వివేక మంత్రం.. ఆధ్యాత్మిక మానవతా వాదం.. భారత్‌తోపాటు యావత్ ప్రపంచాన్ని.. - స్వామి వివేకానంద ప్రపంచ సర్వమత సమ్మేళనం
భారతదేశంలో జన్మించి, ఈ కర్మభూమి ఔన్నత్యాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. ఆయన చేసిన ఆధ్యాత్మిక సింహనాదం భారత్‌తో పాటు యావత్ ప్రపంచాన్నీ జాగృతం చేసింది. వివేకానందుల వారి జీవితం, లక్ష్యం, సందేశం గురించి యువతకు అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకం.
స్వామి వివేకానంద
By
Published : Jan 12, 2023, 7:26 AM IST
మన ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, వైభవంతో కూడిన నవభారతాన్ని నిర్మించాలని స్వామి వివేకానంద కలగన్నారు. భారతీయ ఆలోచనలు, సంస్కృతి, తాత్విక కోణాన్ని తమ రచనల్లో ఆవిష్కరించిన జగద్గురు ఆదిశంకరాచార్యుల వంటి మహనీయుల కోవలోనే- స్వామి వివేకానంద తన మాటల్లో, రచనల్లో వేదాలు, ఉపనిషత్తుల రహస్యాలను, ప్రాచీన సంస్కృతిలోని భిన్న అంశాల గొప్పతనాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరించారు. సనాతన ధర్మంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సాంస్కృతిక వారసత్వ సారాంశాన్ని స్వీకరించడంతో పాటు, దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరముందని ఆయన బలంగా విశ్వసించారు. దాన్నే చాటి చెప్పారు.
మానవ సేవే మాధవ సేవగా.. స్వామి వివేకానంద దృష్టిలో మానవసేవకు అంకితం కావడం భగవంతుడి సేవతో సమానం. నిజమైన కర్మయోగి తోటి మానవుల పట్ల కరుణ, సహానుభూతితో సేవ చేయగలడని ఆయన విశ్వసించారు. భగవద్గీత స్ఫూర్తితో తాను బోధించిన దాన్నే ఆచరించారు. 'తూర్పూ పడమరల మధ్య, మతం శాస్త్రాల మధ్య, గతం వర్తమానాల మధ్య వివేకానంద సమన్వయం సాధించారు. అందుకే ఆయన మహోన్నత వ్యక్తి' అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు వివేకానందుల వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మన కళ్లకు కడతాయి. మతం, విజ్ఞానం పరస్పర విరుద్ధమైన భావనలు కావని, అవి ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేసుకునే అంశాలని వివేకానందులవారు అభిప్రాయపడ్డారు.
షికాగోలో 1893లో ప్రపంచ సర్వమత సార్వత్రిక సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ప్రసిద్ధిగాంచింది. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతుల సారాంశాన్ని ఆయన తన ప్రసంగంలో సంక్షిప్తీకరించారు. భారతీయ నాగరికతతో ముడివడిన సహనం గురించీ విశదీకరించారు. 'మతపరమైన హింసకు తావులేని ఏకైక దేశం భారత్ మాత్రమే... అక్కడ ఏ వ్యక్తీ తన మతవిశ్వాసం విషయంలో సమస్యలు ఎదుర్కోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆస్తికులు, నాస్తికులు, ఏకేశ్వరవాదులు, ద్వంద్వవాదులు... ఇలా ఎంతోమంది భారతదేశంలో ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారు' అంటూ దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.
సంపన్న కుటుంబంలో 1863, జనవరి 12న జన్మించిన నరేంద్రనాథ్ దత్తా మదినిండా యోగ స్వభావం, ఆధ్యాత్మిక దృక్పథమే! యువకుడిగా అతడి మనసులో అనేక సందేహాలు ఉండేవి. ఒకానొక సమయంలో దేవుడి ఉనికిని ప్రశ్నించారు. తన గురువైన రామకృష్ణ పరమహంసను కలుసుకున్న తరవాత ఆ సందేహాల మబ్బులు తొలగిపోయాయి. జీవిత పరమార్థం, లక్ష్యం ఆయనకు అవగతమయ్యాయి. వివేకానందుడిగా మారడానికి ముందు యువ నరేంద్రుడి మనోజ్ఞానం రామకృష్ణ పరమహంస ద్వారా ఆధ్యాత్మికదారుల్లో పయనించింది. వివేకానందుడు తన జీవితాన్ని మానవసేవకు అంకితం చేసుకోవడానికి బలమైన ప్రేరణాశక్తి రామకృష్ణ పరమహంసే. శ్రీరామకృష్ణ పరమహంస భౌతికకాయాన్ని చాలించిన తరవాత నరేంద్రనాథ్ సన్యాసిగా ప్రమాణంచేసి వివేకానంద స్వామిగా మారారు. శాస్త్రాలు, గురువు, భారతమాత అనే మూడు ప్రవాహాలు ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ముందుకు నడిపాయి.
