జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో తప్పులు ఎత్తిచూపడం అన్యాయం అనిపిస్తుంది. ప్రశంసలు ఇవ్వడం కొంతవరకు సమంజసమే. ఒకటి మాత్రం వాస్తవం. విద్యకు సంబంధించి అన్ని అంశాలను ఎన్‌ఈపీ ప్రస్తావించినా- భారత విద్యావ్యవస్థలోని సంక్షోభాన్ని గ్రహించలేకపోయిందన్నది వాస్తవం. విద్యాసౌధానికి పునాది అయిన పాఠశాల చదువులకు సంబంధించి మాట్లాడాలంటే- సగం మార్కులే వేయగలం!
పాతకు వీడ్కోలు
జాతీయ విద్యావిధానం ఎన్నో అద్భుతమైన సిఫార్సులు చేసింది. అవసరాల నుంచి ఫలితాలపైకి దృష్టి మరల్చింది. బట్టీయం చదువులను బుట్టదాఖలు చేసింది. సంక్లిష్ట ఆలోచనలు, భావనలు, సృజనాత్మక నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చింది. మూడో తరగతిలోకి వచ్చేసరికి పిల్లలందరూ ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాలు సాధించాలన్నది ఈ విధానంలోని అత్యుత్తమ అంశం. 2025నాటికి ఈ లక్ష్యం చేరాలని నిర్దేశించడం మరీ విశేషం. 3, 5, 8 తరగతుల్లో విశ్వసనీయమైన, ప్రామాణికమైన మదింపు పద్ధతుల ద్వారా విద్యార్థి ప్రమాణాల స్థాయి తెలుసుకోగలం. పిల్లల చదువుల మెరుగుదలకు ఇదెంతో ఉపయోగపడుతుంది. బిడ్డ చదవాల్సిన పాఠ్యాంశాలను ఫలితాల ఆధారంగా ఎంపిక చేసుకోవడానికీ దోహదపడుతుంది. ఈ విధానం స్కూలు చదువుల్లోనే వృత్తివిద్యను మిళితం చేస్తోంది. విద్యలో ప్రభుత్వపాత్రను రెండు విభాగాలుగా చేసింది. ఒకటి విద్యను నియంత్రిస్తుంది. రెండోది ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తుంది. ఇలా రెండు వైరుధ్యాలను అధిగమిస్తుంది. అధికారులు ప్రభుత్వ పాఠశాలల ఘోర వైఫల్యాలను ఒకవైపు కప్పిపుచ్చుతూ, మరోవంక ప్రైవేటు బడులను ‘లైసెన్స్ రాజ్’ వ్యవస్థలో బందీలు చేస్తున్న ప్రస్తుత దుస్థితికి ఎన్‌ఈపీ తెర దింపింది.
ప్రశంసార్హం కాదా
ఇన్ని సుగుణాలున్న ఎన్‌ఈపీని ఎందుకు ప్రశంసించకూడదు? ఎనిమిది వాస్తవాలను ఇది నిజాయతీగా అంగీకరించలేకపోవడమే పూర్తి ప్రశంసలకు దూరం కావడానికి కారణం! ప్రభుత్వ పాఠశాలలు ఉచితవిద్యతోపాటు మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు, పుస్తకాలు అందిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లవైపే ఎందుకు మొగ్గుచూపుతురన్నదే ప్రశ్న! తమ కష్టార్జితాన్ని ధారపోసి ఖర్చుకు వెనకాడకుండా పిల్లల్ని చదివిస్తున్నారు. విద్యాబోధనకన్నా నిర్వహణాపరమైన వైఫల్యాలవల్లే ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు కోరుకోవడం లేదు. ఉపాధ్యాయులు పాఠశాలలకు తరచూ డుమ్మా కొడుతుంటారు. రాజకీయంగానూ శక్తిమంతులు. ఎన్నికల విధులు పర్యవేక్షించే ఉపాధ్యాయుల జోలికిపోవాలంటే రాజకీయ నాయకులు వెనకాడతారు. స్కూళ్లకు బదులు పిల్లలకు నిధులు సమకూర్చడమే దీనికిగల ఏకైక పరిష్కారం. 50 ఏళ్లుగా ఎన్ని సంస్కరణలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు విఫలమవుతూనే ఉన్నాయని గ్రహించిన అప్పటి ప్రధాని వాజ్‌పేయీ 2000లో ఈ భావనను ప్రతిపాదించారు. ఇదెంతో సరళమైనది. అయిదేళ్లు వచ్చేసరికి బాలలకు నెలవారీ ఉపకారవేతనానికి అర్హత లభిస్తుంది. ఏ బడి అన్నది తల్లిదండ్రుల ఇష్టం. పన్నెండో తరగతి వరకు ఉపకారవేతనం వస్తూనే ఉంటుంది. విద్యార్థులు చెల్లించే మొత్తాల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు లభిస్తాయి. బడిలో ఉండేందుకు, స్ఫూర్తిదాయకంగా పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఉత్సాహపడాల్సి ఉంటుంది. పోటీలో మంచి పాఠశాలలు నిలుస్తాయి. లేనివి మూతపడతాయి. బీద విద్యార్థికి సైతం గౌరవం ఉంటుంది. బోధన సరిగ్గాలేని పాఠశాలను విద్యార్థులే వద్దనుకుంటారు. అప్పుడు ప్రభుత్వానికి స్కూళ్లను నడిపే అవసరం ఉండదు. బోలెడు డబ్బు ఆదా అవుతుంది. వాటిని విక్రయించినా, లీజుకిచ్చినా భారీగా నిధులు లభిస్తాయి.
