కొవిడ్ తాకిడికి కోట్లమంది వలస కూలీలు పట్టణాలు వదలి స్వగ్రామాలకు పయనమై వెళుతూ నానా అగచాట్లపాలు కావడం అందరి మనసులనూ కలచివేసింది. పొట్ట చేత్తోపట్టుకుని నగరాలకు చేరిన నిరుపేద కూలీలకు స్వస్థలాల్లోనే జీవనాధారం కల్పించాల్సిన ఆవశ్యకతను కరోనా కల్లోలం తెలియజెప్పింది. పల్లెల్లోనే మెరుగైన జీవన స్థితిగతులను, ఉపాధిని కల్పిస్తే కోట్ల మంది ఏటా దూర స్థలాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పుతుంది. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతుంది. దేశంలోని ఆరున్నర లక్షల పైచిలుకు గ్రామాల్లో నివసిస్తున్న 80 కోట్లమంది పౌరులు స్వావలంబనతో జీవించడానికి సాంకేతికత అమోఘంగా ఉపకరించగలదు. దీన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో గ్రామీణ విజ్ఞాన వేదికను ఏర్పాటుచేయాలి. భారత్‌లో గత పదేళ్లలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు విజృంభించాయి. వేర్వేరు అంచనాల ప్రకారం వీరి సంఖ్య 7.2 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన చైనా తరవాత అత్యధిక వలస కూలీలు ఉన్నది ఇండియాలోనే.
గాంధేయ గ్రామస్వరాజ్
గ్రామీణానికి నయా వృద్ధి నమూనా గ్రామాలు స్వయంసమృద్ధం కావాలన్నదే గాంధీజీ గ్రామస్వరాజ్య పరమార్థం. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక చంపారన్ (1917), సేవాగ్రామ్ (1920), వార్థా (1938) వంటి గ్రామీణ ఉద్యమాలను నడిపించారు. గ్రామ స్థాయిలో వికేంద్రీకృత రాజకీయ యంత్రాంగం ఏర్పడాలని, మౌలిక వసతుల నిర్మాణ పనులు చేస్తూ గ్రామీణులు ఆర్థిక స్వావలంబన, సామాజిక సమానత్వం సాధించుకునే వాతావరణం నెలకొనాలని లక్షించారు. స్వయంసమృద్ధ గ్రామాలనే సారవంతమైన నేలలో నిజమైన ప్రజాస్వామ్యం వేళ్లూనుకొంటుందని ఆయన ప్రబోధించారు. 'గ్రామ స్వరాజ్యమంటే ప్రతి గ్రామం ఓ గణతంత్ర రాజ్యంగా విలసిల్లడం. తన మౌలిక అవసరాలను తానే తీర్చుకుంటూ ఇరుగుపొరుగు గ్రామాలతో ఇచ్చిపుచ్చుకొనే గ్రామ రాజ్యమది. స్వావలంబన, పరస్పరావలంబనల ఉత్తమ గుణ సంగమమే గ్రామ స్వరాజ్యం' అని గాంధీజీ ఉద్ఘాటించారు. గ్రామ స్వరాజ్యమంటే పల్లె ప్రజలు స్థానికంగా పనిపాటలు చేసుకుంటూ ఎక్కువ ఉత్పాదకతతో అధిక ఆదాయాలు పొందడం. గ్రామాభివృద్ధికి సాంకేతికత కీలకమని గాంధీజీ గుర్తించారు. సంప్రదాయ రాట్నాన్ని సాంకేతిక హంగులతో ఆధునికంగా తీర్చిదిద్దగలిగేవారికి లక్ష రూపాయల (నేటి విలువలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల) బహుమానం ఇస్తామని నాటి బ్రిటిష్, భారతీయ వార్తాపత్రికల్లో ఆయన ప్రకటించారనే సంగతి చాలామందికి తెలియదు.
గ్రామాలకు ఆధునిక వసతుల కల్పనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గ్రామీణాభివృద్ధికి పుర పథకాన్ని ప్రతిపాదించారు. 50 నుంచి 100 గ్రామాలను ఒక సముదాయంగా ఏర్పరచి ఉమ్మడి వసతులు, మార్కెట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివృద్ధి ఊపందుకొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సముదాయాన్ని 'పుర కాంప్లెక్స్'గా వ్యవహరించారు. పుర సముదాయాలను రోడ్ల వంటి భౌతిక వసతులతో; సాంకేతిక, విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానించాలని కలామ్ ప్రతిపాదించారు. ఈ నాలుగు సంధానాలతో గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయన్నారు. కలామ్ 2004 జనవరిలో చండీగఢ్‌లో జరిగిన భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ 90వ మహాసభలకు పుర నమూనాను సమర్పించారు. స్వయంసమృద్ధ గ్రామాలే పునాదిగా భారతదేశం ఆర్థికంగా సమున్నత శిఖరాలను అందుకోగలుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. కొన్ని గ్రామాలను కలుపుతూ 30 కిలోమీటర్ల చుట్టుకొలతతో రింగు రోడ్డు నిర్మించి, సముదాయంలోని గ్రామాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పరచి ఉమ్మడి మార్కెట్‌గా రూపాంతరం చెందించడం పుర పథకంలో కీలక భాగం. దీనివల్ల పట్టణాలపై ఒత్తిడి తగ్గి, పుర గ్రామ సముదాయాల్లోనే నివాస వసతులు వృద్ధి చెందుతాయి. పోనుపోను గ్రామాల నుంచి గ్రామాలకు వలసలు జరుగుతూ, గ్రామాల నుంచి పట్టణాలకు వలస రద్దీ తగ్గుతుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద ఒక్కో యూనిట్‌కు రూ.130 కోట్ల ఖర్చుతో మొత్తం 7,000 పుర సముదాయాలను నిర్మించాలని కలామ్ పుర పథకం ప్రతిపాదించింది. పుర గ్రామ సముదాయాల్లో పట్టణాలకు తీసిపోని జీవన నాణ్యతను అందించాలని కలామ్ కలగన్నారు.