'బాణం తగిలి లాంతరు గ్లాసు పగిలిపోతుందనుకుంటే ఎదురుతన్నిందేంటబ్బా?' 'మత్తు మహిమ నాయనా... గొంతులో మందు పడ్డాక మెదడు మాట వింటుందా? వణికే చేతులతో బాణాలేయమంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? పైగా ఆ లాంతరును చూశావా... అదాటున చూస్తే అచ్చం మందుబుడ్డిలా లేదూ...!' 'అయితే...' 'అయితే లేదు... గియితే లేదు... బాణాలు బాగా వేస్తారని మనోళ్లు తెగ తాగబోయించారు. నిషా తలకెక్కాక గురి చూడమంటే వాళ్లేమో లాంతరు వెలుగులకు గుడ్లప్పగించారు. తప్పులేదులే... ఈసారికి మనమిలా సరిపెట్టుకోవాల్సిందే’
బిహార్ ఎన్నికల్లో జేడీయూ చాప కిందకు నీళ్లు వచ్చేశాయని... ఆర్జేడీ లాంతరువాలాలదే అధికార పీఠమని ఎగ్జిట్ పోల్స్ ఘోషిస్తున్నాయి. అదే నిజమైతే చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా అనుకోవాల్సిందే. మద్యనిషేధమంటూ నాలుగేళ్లుగా కొరడా పుచ్చుకొన్న నీతీశ్ సర్కారు తీరా ఎన్నికలొచ్చేసరికి నిద్ర నటించిందని ఆ రాష్ట్రంలోని ప్రతి చెట్టూ పుట్టకూ తెలుసు. మందు పారితే ఓట్లు కొట్టుకొస్తాయని ఆశపడితే, పాపం అసలుకే మోసం వచ్చేసింది. గట్లు తెంచుకుని ఉరకలెత్తిన మద్యవాహిని చివరికి 'యజమానులనే' ముంచేసింది!
రాష్ట్రంలో తాగుబోతులే ఉండకూడదని 2016లో నితీశ్ కుమార్ కంకణం కట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా మద్యనిషేధ చట్టం తెచ్చేశారు. 'పులి మీద సవారీ మనకొద్దు మహాప్రభో' అని అనుచరగణం మొత్తుకున్నా 'ఠాట్... నేను చేస్తా... గెలుస్తా' అన్నారు ముఖ్యమంత్రి. అన్నవారు అన్నట్టుగా మాట మీద నిలబడ్డారా? లేదే... మందు లేని ఎన్నికలంటే పంచదార లేని పాయసమేనన్న జ్ఞానోదయమై చూసీ చూడనట్టుగా తలుపులు తెరిపించేశారు. 'తాగినవాళ్లకు తాగినంత' పథకాన్ని విస్తృతంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు. ఆ రకంగా ఈవీఎంల మీద ఆయన 'బాణాలె'క్కుపెడితే అవికాస్తా ఎదురు తిరిగినట్టున్నాయి. అవును మరీ, నాలుగేళ్ల కరవు తరవాత ఒక్కసారిగా మందు వచ్చిపడితే, తాగినవాళ్లకు తన పర భేదముంటుందా? అసలు ఇన్ని రోజులు తమ నోళ్లు కట్టేసిన వారి మీద కోపం రాకుండా ఉంటుందా? ఆ సురాగ్రహ ఫలితాలే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎవరు కాదనగలరు?
రాజును మించిన రాజభక్తి మంచిది కాదని పెద్దలెప్పుడో చెప్పారు కానీ, ఆ బిహార్ అధికారులు వినిపించుకుంటేనేగా! ముఖ్యమంత్రి మద్యనిషేధం అనగానే వీళ్లు దొరికింది మహదావకాశం అనుకుని ఊళ్ల మీద పడ్డారు. మద్యనిషేధ చట్టం కింద మూడు లక్షల మంది మీద కేసులు పెట్టి కటకటాల వెనక్కి నెట్టేశారు. అలా అని వీళ్లలో ఎక్కువ మంది ఏమైనా దొంగ మందు అమ్మేవాళ్లా అంటే... అదీ కాదాయే! ఒక్కసారిగా పాతలవాటు మానుకోలేని అతి సామాన్యులు. అరివీర భయంకరమైన తమ ప్రతాపమంతటినీ అధికారగణం వీళ్ల మీద చూపించే సరికి చివరకొచ్చి అది నితీశ్ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు కక్కలేక మింగలేక అధికారపక్షమంతా తమ నాయకుడి వైపు ఉరిమి ఉరిమి చూసినా ఏం లాభం? చేతులు కాలాక ఆకుల కోసం వెతికితే ఎవరికి ఉపయోగం?