వివేకానంద దేశమంతటా పర్యటించి అనేకమంది పండితులు, సాధువులు, సామాన్యులతో సంభాషించారు. తద్వారా భారతీయ సంస్కృతిలోని భిన్న కోణాలను అధ్యయనం చేశారు. నాటి వలస పాలకులు తన ప్రజలను ఎంతటి దయనీయ పరిస్థితుల్లోకి నెట్టారో చూసి చలించిపోయారు. పేదరికంతో అల్లాడుతున్న ప్రజలను చూసి ఆవేదన చెందారు. దేశం మహోన్నత మార్గంలో పయనించాలంటే ప్రజల మనసులను పునరుత్తేజంతో నింపాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని భావించారు. ఇందుకు అనుగుణంగా 'ఆత్మ సంభావ్యత దైవత్వ భావన'ను ప్రబోధించారు. కడు పేదరికాన్ని అనుభవిస్తున్నా దేశ ప్రజలు సనాతన ధర్మానికి కట్టుబడి ఉండటాన్ని ఆయన గ్రహించారు. వారికి కావలసింది వేదాంత సూత్రాలను జీవితంలో ఎలా అన్వయించుకోవాలన్నది తెలియజెప్పడమేనని బలంగా విశ్వసించారు. ఈ క్రమంలోనే 1897లో స్వామి వివేకానంద 'రామకృష్ణ మిషన్'ను స్థాపించారు. దీని ద్వారా సన్యాసులు, ఇతర శిష్యులు కలిసి ఆయన బోధించిన ఆచరణాత్మక వేదాంత ప్రచారాన్ని చేపట్టారు. సామాజిక సేవా కార్యక్రమాలనూ చేపడుతున్నారు.
యువతకు ఆదర్శం.. నానాటికీ పెరుగుతున్న ప్రపంచీకరణతో పాటే మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. ఈ తరుణంలో యువతరం స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని భారతదేశాన్ని చక్కని మార్గంలో ముందుకు నడిపించాలి. 'లేవండి. మేల్కొనండి. గమ్యం చేరేవరకు విశ్రమించకండి' అన్న వివేకానందుడి వాక్కుల స్ఫూర్తితో యువత కార్యోన్ముఖులు కావాలి. అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాడాలి. 'మన నేత్రాలు తెరుచుకుని, హృదయం శుద్ధి అయినప్పుడు దైవిక ప్రభావం పని ప్రారంభిస్తుంది. అందరి హృదయాల్లోనూ ఒకే దైవత్వం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు మాత్రమే మనం సౌభ్రాతృత్వాన్ని పొందగల స్థితిలో ఉంటాం' అన్న వివేకానందుల వారి వాక్కుల ప్రేరణతో యువత ప్రగతిపథంలో ముందుకు సాగాలని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
విశ్వసౌభ్రాతృత్వ భావనను బోధించాలి స్వామి వివేకానందుల రచనలు, వారి సందేశాలను భావితరాలు, ముఖ్యంగా యువతీయువకులు అవగాహన చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. తోటివారికి సేవ చేయడం ద్వారా ప్రతి మనిషీ తనలోని నిజమైన దైవత్వాన్ని దర్శించుకోవాలని, అప్పుడే మనం విశ్వ సౌభ్రాతృత్వ లక్ష్యాన్ని చేరుకోగలమని స్వామి వివేకానంద సూచించారు. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాల వంటి వైషమ్యాలతో నలిగిపోతున్న ప్రపంచానికి ఆయన ప్రతిపాదించిన 'ఆత్మ సంభావ్యత దైవత్వ భావన' సానుకూల పరిష్కారాన్ని అందిస్తుంది. సంఘర్షణలకు, విలువల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు తోడ్పడుతుంది. వివేకానందుడు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక మానవతావాదం, విశ్వసౌభ్రాతృత్వ భావనలను నేటి యువత స్వీకరించేలా సానుకూల మార్గంలో తప్పనిసరిగా బోధించాలన్నది నా ప్రగాఢ విశ్వాసం.