తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అంతర్జాలం... రేట్ల మాయాజాలం - డేటా సేవల వ్యయాలు ఇంత చౌకగా

ప్రపంచంలో డేటా కారుచౌకగా లభిస్తోంది భారత్​లోనే. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 188వ స్థానంలో ఉంది. ఉత్పాదక వ్యయాలు గణనీయంగా పెరిగినా.. డేటా సేవల వ్యయాలు ఇంత చౌకగా ఎలా లభిస్తున్నాయన్నదే ఆలోచించాల్సిన విషయం.

internet rates
అంతర్జాలం... రేట్ల మాయాజాలం

By

Published : Mar 16, 2021, 7:44 AM IST

అత్యంత వేగవంతమైన, నిరాటంకంగా పనిచేసే అంతర్జాల డేటా సదుపాయం పొందాలని ప్రతి ఒక్కరూ ఉబలాటపడుతుంటారు. స్వాతంత్ర్యానంతరం తొలి మూడు దశాబ్దాల్లో ఇంటి ఫోన్‌ కనెక్షన్‌ కోసమూ ఇంతే ఆరాటపడేవారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్స్‌ రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. గడచిన అర్ధ శతాబ్దంలో జనజీవనం చెప్పలేనంతగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, అంతర్జాల ఆధారిత గృహోపకరణాలు (ఐఓటీ- ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) తామరతంపరగా జనబాహుళ్యంలోకి చొచ్చుకువచ్చాయి. వైమాక్స్‌, వైఫై ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో... అంతర్జాల వినియోగం పుంఖానుపుంఖంగా పెరుగుతోంది. విద్య, వైద్య, ఆర్థిక సేవలు, ప్రింటు, ఎలెక్ట్రానిక్‌ మీడియా, ఇతర వ్యాపార సంస్థలకు అంతర్జాల అవసరం మునుపెన్నడూ లేనంత కీలకంగా మారింది. ఫలితంగా అంతర్జాల వాడకం అతిస్వల్పకాలంలోనే భారీగా పెరిగింది. అంతర్జాల సేవలు భారత్‌లోనే కారు చౌకగా లభిస్తున్నాయి.

మోయలేని భారం

అంతర్జాల సేవలే కాదు, విద్యుత్తు డీజిలు సైతం ఆర్థిక వ్యవస్థకు- మరీ ముఖ్యంగా... సామాన్యులకు అతి ముఖ్యమైన అవసరాలే! డేటా వ్యయాల మీదా వీటి భారం పడుతుంది. గడచిన రెండు దశాబ్దాలుగా ఇంధన వ్యయం పెరుగుతోంది. దీని ప్రభావంతో నిత్యావసరాల ధరలు రెండు లేదా మూడు రెట్లు ఖరీదయ్యాయి; అదే సమయంలో కాల్‌ఛార్జీలు 92శాతం, డేటా ధరలు 98శాతం చౌక అయ్యాయి! విద్యుత్తు ఛార్జీల సగటు ధరలను ఈ తరహాలో లెక్కించడం కష్టం. బొగ్గు ఆధారిత తాప విద్యుత్తు, జల విద్యుత్తు, సౌర విద్యుత్తు... ఇలా రకరకాలుగా సేకరణ ఉండటం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ధరలు ఉంటున్నాయి. ఏమైనా, ఈ విద్యుత్తు వ్యయం సైతం- టెలిస్కోపిక్‌ బిల్లింగు, సబ్సిడీలు తోడై- ఇదే కాలంలో దేశవ్యాప్తంగా 50 శాతానికి మించి పెరిగింది. కారుచౌకగా టెలికాం సేవలు అందించేందుకు ప్రభుత్వ ఖజానాను పణంగా పెట్టడం, కనికరం లేకుండా పన్నులు విధిస్తూ ఇంధన ధరలను భగ్గున మండించడం... ఈ రెండు సందర్భాల్లోనూ సామాన్యుడే దెబ్బతింటున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఉత్పాదక వ్యయాలు గణనీయంగా పెరిగాయి. అలాంటప్పుడు డేటా సేవల వ్యయాలు ఇంత చౌకగా ఎలా లభిస్తున్నాయన్నదే ఆలోచించాల్సిన విషయం. తాజా గణాంకాల ప్రకారం, డేటా ధరలు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉండగా, అమెరికా 188వ స్థానంలో నిలిచింది. అంటే ఆ దేశంలో డేటా ధరలు చాలా ఎక్కువ. ఇందుకు పూర్తి భిన్నంగా- ఇంధన వ్యయాల విషయంలో భారత్‌ 115వ స్థానంలో ఉండగా, అమెరికా స్థానం 38గా ఉంది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం తలసరి ఆదాయంలో అమెరికా స్థానం 5-8 మధ్య ఉండగా, భారత్‌ ఎంతో దిగువన 142వ స్థానంలో ఉంది. కారుచౌక రేట్లకు డేటా అందిస్తున్నామంటూ... ప్రభుత్వం ఇలా ఆర్భాటాలకు పోవడం సమర్థనీయ ఆర్థిక విధానమేనా?

