దేశంలోని అన్ని ట్రైబ్యునళ్లలో న్యాయ, సాంకేతిక సభ్యుల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల విమర్శించింది. ఫలితంగా ఆగమేఘాల మీద ఆయా ట్రైబ్యునళ్లలో కేంద్రం నియామకాలు చేపట్టింది. సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసిన పేర్ల ఎంపికలో క్రమపద్ధతిని పాటించకపోవడంపై మరోసారి సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం ఈ కేసు విచారణలో చేసిన వ్యాఖ్యలు- సుప్రీం తీర్పులకు మన్నన కొరవడిన చందాన్ని కళ్లకు కడుతున్నాయి. ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వ ఉదాసీనత వల్ల కేసుల కొండలు పెరిగి, ట్రైబ్యునళ్ల ఏర్పాటులోని రాజ్యాంగ లక్ష్యమే నీరుగారిపోతోందన్నది సుప్రీం ఆవేదన!
జటిల వివాదాలకు ముగింపు
తొలిసారిగా 1941లో ఏర్పడిన ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్‌తో భారతదేశం సమాంతర, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల దిశగా అడుగులు వేసింది. 1969నాటి మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో సర్వీసు ట్రైబ్యునళ్లను ఏర్పరచాలని సూచించింది. 1974లో ఆరో లా కమిషన్- హైకోర్టులపై కేసుల భారాన్ని తగ్గించే దిశగా అత్యున్నత అధికార ట్రైబ్యునళ్లు, కమిషన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ అంశంపైనే 1976లో ఏర్పాటైన స్వరణ్ సింగ్ కమిషన్ సైతం హైకోర్టుల్లో ప్రభుత్వ అధికారుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన వివాదాలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇందుకోసం అన్ని స్థాయుల్లోనూ కార్మిక వివాదాల ట్రైబ్యునళ్లను, అఖిల భారత అప్పిలేట్ ట్రైబ్యునల్, కార్మిక, పారిశ్రామిక న్యాయ మండళ్లను సత్వరమే ఏర్పాటు చేయాలని సూచించింది. రెవిన్యూ, భూ కమతాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, దాచివేతలపై ప్రత్యేక స్థాయిలో ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసి, వాటన్నింటినీ సుప్రీంకోర్టు సమీక్ష పరిధిలోకి చేర్చడం ద్వారా, వాటికి హైకోర్టులతో సమాన స్థాయిని కల్పించాలని సిఫార్సు చేసింది. 42వ రాజ్యాంగ సవరణతో అమలైన 323ఏ, 323బీ అధికరణల నేపథ్యంలో అనేక ప్రత్యేక చట్టాలకు అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తిగల క్వాజీ జ్యుడీషియల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. ఆర్టికల్ 136 ద్వారా సుప్రీంకోర్టుకు దఖలుపడిన 'ప్రత్యేక న్యాయ పరిధి' మినహా ఇతర అన్ని న్యాయస్థానాల న్యాయ అధికార పరిధులు ఈ ట్రైబ్యునళ్లకు సంక్రమించాయి. వీటి ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం- వివిధ న్యాయస్థానాల్లో సివిల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ చట్టం వంటి నిబంధనల చట్రంలో ఇరుక్కుని కునారిల్లుతున్న వివాదాలకు సత్వర మోక్షం కలిగించడమే. ఈ ట్రైబ్యునళ్లకు న్యాయాధికారులుగా కేవలం న్యాయశాస్త్ర పట్టభద్రులు, జ్యుడీషియరీ నేపథ్యం కలిగినవారే కాకుండా, సంబంధిత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష అనుభవమున్న వ్యక్తులూ నియమితులవుతారు. ఇలాంటి అనుభవజ్ఞుల సారథ్యంలో నడిచే ట్రైబ్యునళ్లను సర్వ స్వతంత్ర 'న్యాయమండళ్లు'గా సుప్రీంకోర్టు గతంలో అభివర్ణించింది. 1980 లగాయతు ఏర్పడిన వివిధ ట్రైబ్యునళ్లు సాధారణ కోర్టులపై పనిభారం తగ్గించడమే కాకుండా అనుభవశీలురైౖన న్యాయ, సాంకేతిక సభ్యుల సారథ్యంలో అనేక జటిల వివాదాలకు సత్వర ముగింపు పలికాయి. కంపెనీ లా ట్రైబ్యునల్, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, రుణ రికవరీ, పరిపాలన, సాయుధ బలగాలు, సెక్యూరిటీ అప్పిలేట్ తదితర ట్రైబ్యునళ్లు దశాబ్దాలుగా సేవలందిస్తూ, దేశ న్యాయవ్యవస్థలో సమాంతర భాగంగా తమవంతు పాత్రను సజావుగా పోషించాయి.
నిర్లక్ష్యానికి నిదర్శనం
ట్రైబ్యునళ్ల పునర్ వ్యవస్థీకరణకు ఫైనాన్స్ చట్టం-2017 శ్రీకారం చుట్టింది. తద్వారా ఒకే తరహా విధులు నిర్వర్తిస్తున్న ట్రైబ్యునళ్లన్నింటినీ ఏకీకృతం చేసి, వాటి సంఖ్యను క్రమేణా కుదించాలని కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీంతో ఈ సమాంతర న్యాయవ్యవస్థపై అధికారిక దాడి మొదలైనట్లయింది. సభ్యుల నియామకాలు, అర్హత, తొలగింపు వంటి అంశాలపై కేంద్ర సర్కారుకు ఫైనాన్స్ చట్టం గంపగుత్త అధికారాలను కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. 2021 ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుంచిన 'ట్రైబ్యునల్ రిఫార్మ్స్ (రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) బిల్లు కాలదోషం పట్టి ఆర్డినెన్సు రూపంలో వెలువడింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం 2021 రూపంలో మళ్ళీ ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం చట్టం తెచ్చింది. దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఫైనాన్స్ చట్టం-2017ను అనుసరించి తెచ్చిన ట్రైబ్యునళ్ల ఆర్డినెన్సును కొట్టివేస్తూ ధర్మాసనం గతంలో వెల్లడించిన అభిప్రాయాలను తోసిరాజని, అదే ఆర్డినెన్స్ మూసలోనే ట్రైబ్యునల్ చట్టాన్ని వండి వార్చడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిలువెత్తు నిదర్శనమని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది.