ప్రతి రెండు వేల జనాభాకు కనీసం ఇద్దరు వైద్యులు, అయిదుగురు నర్సులు, ఏడు ఆస్పత్రి పడకలు అందుబాటులో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. ఆ లెక్కన 135 కోట్ల జనాభా గల భారత్‌కు 2030నాటికి 27 లక్షల అల్లోపతీ వైద్యులు అవసరమవుతారని ఐసీఎమ్‌ఆర్ అధ్యయనం చెబుతోంది. గుండె, శ్వాసకోశ, క్యాన్సర్, రోగ నిర్ధరణ, రేడియాలజీ తదితర రంగాల్లో వైద్యనిపుణుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యవ్యవస్థకు సాంకేతికత జోడించడం వల్ల సమస్యను అధిగమించవచ్చన్నది నిపుణుల సూచన. దీనివల్ల రోగనిర్ధరణ, చికిత్స విషయంలో సమయమూ కలిసి వస్తుందని చెబుతున్నారు. కృత్రిమ మేధ, యంత్ర విజ్ఞానాల ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు పొందవచ్చనీ అంటున్నారు.
డిజిటల్ విప్లవానికి పునాదులు..
2021 నాటికి ఈ తరహా వైద్యసేవలు 40 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చాటుతున్నాయి. ఆస్పత్రుల నిర్వహణ, వ్యాధి నిర్ధరణ, చికిత్స, వైద్య పరికరాల వినియోగం, ఆరోగ్య బీమా, చరవాణి వైద్యం, మందుల విపణులు తదితర వైద్య రంగాల్లో కృత్రిమ మేధ బలంగా వేళ్లూనుకుంటోంది. దేశంలో 40 శాతం జనాభాకు అంతర్జాల సేవలు అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం- డిజిటల్ విప్లవానికి పునాదులుగా మారుతున్నాయి. వైద్య నిపుణుల కొరత, భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల పరిమితులు, పట్టణ పల్లె ప్రాంత ప్రజల మధ్య నెలకొన్న అసమానతలు- దేశంలో నూతన సృజనకు దారి చూపుతున్నాయి.
కృత్రిమ మేధకు విశేషాదరణ
అమెరికాలో కృత్రిమ మేధ వినియోగం వల్ల రోగ నిర్ధరణ, చికిత్సల్లో మానవ తప్పిదాలు 15 శాతం మేర తగ్గినట్లు అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి. స్వయంచాలక విశ్లేషణ కలిగిన వైద్య పరీక్షలు, నిర్దిష్టమైన రోగ నిర్ధరణ, రోగ తీవ్రతను నిరంతరం పర్యవేక్షించే ఉపకరణాలు వైద్య పరిరక్షణలో క్రియాశీలం అవుతున్నాయి. సునిశిత పరిశీలన సమాచార రేఖాగణితాలు రోగ నిర్ధరణ, చికిత్సలో కీలకం కానున్నాయి. క్యాన్సర్, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తుండటంతోపాటు వృద్ధుల సంఖ్యా క్రమేపీ పెరుగుతుండటం వల్ల వైద్యులు తమ పనిభారాన్ని తగ్గించుకునేందుకు కృత్రిమ మేధను ఆశ్రయిస్తున్నారు. ఆధునిక సాంకేతికత సహకారంతో వైద్య చికిత్సలో కొత్త ఒరవడులను అన్వేషిస్తున్నారు. కంప్యూటరీకరణ ద్వారా యంత్రాలకు మానవ మెదడు భావనలను పోలిన విధులను మిళితం చేసి లోతైన అధ్యయనం జరుపుతున్నారు. సంబంధిత పరిశీలనకు గణిత శాస్త్రవిజ్ఞానాన్ని జోడించి ఆరోగ్య పరిరక్షణలో సత్ఫలితాలు రాబట్టవచ్చని ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిన అనేక పరిశోధనలు రుజువుచేశాయి.
సత్ఫలితాలతోనే..