తెలంగాణ

telangana

ETV Bharat / opinion

స్థానిక పాలన... ప్రగతికి ఆలంబన! - గ్రామ పంచాయతీలపై సర్కారియా కమిషన్‌

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందనేది నిజం. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికార బదిలీ మొదలు.. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పల్లెల వృద్ధి కుంటుపడుతోంది. గాంధీజీ కలలుకన్న ఆదర్శాల అమలు వాస్తవ రూపం దాలిస్తేనే గ్రామాలు నిజమైన అభివృద్ధికి నోచుకుంటాయి. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పంచాయతీల తీరు తెన్నులపై ప్రత్యేక కథనం..

national panchayati raj day
పంచాయతీ రాజ్​ దినోత్సవం

By

Published : Apr 24, 2021, 9:25 AM IST

Updated : Apr 24, 2021, 10:19 AM IST

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత- గ్రామీణం స్వావలంబన దిశగా అడుగులు వేయాలని గాంధీజీ కలలు కన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగంలోని 40వ అధికరణ కింద- గ్రామ వికాసానికి మూలమైన స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ, స్వయం ప్రతిపత్తికి అవసరమైన అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టారు. 1952లో ప్రవేశపెట్టిన సాముదాయిక అభివృద్ధి పథకం నిర్దేశిత లక్ష్యాలను అందుకోకపోవడానికి కారణం- గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యం కొరవడటమేనన్నది చేదు నిజం. దేశ జనాభాలో అధికశాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. భారత సమగ్రాభివృద్ధిలో పల్లెలు కీలక భూమిక పోషిస్తున్నాయి. భారత స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 19.9శాతం. సగానికి పైగా శ్రామిక జనాభా వ్యవసాయంలోనే ఉపాధి పొందుతోంది. భారతదేశం రెండు దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తోంది. పండ్ల ఉత్పత్తిలో అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పల్లెల్లో పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహార లోపాలు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత తాండవిస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే పంచాయతీలను బలోపేతం చేయడమే పరిష్కారమని ఎన్నో కమిటీలు స్పష్టం చేశాయి.

బలహీన వ్యవస్థలుగా..

సమాజాభివృద్ధి ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ సేవలను అధ్యయనం చేయడానికి జాతీయ అభివృద్ధి మండలి- బల్వంత్‌రాయ్‌ మెహతా అధ్యక్షతన 1957లో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిపాలనను క్రమబద్ధీకరించడానికి మూడంచెల పంచాయతీ రాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అంటే.. గ్రామ స్థాయిలో పంచాయతీ, బ్లాక్‌ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌ ఉండాలని సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా- వివిధ రకాల స్థానిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తరవాత నిధుల కొరతతో అవి ఆశాజనక ఫలితాలను ఇవ్వలేకపోయాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి 1977లో అశోక్‌ మెహతా అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటయింది. మూడంచెల స్థానిక సంస్థలకు బదులు రెండంచెల వ్యవస్థను అంటే.. జిల్లా పరిషత్‌, మండల పంచాయతీ మాత్రమే ఉండాలని ఈ కమిటీ అభిప్రాయపడింది. ఆ తరవాత 1984లో జీవీకే రావు, 1986లో సింఘ్వీ కమిటీలు సైతం గ్రామసభ పునర్నిర్మాణాన్ని నొక్కి చెప్పాయి. పంచాయతీరాజ్‌ వ్యవస్థలకు మరిన్ని అధికారాలు అవసరమని వెల్లడించాయి.

ఇదీ చదవండి:భావ ప్రకటనకు విరుద్ధ భాష్యాలు

ఇదీ చదవండి:జన చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష

కేంద్ర-రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన సర్కారియా కమిషన్‌ సైతం స్థానిక సంస్థలకు నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల నిధులు, గ్రాంట్లు సకాలంలో చేరడంలేదని వెల్లడించింది. 1989లో కేంద్ర ప్రభుత్వం మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోయింది. అనంతరం పీవీ నరసింహారావు హయాములో ప్రభుత్వం ఆ బిల్లులో కొత్త సవరణలు చేస్తూ 1991లో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. ఇందులోని 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ సవరణ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినవి. ఈ బిల్లు 1993 ఏప్రిల్‌ 24న చట్టరూపం దాల్చింది. దాంతో ఏప్రిల్‌ 24ను జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఈ సవరణ బిల్లు అయిదు, ఆరు షెడ్యూళ్లలోని ప్రాంతాలకు మినహాయింపునిచ్చింది. పదకొండో ఆర్థిక సంఘం గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థలు లేనందువల్ల వారు అభివృద్ధి ఫలాలు అందుకోలేక పోతున్నారని గుర్తించడంతో- ప్రభుత్వం వాటి ఏర్పాటుకు తగిన సూచనలు చేసింది. తదనుగుణంగా 1996లో భారత ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ వ్యవస్థను షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనూ విస్తరిస్తూ 'పీసా' చట్టాన్ని తయారుచేసింది.

ఇదీ చదవండి:గాలిలో కలుస్తున్న జీవనహక్కు

మితిమీరిన జోక్యం

గ్రామసభ పంచాయతీలకు హృదయం లాంటిది. 18 సంవత్సరాలు నిండిన గ్రామస్తులందరూ దీనిలో సభ్యులే. భూ హక్కుదారు ఎంపిక, పేదరిక నిర్మూలన లబ్ధిదారుల నిర్ణయం, ప్రణాళికలు, నిధుల వినియోగం.. గ్రామసభల ద్వారానే నిర్ణయించే అధికారాలను ఆయా పంచాయతీలకే ఇచ్చారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న పంచాయతీలు, గ్రామ సభలు- అధికారులు, రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యంతో నిర్వీర్యమవుతున్నాయి. గ్రామీణాభివృద్ధికి కీలకమైన గ్రామసభలకు ప్రజల స్పందన కరవైంది. దళిత, మహిళా సర్పంచులు ఉన్న చోట వారికి ఇతర అగ్ర కులాలనుంచి మద్దతు అంతంత మాత్రమే. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినా- ఒక వర్గం వారికి ఓటు వేయలేదన్న కక్షతో ప్రభుత్వ పథకాల నిలుపుదల, సామాజిక బహిష్కరణ, దాడులు.. పేట్రేగిపోతున్నాయి. ఈ తరుణంలో స్థానిక సంస్థల్లో మితిమీరిన జోక్యాన్ని నియంత్రించాలి. సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ పార్టీలకతీతంగా సంఘటితం కావాలి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు పడేది అప్పుడే!

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

(మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)

ఇవీ చదవండి:ప్రజారోగ్యానికి పెను సవాలు

'అణు'మానాలు ఎన్నిఉన్నా అత్యంత సంయమనం

Last Updated : Apr 24, 2021, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details