భారత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ఫలవంతమైనా... రైతుల ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించింది. రైతుకు సాధికారత కల్పించే లక్ష్యసాధన కోసం చేపట్టే పథకాల కార్యాచరణ, వ్యూహాలను, చర్యలను చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రనూ విశ్లేషించాలి. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల నుంచి ఆదాయాన్ని సముపార్జించే వ్యాపార ప్రక్రియను నిర్వహించే వ్యక్తిని 'అగ్రిప్రెన్యూర్'గా పేర్కొనవచ్చు. రైతులు వ్యాపార దృక్పథంతో లాభ నష్టాలను అంచనా వేస్తూ అగ్రిప్రెన్యూర్స్‌గా రాణించాల్సి ఉంది. ముందుగా, చిన్నచిన్న కమతాలను పెద్దవిగా విస్తరించి, వాటిలో యాంత్రీకరణ పద్ధతులతో సేద్యం చేపట్టి అధిక ఉత్పత్తుల్ని సాధించాలి. వ్యవసాయోత్పత్తులకు తగిన రీతిలో మార్కెటింగ్ సౌకర్యాల్ని, గిడ్డంగి వసతులను సమకూర్చాలి. పశువులకు రోగ నిర్ధారణ, చికిత్స సదుపాయాలు, అవసరమైన మందులు ఇవ్వడం వంటి సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురావాలి.
సరైన సమాచారం కీలకం
ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రైతులు సరైన సమయంలో సమాచారాన్ని అందిపుచ్చుకుంటూ, దాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఏ పంటకు ఎలాంటి భూములు ఉపయుక్తమనే అంశాల్ని శాస్త్రీయంగా గుర్తించాలి. స్థానిక వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక విప్లవం కారణంగా స్మార్ట్ ఫోన్లు చౌకగా లభ్యమవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ప్రక్రియలో స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాల సేవలను ఉపయోగించుకొనే అవకాశాలు మెరుగయ్యాయి. ఇందుకోసం 'ఎలెక్ట్రానిక్- జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఇ-నామ్)' ద్వారా మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలను పొందడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకొనే దిశగా ముందుకు సాగవచ్చు. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన పంజాబ్ రిమోట్ సెంటర్‌ను వ్యవసాయ సమాచార కేంద్రానికి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతలను డ్రోన్ కెమెరాల సహాయంతో గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడం వ్యవసాయ రంగంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. రైతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు, అమలు, పర్యవేక్షణలోనూ సాంకేతికతను వినియోగిస్తే, రైతు ఆదాయాన్ని ఇనుమడింపజేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయరంగానికి, పంటలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, సూచనలు, సలహాలు అందించేందుకు, సమాచార సేకరణ, వ్యాప్తి కోసం సమగ్రరీతిలో సులభంగా వాడుకొనేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలి. ప్రభుత్వాలు కొనసాగిస్తున్న పీఎంకిసాన్, తెలంగాణలో రైతుబంధు, ఏపీలో రైతుభరోసా, ఒడిశాలో కలియా వంటి పథకాల్లో కొద్దిపాటి నిబంధనల మార్పుతో నియంత్రిత సాగు తరహా విధానాలను అమలు చేస్తే- పంట దిగుబడుల సరఫరా, డిమాండ్‌లలో సమతౌల్యం సాధించవచ్చు. ఫలితంగా ఉత్పత్తులకు తగిన ధర లభించి రైతుల ఆదాయం పెరుగుతుంది.