'భారతదేశంలో బహుమతాల మనుగడ, బహుభాషల వాడుక, బహుజాతుల ఉనికిని భాజపా గుర్తిస్తుంది... గౌరవిస్తుంది' అని పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్లమెంటు సాక్షిగా ఉద్ఘాటించారు. సమ్మిళితత్వం, సాంస్కృతిక భిన్నత్వాలను భారతీయ సమాజ బలిమిగా ప్రధాని మోదీ ఇటీవలే డెన్మార్క్‌లో అభివర్ణించారు. అగ్రనేతల మాటల్లో ప్రస్ఫుటమైన ఆ ప్రజాస్వామిక లౌకిక విలువలకు కమలం పార్టీ శ్రేణులు మంటపెడుతున్నాయి. అల్పసంఖ్యాక వర్గాల వేషభాషలు, వ్యక్తిగత విశ్వాసాలు, ఆహార అలవాట్లను ఈసడిస్తూ అవి వెళ్ళగక్కుతున్న విద్వేష భావనలు- సామరస్యపూర్వక సాంఘిక జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా మహ్మద్ ప్రవక్త, ఇస్లామ్‌పై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు- అంతర్జాతీయంగా దేశానికి తలవంపులు తెచ్చిపెట్టాయి. ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి వాటితో పాటు 57 దేశాల ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సైతం వాటిని తీవ్రంగా తప్పుపట్టింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్‌లో పర్యటిస్తున్న కీలక సమయంలో- కొందరు వదరుబోతుల మాటలపై దేశం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడమే సిగ్గుచేటు!
పశ్చిమాసియా స్నేహం అత్యావశ్యకం
భారత ఇంధన అవసరాలను తీర్చడంలోనే కాదు, పక్కలో బల్లెం వంటి పాకిస్థాన్‌ను అదుపులో ఉంచేందుకూ పశ్చిమాసియాతో స్నేహం నేడు భారత్‌కు అత్యావశ్యకం. వ్యూహాత్మక భాగస్వామ్య పక్షాలైన గల్ఫ్ రాజ్యాలతో ఇండియా బాంధవ్యాలు మోదీ హయాములో ఇంకా బలపడ్డాయి. సంకుచిత ప్రయోజనాలకోసం భాజపా వర్గాలు ముస్లిములపై ఎగజిమ్ముతున్న ద్వేషం- దేశీయంగా మత కల్లోలాలను ఎగదోయడమే కాదు, సంవత్సరాల తరబడి శ్రమించి నిర్మించుకున్న పటిష్ఠ ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రక్షణ శాఖామాత్యులు రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించినట్లు, ప్రజాస్వామ్య దేశంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియా కీలకపాత్ర పోషించాల్సి ఉంది. మతపరమైన హింసోన్మాదం స్థానికంగా బుసలు కొడుతుంటే- దేశం పలుకుబడి బయట పలుచబడిపోతుంది. ఓట్ల యావలో విభజనవాదానికి పాలుపోసే దుర్రాజకీయాలు అంతిమంగా భారతావనికి తీవ్ర నష్టం కలిగిస్తాయని భాజపా అధిష్ఠానం ఇప్పటికైనా గ్రహించాలి. హద్దులు మీరుతున్న తన స్కంధావారాలకు కఠినంగా బుద్ధిచెప్పాలి!