్తుంది.
- ఓకెన్లో 3 ప్రధాన లేయర్లు ఉంటాయి. మొదటిది.. ఐడెంటిటీ లేయర్. ఆధార్, డిజీలాకర్ సాయంతో నిర్ధరించిన రుణగ్రహీతల సమాచారం ఇందులో ఉంటుంది. డిజిటల్ విధానంలో ఒక్కసారి ఇందులో చేరితే చాలు.. ఎన్నిసార్లైనా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిసారీ గుర్తింపు పత్రాలు సమర్పించాల్సిన పని ఉండదు.
- ఓకెన్లో మరో ప్రధాన వ్యవస్థ.. పేమెంట్ లేయర్. పూర్తిగా యూపీఐ ఆధారితం. రుణం మంజూరైతే తక్షణమే రుణదాత నుంచి యూపీఐ ద్వారా రుణగ్రహీత ఖాతాలోకి జమవుతుంది. అదే యూపీఐ ద్వారా అప్పును తిరిగి కట్టొచ్చు. ఒక్కసారి కూడాబ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండదు!
- ఓకెన్లోని మూడో లేయర్.. డెపా. అంటే.. డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్. రుణం కావాల్సిన వ్యక్తులు, సంస్థల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ఇందులో భద్రంగా నిక్షిప్తమై ఉంటుంది. రుణగ్రహీతలు అంగీకరిస్తేనే.. లోన్లు ఇచ్చే బ్యాంకులు, సంస్థలు ఈ వివరాలు చూడగలవు.