తెలంగాణ

telangana

ETV Bharat / opinion

డిజిటల్‌ విప్లవానికి కొత్త ఊపిరి - busniness news latest

పౌరులందరికీ అంతర్జాల సేవలు చేరువ చేసేందుకు ఉద్దేశించిన 'డిజిటల్‌ ఇండియా' కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఆ క్రతువుకు చురుకు పుట్టించి డిజిటల్‌ స్వప్నాన్ని సాకారం చేయగల మహదవకాశం కొత్తగా భారత్‌ తలుపు తట్టింది. తమ తమ మాతృభాషల్లో భారతీయుల ఇళ్లకు సమాచారం చేరవేయడానికి, దేశమంతటా డిజిటలీకరణకు ఊతమివ్వడానికి వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రూ.75 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి గూగుల్‌ సారథి సుందర్‌ పిచాయ్‌ సంసిద్ధత వ్యక్తపరచడం కీలక పరిణామం.

New breath for the digital revolution
డిజిటల్‌ విప్లవానికి కొత్త ఊపిరి

By

Published : Jul 16, 2020, 9:45 AM IST

సమాచార సాంకేతిక పరిజ్ఞాన మహా విప్లవ వేదికగా, విజ్ఞాన వినోద వికాసాలను ఇంటింటికీ అందించే వారధిగా నేటి ప్రపంచంలో అంతర్జాలం(ఇంటర్‌నెట్‌) అత్యవసరంగా మారిపోయింది. పౌరులందరికీ అంతర్జాల సేవలు చేరువ చేసేందుకు ఉద్దేశించిన 'డిజిటల్‌ ఇండియా' కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఆ క్రతువుకు చురుకు పుట్టించి డిజిటల్‌ స్వప్నాన్ని సాకారం చేయగల మహదవకాశం కొత్తగా భారత్‌ తలుపు తట్టింది. తమ తమ మాతృభాషల్లో భారతీయుల ఇళ్లకు సమాచారం చేరవేయడానికి, దేశమంతటా డిజిటలీకరణకు ఊతమివ్వడానికి వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రూ.75వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి గూగుల్‌ సారథి సుందర్‌ పిచాయ్‌ సంసిద్ధత వ్యక్తపరచడం కీలక పరిణామం. ఈ ఏడాది చివరికి 10లక్షల మంది బోధన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సీబీఎస్‌ఈ(కేంద్ర మాధ్యమిక విద్యా మండలి)తో గూగుల్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఎన్నదగింది.

జియో సంస్థల్లో సుమారు రూ.42వేల కోట్ల పెట్టుబడులు గుమ్మరించిన ఫేస్‌బుక్‌ను వెన్నంటి ఇప్పుడు గూగుల్‌ సైతం రూ.30వేల కోట్ల మేర పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌లోని పెద్ద కంపెనీలు, అంకుర సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాల పట్ల దిగ్గజ సంస్థల ఆసక్తి.. కరోనా మహమ్మారి ఆవరింపజేసిన నిరాశానిస్పృహల నేపథ్యంలో నవోత్తేజం కలిగించేదే. నేడు ఆన్‌లైన్‌ పాలన, బోధన, లావాదేవీలకు విశేష ప్రాముఖ్యం ఏర్పడింది. ఊరూరా ఇంటింటా అంతర్జాల సదుపాయ పరికల్పనకు ఉద్దేశించిన 'డిజిటల్‌ ఇండియా' తడబాటు ప్రస్థానం ఇకమీదట జవనాశ్వం వడినీ వేగాన్నీ సంతరించుకునేలా- గూగుల్‌ తాజా చొరవ ఎంతగా ప్రభావాన్వితమవుతుందో చూడాలి!

వాషింగ్టన్‌, బీజింగ్‌ల నడుమ విభేదాలు రచ్చకెక్కిన దరిమిలా చైనాలో వాణిజ్యం నెరపే వీల్లేకుండా గూగుల్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌, ట్విటర్‌ వంటి సంస్థలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సహజంగానే వాటి దృష్టి చైనా తరవాత అత్యధికంగా 56కోట్ల మంది దాకా అంతర్జాల వినియోగదారులకు నెలవైన ఇండియాపై ప్రసరించింది. ఆ సంఖ్య భారత జనాభాలో సగానికన్నా తక్కువ కావడం మున్ముందు ఇనుమడించే వాణిజ్యావకాశాల్ని ప్రస్ఫుటీకరించేదే. గల్వాన్‌ లోయలో తీవ్రఘర్షణ, ఉద్రిక్తతల దృష్ట్యా టిక్‌ టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై భారత్‌నిషేధాస్త్రం ప్రయోగించింది. భారత విపణిలో దాగిన అపార అవకాశాల్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడం గూగుల్‌ ప్రభృత సంస్థలకు ఎంత లాభిస్తుందో, దేశ డిజిటల్‌ ప్రస్థానాన్ని శీఘ్రతరం చేసే అవకాశం ఇండియాకూ అంతే ప్రయోజనదాయకం.

అమెరికా, కెనడా, సింగపూర్‌లలో అరవై దాకా సంస్థల్లో మొత్తం లక్ష కోట్ల డాలర్ల భూరి ఆదాయానికి కారకులుగా చక్రం తిప్పుతున్న సత్య నాదెళ్ల, అరవింద్‌ కృష్ణ, లక్ష్మీ మిత్తల్‌ వంటివారెందరో ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారన్నది దేశార్థికాన్ని సాంత్వనపరచే సమాచారం. ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి భారీ ప్రణాళికలతో తరలివస్తున్న తరుణంలోనైనా సమాచార గోప్యత, వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతలపై కేంద్రం సత్వరం దృష్టి సారించాల్సి ఉంది. రెండు దశాబ్దాల క్రితం పార్లమెంటు ఆమోదముద్ర పొంది, 2008లో సవరణలకు లోనైన ఐటీ చట్ట నిబంధనలు వినియోగదారుల ప్రయోజనాల్ని సమర్థంగా కాపాడలేవని నిపుణులెందరో హెచ్చరిస్తున్నారు. ఐరోపా సంఘం సాధారణ సమాచార రక్షణ నియంత్రణల్ని సరిపోలే వ్యక్తిగత సమాచారభద్రత బిల్లు సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనలో ఉంది. మారిన పరిస్థితుల్లో అంతర్జాల సదుపాయాల్ని ప్రాథమిక హక్కుగా పరిగణించి, వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వని రీతిలో పకడ్బందీ చట్టం రూపొంది పటుతరంగా అమలైతేనే- డిజిటల్‌ భారతావనిపై పౌరుల కలలు నిజమవుతాయి!

ఇదీ చూడండి: గూగుల్ డీల్, గ్లాస్, 5జీ... రిలయన్స్ ఏజీఎం హైలైట్స్

ABOUT THE AUTHOR

...view details