తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పేద దేశాల్లో నర్సు సేవల కొరత! - ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత

కొవిడ్​పై పోరులో డాక్టర్లతో పాటు వేలాది మంది నర్సులు ఎనలేని సేవలు చేస్తున్నారు. రేయింబవళ్లు.. రోగుల బాగోగులు చూసుకుంటున్నారు. అన్ని రకాల రోగులకూ సేవలందిస్తున్న వారిలో 69శాతం వాటా నర్సులదే కావడం గమనార్హం. నర్సింగ్‌ వృత్తిపై పురుషులు అంతగా ఆసక్తి చూపకపోవడంవల్ల ప్రస్తుతం నర్సుల కొరత తీవ్రంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

nurses day
నర్సుల దినోత్సవం, నర్సులు

By

Published : May 12, 2021, 9:57 AM IST

కొవిడ్‌ను కట్టడి చేయడంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులతోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. రేయింబవళ్లు రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారి బాగోగులు చూస్తున్నది నర్సులేననేది వాస్తవం. అన్ని రకాల రోగులకూ సేవలందిస్తున్న వారిలో 69శాతం వాటా నర్సులదే కావడం గమనార్హం. వారిలో అధికభాగం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నారు. 2013-2018 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన 47 లక్షల మంది విద్యార్థులకు ఉపాధి లభించినట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సింగ్‌ వృత్తిపై పురుషులు అంతగా ఆసక్తి చూపకపోవడంవల్ల- నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు సుమారు 59లక్షల మంది నర్సింగ్‌ సిబ్బంది కొరత ఉన్నట్లు తాజాగా వెలువడిన ప్రపంచ నర్సింగ్‌ నివేదిక స్పష్టం చేసింది. దానివల్ల ఏటా 80 లక్షల మంది రోగులు ఆసుపత్రుల్లో మెరుగైన సంరక్షణ లేక మరణిస్తున్నారని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. అందువల్ల రానున్న రోజుల్లో నర్సింగ్‌ విద్యకు ఉజ్జ్వల భవిషత్తు ఉందని తేటతెల్లమవుతోంది.

విధానపరమైన నిర్ణయాలేవీ?

ప్రపంచంలో సుమారు 81శాతం నర్సులు అమెరికా, ఐరోపా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాల్లోనే సేవలందిస్తుండటం గమనార్హం. ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా లాంటి దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. భారత్‌లో నర్సుల కొరత అంతగా లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రతి పదివేల జనాభాకు- తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో 9.1శాతం, అధిక ఆదాయం కలిగిన దేశాల్లో 107.7శాతం చొప్పున నర్సులు ఉన్నారు. అంటే పేద దేశాల్లో ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా ఉండే నర్సుల సేవలు అంతగా అందుబాటులో లేవనేది అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 36శాతం నర్సులు అందుబాటులో ఉన్నారు. పల్లెసీమల్లో ఉండే ప్రజలకు వైద్య సేవలందించేందుకు నర్సులు అంతగా సుముఖంగా లేరు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఆ కొరత మన దేశంలో తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

జర్మనీలో సుమారు 2.63 లక్షల మంది నర్సుల కొరత ఉంది. ఈ సంఖ్య 2030 నాటికి అయిదు లక్షలకు చేరవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ దేశంలో కొరత తలెత్తకుండా- విదేశీ విద్యార్థులు అక్కడ చదువుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నర్సింగ్‌ విద్య చదివే ప్రతి విద్యార్థికి ఖర్చయ్యే మొత్తం రుసుమును తామే భరించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాంటి విధానపరమైన నిర్ణయాలు భారత్‌లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయితో పోల్చి చూస్తే- భారత్‌లో నర్సింగ్‌ విద్యలో ప్రమాణాలు అంతంతమాత్రమే. కోర్సు పూర్తి చేసినప్పటికీ తగిన ప్రావీణ్యం లేక ఉద్యోగాలు పొందలేని వారెందరో!

అమెరికావంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నర్సింగ్‌ సిబ్బంది పని చేసే ప్రదేశాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. వారికి రక్షణ కవచాలూ పటిష్ఠంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అనేక దేశాల్లో లేవు. దాంతో నర్సులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, తీవ్ర వేధింపులకు సైతం గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ సేవలందిస్తున్నారు. భారత్‌లోనూ నర్సింగ్‌ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది వైద్య సిబ్బందికి రక్షణగా ఎపిడమిక్‌ డిసీజెస్‌ సవరణ ఆర్డినెన్సు-2020 తీసుకువచ్చారు. కానీ, అది వైద్య సిబ్బందికి అంతగా రక్షణ ఇవ్వలేకపోతోంది.

ఉద్యోగ భద్రత

ప్రభుత్వాలు నర్సింగ్‌ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా- తగినన్ని నిధులు కేటాయించాలి. కళాశాలల సంఖ్యను పెంచడంతో పాటు ప్రత్యేక నర్సింగ్‌ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. అందులో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ప్రవేశపెట్టాలి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు పరిశోధక కోర్సులనూ ప్రవేశపెట్టాలి. వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమని భావించిన పాకిస్థాన్‌ రెండేళ్ల క్రితమే నర్సింగ్‌ యూనివర్సిటీని ప్రారంభించింది. ఏటా సుమారు 25వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఆ విధానాన్ని మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తే, నర్సింగ్‌ విద్యపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఉద్యోగ భద్రత లభించే అవకాశమూ ఉంటుంది.

నర్సింగ్‌ విద్యను ప్రోత్సహించే దేశాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యమిచ్చే దేశాలకు ఆర్థిక చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నర్సింగ్‌ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అనేక దేశాల్లో నర్సింగ్‌ సిబ్బందికి మంచి గుర్తింపు ఇస్తున్నారు. వైద్య రంగంలో ప్రభుత్వాలు కేటాయించే పదవుల్లో వారికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మన దేశంలోనూ నర్సులకు తగిన ప్రాధాన్యమిచ్చి వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ (‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ఇదీ చదవండి:టీకా తొలి డోసు తీసుకున్నాక కరోనా వస్తే?

ABOUT THE AUTHOR

...view details