తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చైనాలో కొవిడ్‌ మరణ మృదంగం.. డ్రాగన్​ టీకాలపై సందేహాలు! - కోవిడ్ కొత్త వేరియంట్​తో సతమతమవుతున్న చైనా

కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో ఆ వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. నిన్నమొన్నటిదాకా ఆంక్షలతో సతమతం అవుతున్నామంటూ గగ్గోలు పెట్టిన చైనీయులు, ఇప్పుడు విరుచుకుపడుతున్న మహమ్మారితో విలవిల్లాడుతున్నారు. అత్యంత చురుగ్గా ఉన్న బీఎఫ్‌.7 రకం విస్తృతంగా వ్యాప్తి చెందడమే తాజా విపరిణామాలకు మూలకారణం.

bf7 corona variant in china
చైనాలో కోవిడ్ విజృంభణ

By

Published : Dec 26, 2022, 8:55 AM IST

చైనాలో మూడేళ్లుగా ‘జీరో కొవిడ్‌’ విధానంలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేశారు. అపార్టుమెంట్లకు బయటి నుంచి తాళాలు సైతం వేయగా, ఓ అగ్నిప్రమాదం ఘటనలో బయటపడలేక కొందరు ప్రాణాలు కోల్పోయిన ఉదంతంతో చైనీయులు మండిపడ్డారు. ఆంక్షలు సడలించకపోతే జిన్‌పింగ్‌ దిగిపోవాలంటూ ఆందోళనలకు దిగారు. దాంతో జీరో కొవిడ్‌ విధానాన్ని సర్కారు ఉపసంహరించుకొంది. ఫలితంగా అక్కడ కొవిడ్‌ ఒక్కసారిగా జడలు విప్పుతోంది. కరోనా కేసుల సంఖ్య చైనాలో గణనీయంగా పెరిగిపోయింది. మృతుల సంఖ్య సైతం జోరెత్తినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజధాని బీజింగ్‌ సహా పలు నగరాల్లో శ్మశానవాటికలన్నీ కిటకిటలాడుతున్నాయని అంతర్జాతీయ వార్తాసంస్థలు చెబుతున్నాయి. కొవిడ్‌ బాధితుల మృతదేహాల దహనానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనధికారిక ఆదేశాలు సైతం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా, మరణాల సంఖ్యను ఇప్పటికీ డ్రాగన్‌ దాచిపెడుతోంది.

ఔషధాల కొరత
కొవిడ్‌ 2019లో తొలిసారి బయటపడినప్పటి నుంచి దేశం మొత్తమ్మీద ఇప్పటి వరకు అయిదువేల పైచిలుకే మరణించారన్నది చైనా అధికారిక సమాచారం. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ మాత్రం అక్కడ ముప్ఫై ఒక్క వేల మందికిపైగా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. బీజింగ్‌లోని ఓ దహనవాటికకు గతంలో రోజూ 30-40 మృతదేహాలు వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 200 దాటింది. జనాభాలో సుమారు 60శాతం కొవిడ్‌ బాధితులు ఉంటారన్నది ఓ అంచనా. ఆస్పత్రుల్లో పడకలు చాలక వరండాలో ఉంచీ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. పల్లెలు పట్టణాల్లోనూ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, చైనా అధికారికంగా వెల్లడిస్తున్న కొవిడ్‌ కేసుల సంఖ్యకు, వాస్తవ పరిస్థితికి తేడా ఉంటోంది. లక్షణాలు లేవనే కారణాలతో కొవిడ్‌ కేసుల సంఖ్యను బయటకు వెల్లడించడంలేదు. ఇటీవలి వరకూ పెద్ద సంఖ్యలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దాన్ని పూర్తిగా పక్కనపెట్టి కేవలం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లతోనే పరీక్షిస్తున్నారు. దానివల్ల కేసుల సంఖ్య పెద్దగా బయట పడటంలేదు. కరోనా వైరస్‌పై యుద్ధంలో తనను తాను కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా అభివర్ణించుకొన్న జిన్‌పింగ్‌, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను మూసివేశారు. ఎవరికి వారే అనుమానం వస్తే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్‌తో పరీక్షించుకొని, వైరస్‌ సోకినట్లు తేలితే స్వీయ నియంత్రణలు పాటిస్తున్నారు. ప్రజలు సొంతంగా టెస్టు కిట్లతో పాటు మందులనూ కొనుగోలు చేస్తున్నారు. దుకాణాలతోపాటు ఆన్‌లైన్‌ వేదికల్లోనూ ఔషధాల కొరత కనిపిస్తోంది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను తయారుచేసే 42 సంస్థల్లో పదకొండింటి ఉత్పత్తి కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. యాంటిజెన్‌ కిట్ల ఉత్పత్తిని పెంచాలని ఆయా కంపెనీలను అధికారులు ఆదేశిస్తున్నారు. తమ ఉత్పత్తి మొత్తాన్ని స్థానిక ప్రభుత్వమే తీసుకుంటోందంటూ ఇలాంటి కిట్లు తయారుచేసే విజ్‌ బయోటెక్‌ అనే సంస్థ వెల్లడించింది. మందులు దొరక్కపోవడంతో స్థానికులు నల్ల బజారును ఆశ్రయిస్తున్నారు.

