లాక్‌డౌన్ కాలంలో ఇతర రాష్ట్రాల్లో దిగబడిపోయి, స్వరాష్ట్రానికి తిరిగిరావాలనుకున్న బిహారీ వలస కార్మికులకు తలుపులు తెరిచేది లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మొదట్లో భీష్మించారు. దాంతో ఆయన కనికరం లేని కరకు మనిషని విమర్శలు చెలరేగాయి. ఎక్కడో దూరాన ఉన్న మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి నెత్తిన మూటలు పెట్టుకుని, పిల్లాపాపలను వెంటబెట్టుకుని, వందల మైళ్ల దూరం వలస కార్మికులు నడచివస్తున్న దృశ్యాలు బిహారీ ప్రజల మనసులను కలచివేశాయి. తరవాత మే నెలారంభం నుంచి శ్రామిక్ రైళ్లు వలస కూలీలను స్వరాష్ట్రానికి చేరవేయసాగాయి.
కూలీలు లక్షల్లో వచ్చిచేరుతున్న కొద్దీ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభించసాగాయి. బిహార్ లో మే 5న ఆరు జిల్లాలలో కేవలం 86 కేసులు ఉండగా, జూన్ 11 నాటికి అవి 38 జిల్లాల్లో 8,964 కేసులకు చేరుకున్నాయి. మొదట్లో పట్టణాలకే పరిమితమైన కేసులు నేడు గ్రామాలకూ పాకాయంటే ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల్లోని రెడ్ జోన్ల నుంచి వలస కూలీలు పెద్దఎత్తున తిరిగిరావడమే. కరోనా కేసులు విజృంభించడం చూసి ఒకప్పుడు వలస కార్మికులను అడ్డుకొంటున్నారని నితీశ్ పై దుమ్మెత్తిపోసినవారే ఇప్పుడు, శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి ఎందుకు రానిచ్చారంటూ ఆయన్ను ఆడిపోసుకుంటున్నారు. ఉపాధి దొరకనివారిలో కొందరు నేరాలకు పాల్పడకుండా నివారించడానికి ముందుజాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెట్లకు పంపిన సందేశాలు సమాచార సాధనాల ద్వారా బయటకు పొక్కి గగ్గోలు పుట్టింది. ముఖ్యమంత్రి నితీశ్ వలస కూలీలను సొంత రాష్ట్రంలోనే రెండో తరగతి పౌరులుగా పరిగణించడమే కాదు నేరస్థుల్లా కూడా చూడటం దారుణమని ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) శాసన సభా పక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. పోలీసు శాఖ నాలుక కరచుకుని ఎస్.పిలకు పంపిన సందేశాన్ని ఉపసంహరించుకున్నా నితీశ్ ప్రతిష్ఠకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. అక్టోబరు-నవంబరు కాలంలో జరగాల్సి ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కరోనా, వలస కార్మికుల సమస్యలను ఆయుధాలుగా మలచుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. బిహార్‌కు తిరిగి వస్తున్న వలస కూలీలను ఆర్జేడీ సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమాన్ని ఆ పార్టీ పెద్దఎత్తున ఆన్ లైన్‌లో చేపట్టింది.
ప్రతిపక్షాల కీచులాట..
నితీశ్ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు ఈ జంట సమస్యలను ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టింది. 10 లక్షల వలస కార్మికుల కోసం జూన్ నెలాఖరుకల్లా 281 సహాయ కేంద్రాలు, 9,840 బ్లాక్ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనారంభించింది. ప్రతి వలస కార్మికుని బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 1,000 జమ చేయసాగింది. మున్ముందు మరింత నగదు జమ చేయనుంది. వలస కార్మికులకు 8.7 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చి సబ్సిడీ ధరలపై నిత్యావసర సరకులు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో అధికారికంగా నమోదైన 1.37 కోట్లమంది రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీకి వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఎన్నికల ముందు కూలీలకు, రైతులకు నగదు బదిలీ చేయనుంది. కరోనాపై చురుగ్గా పోరు జరుపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పలు ప్రజాభిప్రాయ సేకరణల్లో జనాదరణ వ్యక్తమవడం కూడా తమకు అనుకూలిస్తుందని ఆశిస్తోంది. లాక్ డౌన్ సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ అగ్రకుల ఓటర్లలో, యాదవేతర బీసీ ఓటర్లలో ఆర్జేడీపై ప్రతికూల భావనలు తొలగిపోవని కూడా లెక్కవేసుకొంటోంది. పైగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, భాజపా, ఎల్జేపీల మధ్య సఖ్యత ఉండి, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ సీట్లలో ఎవరు ఎన్ని సీట్లకు పోటీచేయాలనే అంశాన్ని సామరస్యంగా తేల్చుకున్నాయి. ప్రతిపక్షంలో అలాంటి పరిస్థితి లేదు. ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమి పార్టీలు సీట్ల పంపకంపై కీచులాడుకుంటూనే ఉన్నాయి. తాను కనీసం 75 సీట్లకు పోటీచేస్తానని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ప్రకటించుకుంది. ఆర్.ఎల్.ఎస్.పి, హెచ్‌ఏఎం, వీఐఐపీ వంటి కుల పార్టీలు సీట్ల కోసం తమ డిమాండ్లను ఆర్జేడీ పెడచెవిన పెడుతోందని నిరసిస్తున్నాయి. వివిధ సమస్యలపై ఆర్జేడీ నిర్వహించే నిరసన ప్రదర్శనలకు ఈ నాలుగు భాగస్వామ్య పార్టీలు హాజరుకావడం లేదు.
ఆర్జేడీలో కూడా పరిస్థితులు సజావుగా లేవు. పార్టీ అధినాయకుడు లాలూ పసాద్ యాదవ్ ఎక్కడో దూరాన ఝార్ఖండ్ లోని రాంచీలో జైలుశిక్ష అనుభవిస్తున్నందున, ఆర్జేడీ చుక్కాని లేని నావలా తయారైంది. అయినా ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందనీ, పాలక పార్టీపై భారతీయ ఓటర్లు ఆగ్రహిస్తే, ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాసరే, వాటినే గెలిపించిన సందర్భాలు అనేకమని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద సింగ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల్లో ఎన్ని లుకలుకలున్నా కులం తురుఫు ముక్క తమను గెలిపిస్తుందని అవి ఆశపెట్టుకుంటున్నాయి. తమ భాగస్వామి ఎల్జేపీ ద్వారా దళిత ఓట్లు లభిస్తాయి కాబట్టి, కులాల సమీకరణలో తామూ వెనుకబడలేదని పాలక ఎన్డీయే భావిస్తోంది.
- రాజ్‌దీప్