తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఒకే వేదికపైకి విపక్షాలు.. కాంగ్రెస్​తో కలిసి బీజేపీని ఓడిస్తాయా? - కర్ణాటక ఎన్నికలు 2023

కర్ణాటకలో కాంగ్రెస్​ ప్రభుత్వ ప్రమాణస్వీకారం కొత్త ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక కానుందా? కాంగ్రెస్​ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తామన్న విపక్ష పార్టీలు.. తిరిగి ఆ పార్టీతోనే కలిసి బీజేపీపై పోరాడనున్నాయా? శనివారం కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సందర్భంగా జాతీయ రాజకీయం ఎలాంటి మలుపు తిరగనుంది?

karnataka election results 2023
karnataka election results 2023

By

Published : May 19, 2023, 7:37 PM IST

Updated : May 19, 2023, 8:12 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో.. జాతీయ రాజకీయం కీలక మలుపు తిరగనుందా? సిద్ధరామయ్య-డీకే శివకుమార్ మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఇందుకు వేదిక కానుందా? ఇప్పటివరకు తలో దారిలో నడిచిన విపక్షాలు.. ఐక్యతా రాగం ఆలపించనున్నాయా? 2024లో బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉమ్మడి పోరు ప్రారంభించనున్నాయా? శనివారం బెంగళూరులో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే నేతల జాబితా చూస్తే ఔననే అనిపిస్తోంది.

కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు? ఏ పార్టీల వారు?
బెంగళూరులో జరిగే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్​ సీఎం అశోక్ గహ్లోత్, బిహార్ నీతీశ్​ కుమార్​, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్​​ హాజరుకానున్నారు. వీరితో పాటు ఏకసారుప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు శివసేన ఉద్దవ్​ వర్గం నేత ఉద్దవ్​ ఠాక్రే, ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ రానున్నారు. వీరితో పాటు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్​కు ఆహ్వనం పంపించింది కాంగ్రెస్​. కానీ ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని చెప్పారు మమతా బెనర్జీ. తమ పార్టీ తరఫున సీనియర్ నేత కకోలి ఘోష్​ హాజరుకానున్నట్లు తెలిపారు.

అయితే, టీఎంసీ నేత హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి.. నీతీశ్​, ఠాక్రే వచ్చినప్పుడు మమత కూడా రావాలి. ఆహ్వానం అందింది కూడా. అయితే.. ఆమె తరఫున టీఎంసీ ప్రతినిధి వస్తున్నారు. అయినా.. ఇది విపక్ష కూటమికి సానుకూలాంశమే. ఎందుకంటే.. ఇప్పటివరకు కాంగ్రెస్​తో కూడిన కూటమి విషయంలో మమత సుముఖంగా లేరు. ప్రత్యామ్నాయ కూటమి కోసం మరికొన్ని పార్టీలతో కలిసి ప్రయత్నాలు చేశారు. కానీ కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత లెక్క మారింది. మమత స్వరం మారింది.

అఖిలేశ్ యాదవ్​తో మమతా బెనర్జీ (పాత చిత్రం)

"కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట తప్పకుండా పోరాడాలి. వారికి మేం మద్దతు ఇస్తాం. అందులో తప్పేమీ లేదు. కానీ, వారు ఇతర పార్టీలకూ మద్దతు తెలపాలి. మా మద్దతు కావాలంటే కాంగ్రెస్‌ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలి."

--మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

కాంగ్రెస్​తో ప్రయాణంపై ఇలా మాట్లాడిన కొద్దిరోజులకే ఆమెకు ఆహ్వానం అందింది. దీనికి స్పందించిన ఆమె స్వయంగా రాకపోయినా ప్రతినిధిని పంపిస్తున్నారు. విపక్షాల మధ్య మరికొన్ని చర్చలతో ఈ కూటమి రాజకీయాలు మరింత మారే అవకాశం లేకపోలేదు.

మమతా బెనర్జీతో నీతీశ్ కుమార్​ (పాత చిత్రం)

కూటమికి దూరమన్న పట్నాయక్..
ప్రస్తుతానికి విపక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చే పనిలో నిమగ్నమైన నీతీశ్.. వేర్వేరు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అయితే.. ఒడిశా విషయంలో ఆయనకు నిరాశే ఎదురైంది. నీతీశ్​ కుమార్​ను కలిసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్.. కూటమిలో చేరేందుకు ఇష్టపడలేదు. తాము తృతీయ కూటమిలో చేరడం లేదని, జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సమాన దూరమన్న విధానానికి కట్టుబడి ఉన్నామని.. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందినా నవీన్ వస్తారన్న నమ్మకం లేదు.

కాంగ్రెస్ నేతలతో నీతీశ్ కుమార్​ (పాత చిత్రం)

2024లో బీజేపీపై ఉమ్మడి పోరు!
దేశవ్యాప్తంగా ఎంతో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టాలంటే ఉమ్మడిగా పోరు చేయాలని కొంత ఆలస్యంగా తెలుసుకున్నాయి విపక్షాలు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమి ఏర్పాటు చేసినా.. బీజేపీని ఎదుర్కోలేమని విషయాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్​తో పొత్తుకు సై అన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. ​మరోవైపు ఈ ఏడాది చివర్లోనే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికలకు సెమీఫైనల్​గా భావించే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తే బీజేపీని ఓడించడం సులభం అవుతుంది.

ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు
మరోవైపు కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్​ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి 1,500కి పైగా పోలీసులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి :డీకేపై ఆ 2 విషయాల్లో సిద్ధరామయ్య పైచేయి.. ఆయనకే ఛాన్స్?

కొంపముంచిన 'అవినీతి'.. కాపాడని హిందుత్వం.. బీజేపీ ఓటమికి కారణాలివే!

Last Updated : May 19, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details