మొబైల్ బ్రాడ్​బ్యాండ్ విస్తృతి

హేతుబద్ధత అవసరం

టెలికాం సేవల సంస్థలు (టీఎస్‌పీలు) పోటీ పేరిట ధరలను అసాధారణంగా తగ్గించి... బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అంతులేని ఆర్థిక ఒత్తిడికి గురి చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్నీ దెబ్బతీశాయి. పతాక స్థాయికి చేరిన ధరల తగ్గింపు పోటీలో అనేక సంస్థలు దివాలా తీశాయి. ఆర్థిక వ్యాజ్యాలు వెల్లువెత్తాయి. డజనుకు పైగా ఉన్న టీఎస్‌పీలు నేడు కేవలం మూడుకే పరిమితమయ్యాయి. కార్పొరేట్‌ సంస్థగా మారిన బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఈ పోటీలో సమాన అవకాశాలకు దూరం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ హోదాలో అద్భుతంగా వెలిగిపోయిన ఈ టీఎస్‌పీని పద్ధతి ప్రకారం ఇప్పటి దుస్థితికి దిగజార్చారు. అయితే, దీనికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా పూర్తిగా అంతరించిపోనీయలేదు. ఇక, ప్రైవేటు టీఎస్‌పీలు కారుచౌక ధరల వల్ల తాము దెబ్బతినడమే కాకుండా, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవిన్యూ- ఏజీఆర్‌) ఉత్తర్వులను వక్రీకరించి ప్రభుత్వానికీ భారీ మొత్తంలో రూ.1,47,000 కోట్లు బకాయి పడ్డాయి. ఈ మొత్తం వెంటనే చెల్లించలేమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి, గత సెప్టెంబరు ఒకటోతేదీన పది సంవత్సరాల గడువు పొందాయి. ఏ సంస్థ కూడా ఏ వస్తుసేవలనైనా వాటి ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకు విక్రయించలేదన్నది ప్రాథమిక ఆర్థిక సూత్రం. అయినా సరే, కారుచౌక ధరలతో వ్యాపారం చేసే కంపెనీలకు- అటు బ్యాంకుల్ని, ఇటు ప్రభుత్వ ఖజానాను వాడుకుని ప్రజాధనంతో లాభాలు గడించడానికి ఎలా అనుమతిస్తారు? వనరుల వ్యయాలను హేతుబద్ధంగా అంచనా వేయడం, ఉత్పత్తులకు సమంజసమైన ధరలు నిర్ణయించడం, ఉచితాలు, సబ్సిడీల విధానాలకు స్వస్తి పలకడం వంటి చర్యల ద్వారా టెలికాం రంగంలో సుస్థిర వ్యాపార వాతావరణాన్ని సృష్టించాలి.

పునస్సమీక్ష తప్పనిసరి

ఆ దిశగా ప్రభుత్వం అన్ని ఆదాయ కల్పన వనరులనూ గుర్తించాలి. మొదటగా, టెలికాం ఛార్జీలకు కనీస స్థాయిని నిర్ణయించాలి. కంపెనీల మధ్య పోటీ... విలువ జోడింపునకు, 'ట్రాయ్‌' నిర్ణయించే సేవా నాణ్యత (క్యూఓఎస్‌) పరామితులను చేరుకునేందుకు పరిమితం కావాలి. రెండోది, వినోదానికై ఒక సినిమా 'డౌన్‌లోడ్‌' చేసుకునే సాధారణ వ్యక్తి కంటే జాతి నిర్మాణంలో నిమగ్నమైన ప్రభుత్వ సంస్థకు, నిరంతర వార్తా సేకరణలో ఉండే పాత్రికేయుడికి విశేష ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. నెట్‌ న్యూట్రాలిటీ (అంతర్జాల తటస్థత) విధానాన్ని ప్రభుత్వం పునస్సమీక్షించుకోవాలి. వేగవంతమైన అంతర్జాల అనుసంధానతను ముఖ్య వ్యక్తులకు, సంస్థలకు అధిక ధరకు సమకూర్చి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి. మూడోది- ప్రజల సంరక్షణకర్తగా ప్రభుత్వానికి స్పెక్ట్రం వనరుపై పరిపూర్ణ యాజమాన్యం ఉండాలి. లీజు, విక్రయం, మూడో పక్షానికి తాకట్టు వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. కాల్‌ రేట్లు, డేటా ఛార్జీలు ఇప్పటి స్థాయి నుంచి కొంత పెంచినా భారతీయ వినియోగదారుల మీద ఆ ప్రభావం నామమాత్రంగానే ఉంటుంది. తద్వారా పెరిగే ఆదాయాల సానుకూల ప్రయోజనాలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యంగా టీఎస్‌పీల రాబడి పెరగడంతో రుణ బకాయిలు తీర్చేందుకు వాటికి వెసులుబాటు ఇనుమడిస్తుంది. టీఎస్‌పీల నగదు నిల్వలు పెరిగి బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత మెరుగు పడుతుంది. ప్రభుత్వ ఆదాయాలు పెరిగి స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవుతుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు నెరవేరేందుకు దోహదపడతాయి. రేట్లు ఎక్కువగా ఉంటాయి కనుక వినియోగదారులు విచక్షణతో డేటాను వాడుకుంటారు. ఉత్పాదక కార్యాలపై వినియోగం పెరుగుతుంది. భూతాపాన్ని తగ్గించడానికీ గణనీయంగా తోడ్పడుతుంది.

-ఎం.ఆర్‌.పట్నాయక్‌ (రచయిత - బీఎస్‌ఎన్‌ఎల్‌, విశాఖ రీజియన్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌)

ఇదీ చదవండి:వ్యాక్సినేషన్​పై పార్లమెంటరీ కమిటీ​ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details