చైనాతో సరిహద్దు వివాదం ముదురుతున్న తరుణంలో నేపాల్ కూడా కయ్యానికి కాలు దువ్వడం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఓవైపు భారత సైనికులపై చైనా దుస్సాహసానికి దిగితే.. మరోవైపు నేపాల్ తన సరిహద్దు వివాదాన్ని పార్లమెంట్‌కు తీసుకెళ్లింది. అసలు ఎన్నడూ లేని విధంగా సరిహద్దు విషయంపై నేపాల్ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణమేంటి?
చైనా హస్తం ఉందా?
సరిహద్దు వివాదాన్ని నేపాల్ తెరపైకి తీసుకురావడం వెనుక చైనా హస్తం ఉందని అనేక మంది భావిస్తున్నారు. భారత సైన్యాధిపతి ముకుంద్ నరవాణే సైతం ఇదే విధంగా స్పందించారు. నేపాల్ చర్యకు కారణం చైనా అని ఆరోపించారు. అయితే ఇది 100శాతం నిజం కాకపోవచ్చు. 'నేపాల్ లాంటి మిత్ర దేశం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోదు' అని అనుకున్న భారత్ ఆలోచన.. ఆ దేశ సర్కారును తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
అనంతరం.. భారత్‌కు చెందిన మూడు ప్రాంతాలను తమదేవంటూ నేపాల్ ఓ మ్యాప్‌ను రూపొందించడం, దానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్రవేయడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందని ఆలోచించకుండానే నిర్ణయాలు తీసేసుకుంది నేపాల్. బిల్లు గట్టెక్కేంత వరకు భారత్‌ను సంప్రదించలేదు.
ఓలి వైఫల్యాలతో..
అయితే ఇటీవలి కాలంలో ప్రధాని కేపీ ఓలి ప్రభుత్వంపై నేపాల్‌వాసులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభం పట్ల ఓలి వైఖరిపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా భారత్ కారణమని నిందారోపణలు చేశారు ప్రధాని. సరిహద్దు నుంచి వస్తున్న వారి వల్లే నేపాల్‌లో వైరస్ కేసులు పెరుగుతున్నాయన్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు.
మరోవైపు.. భారత్‌తో ఓలి మైత్రి గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. ముఖ్యంగా తన ఆరోగ్యం క్షీణించిన సమయంలో తనను గద్దె నుంచి దించడానికి భారత్ ప్రయత్నించిందని ఓలి భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఓలి అధికారం చేపట్టే విధంగా నేపాల్‌లోని చైనా రాయబారి జోక్యం చేసుకున్నారు.