శ్వాసకోశ వైఫల్యం కారణంగా సంభవించిన మరణాలను మాత్రమే కొవిడ్‌ మృతులుగా చైనా పరిగణిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఒమిక్రాన్‌ ఉపరకమైన బీఎఫ్‌.7 వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపించింది. దాంతోపాటు మరోరకమూ ఉందని చెబుతున్నారు. మరణాలను శాస్త్రీయ పద్ధతిలో చూస్తామని, శ్వాసకోశ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోతేనే కొవిడ్‌ మరణాలుగా లెక్కిస్తామని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ స్పష్టీకరించింది. చైనా జనాభాలో 60 నుంచి 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్నవారి జనాభా చాలా ఎక్కువ. ఆ వయసు వారెవరికీ టీకా తప్పనిసరి కాదన్నది చైనాలో చెబుతున్న మాట. ఇదీ మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా అధికారిక మీడియాగాని, అక్కడి వైద్య నిపుణులుగాని వైరస్‌ తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేసే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడి కొవిడ్‌ నిపుణుల్లో అగ్రగణ్యుడిగా పరిగణించే ఝాంగ్‌ నన్షాన్‌- అసలు ఒమిక్రాన్‌ను ‘కరోనా వైరస్‌ జలుబు’గా భావించాలని చెబుతున్నారు. సాధారణ ఫ్లూ, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించే మరణాల స్థాయిలోనే ఇవీ ఉంటాయని ఆయన సూత్రీకరించారు.

టీకాలపై సందేహాలు
కొవిడ్‌ నిరోధం కోసం ప్రపంచంలో అందరికంటే ముందుగా తామే టీకాను కనుగొన్నామని 2020 నవంబరులో చైనా ఘనంగా ప్రకటించుకొంది. అప్పట్లో భారత్‌ సహా వివిధ దేశాలు అభివృద్ధి చేసిన ఎం-ఆర్‌ఎన్‌ఏ టీకాలను డ్రాగన్‌ దేశం వినియోగించలేదు. వివిధ దేశాలకు సుమారు 180 కోట్ల డోసులు అది అందించింది. వాటిలో పేద దేశాలకు ఉచితంగా 32 కోట్లకుపైగా డోసులు ఇచ్చామని బీజింగ్‌ చెప్పుకొంది. అయితే, చైనా టీకా నిజంగా పనిచేస్తే ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతుందన్నది వైద్య నిపుణుల సందేహం. శ్రీలంక, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఇండొనేసియా, తుర్కియే లాంటి చాలా దేశాలు చైనా టీకాలు పనికిరానివంటూ ఇప్పుడు పెదవి విరుస్తున్నాయి. కొవిడ్‌ కట్టలు తెంచుకొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర వైద్య సౌకర్యాలను పెంచాలి. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచాలి. యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. తీవ్రస్థాయి కేసుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయడమూ అత్యవసరం. ఇలాంటి చర్యలతో మహమ్మారి విజృంభణ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడమే చైనా ముందున్న తక్షణ కర్తవ్యం!

అప్రమత్తమైన భారత్‌
చైనాతో పాటు అమెరికా, జపాన్‌, కొరియా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లోనూ క్రమంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో ఇండియాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలకు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఐసొలేషన్‌, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలని ఒక లేఖలో కోరారు. మరోవైపు ప్రస్తుతానికి ఇండియాలో ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ వెల్లడించారు. బీఎఫ్‌.7 రకానికి శరవేగంగా వ్యాపించే లక్షణమున్నా, భారత్‌లో అది అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆమె చెబుతున్నారు. ఇంతకంటే తీవ్రంగా వ్యాప్తి చెందగలిగే రకాలు వచ్చినా, భారత్‌లో కేసుల సంఖ్య మరీ ప్రమాదకరంగా పెరిగే సూచనలైతే లేవన్నది నిపుణుల విశ్లేషణ.

ఇవీ చదవండి:

ఆ ఫుట్​బాల్​ సంబరం భారత్​కు ఎప్పుడు..? సాకర్​ అర్హత సాకారమయ్యేనా?

ఆర్మేనియాకు పినాక.. ఫిలిప్పీన్స్​కు బ్రహ్మోస్​.. ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా భారత్!

ABOUT THE AUTHOR

...view details