విస్మరించిన ఎనిమిది అంశాలు
- దేశవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో ప్రతి నలుగురు టీచర్లలో ఒకరు గైర్హాజరవుతున్నారు. హాజరైన ఇద్దరిలో ఒకరు పాఠాలు చెప్పడం లేదు. వేతనాలు తక్కువా కాదు. గతేడాది ఉత్తర్ ప్రదేశ్ జూనియర్ టీచర్ల ఆరంభ వేతనం నెలకు రూ.48,918. ఇది యూపీ తలసరి ఆదాయానికి 11 రెట్లు.
- అనేక రాష్ట్రాల్లో 10శాతం ఉపాధ్యాయులు ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’లో ఉత్తీర్ణులు కాలేదు.
- అయిదో తరగతి పిల్లల్లో రెండో తరగతి లెక్కలు చేయగలిగేవారు లేదా ఒక పేరా చూసి చదవగలిగేవారు సగానికంటే తక్కువే ఉంటారు.
- చదవడం, సైన్సు, లెక్కల్లో నిర్వహించే అంతర్జాతీయ పైసా (పీఐఎస్‌ఏ) పరీక్షలో భారత విద్యార్థులు 74 దేశాల్లో 73వ స్థానంలో ఉన్నారు (కిర్గిజిస్థాన్ కంటె కొద్దిగా మెరుగు). దరిమిలా యూపీఏ ప్రభుత్వం ఈ పరీక్షను నిషేధించింది.
- బీదవారు సైతం సర్కారు బళ్లను వదిలిపెట్టారు. 2011-2018 మధ్య 2.4కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేటు స్కూళ్లలో చేరారని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు సగం మంది విద్యార్థులు (47.5 శాతం) ప్రైవేటు విద్యావ్యవస్థలో ఉన్నారు. 70శాతం తల్లిదండ్రులు రూ.1,000 వరకు, 45శాతం రూ.500 వరకు నెలసరి రుసుము చెల్లిస్తున్నారు.
- భారత ప్రైవేటు పాఠశాలలు ధనికుల కోసం కాదు. అయితే మంచి ప్రైవేటు స్కూళ్లు తక్కువ. బిడ్డను చక్కటి బడిలో చేర్పించడానికి తల్లిదండ్రులు బారులుతీరడం చూస్తే గుండె తరుక్కుపోతుంది. నిజాయతీపరులు స్కూలు పెట్టడం కష్టమైన పని. 35 నుంచి 125 వరకు అనుమతులు పొందాలి. ఇందుకు ఏ అయిదేళ్లో పడుతుంది. లక్షల్లో లంచాలు సమర్పించాలి.
- ప్రభుత్వ పాఠశాలలు ఇదే రీతిన ఖాళీ అవుతుంటే చివరకవి చరిత్ర పుటల్లో మిగులుతాయని అమర్త్య సేన్ అన్నారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తప్ప పిల్లలు లేని దుస్థితి నెలకొంది.
- ప్రభుత్వ వ్యవస్థలో పిల్లవాడి చదువుకయ్యే వ్యయంలో మూడోవంతు వ్యయంతోనే ప్రైవేటు వ్యవస్థ విద్యను అందిస్తోంది. పిల్లలకు తక్కువ ఖర్చుతో మెరుగైన విద్య లభిస్తోంది.