తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పోషకాలే మన అభివృద్ధికి సోపానాలు! - deficiency of nutritional

పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. భారత పురోగతిలో పోషకాహార లోపం ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. మరి, ఈ సమస్యను అధిగమించడం ఎలా? జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా... పోషకాలతో సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందాలో తెలుసుకుందాం రండి...

national nutrition week in india
పోషకాలే మన అభివృద్ధికి సోపానాలు!

By

Published : Sep 6, 2020, 7:35 AM IST

దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనదేశ పురోగతిలో ప్రధాన అవరోధంగా నిలుస్తున్న పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు 1982 నుంచి ఏటా సెప్టెంబరు 1-7 మధ్య కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తోంది. పోషకాహార ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పౌష్టికాహార ఉద్యమంలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కరోనా నియంత్రణలో రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

పౌష్టికాహార లోపం- తక్కువ బరువు, ఊబకాయం, బుద్ధిమాంద్యం, రక్తహీనత, గర్భస్రావం, శిశు మరణాలు లాంటి సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రక్తపోటు, మధుమేహం, మూత్రపిండ వ్యాధుల వంటి దీర్ఘకాలిక ముప్పులకూ దారితీస్తుంది. ‘ప్రపంచ ఆహార భద్రత, పోషకాల స్థితి, 2020’ నివేదిక ప్రకారం- మనదేశంలో కోట్లమంది అంతర్జాతీయ పేదరిక సూచీని అధిగమించినా, వారి కొనుగోలు శక్తి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందేస్థాయిలో లేదు.

పెరుగుతున్న సమస్యలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలు ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పోషకాహార లోపాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో సులభ లభ్యత, సమయం ఆదా వంటి కారణాలతో అధిక కేలరీలు, పిండి పదార్థాలు, సంతృప్త కొవ్వులు, చక్కెర, అధిక సోడియం ఉండే ఆహారం వైపు ప్రజల మొగ్గు పెరుగుతోంది. ఇంటి వంటకాలకు బదులు పిండి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటుండటంతో ప్రొటీన్ల కంటే కార్బోహైడ్రేట్ల వినియోగం అధికమవుతోందని, ఫలితంగా పిల్లలు అధిక బరువు, స్థూలకాయం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూక్ష్మపోషకాల పరిమాణం కూడా తగ్గడంతో రోగనిరోధక శక్తి లోపించి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోంది. పర్యావరణ కాలుష్యం, ఆహార పదార్థాల కల్తీ, సమతుల ఆహారంపై అవగాహన లోపం, సరైన పారిశుద్ధ్య వ్యవస్థ కొరవడటం వంటి అంశాలూ పోషకాహార సమస్యకు దారితీస్తున్నాయి.

మనదేశంలో అయిదేళ్లలోపు పిల్లల మరణాల్లో 69 శాతం పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవేనని యూనిసెఫ్‌ ఓ నివేదికలో పేర్కొంది. 2025 నాటికి ప్రపంచ పోషకాహార లక్ష్యాల సాధనలో విఫలమయ్యే 88 దేశాల్లో భారత్‌ కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌-2020 వెల్లడించింది. అయిదేళ్లలోపున్న ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు (20 కోట్లకు పైగా) పోషకాహార లోపం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారనే అంశం పోషకాహార లోపాన్ని నిర్ధారిస్తోంది. దశాబ్దాలుగా మనదేశంలో కొనసాగుతున్న పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు సమీకృత శిశు అభివృద్ధి పథకం, తదుపరి మధ్యాహ్న భోజన పథకం, ఆహార భద్రత చట్టం, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగితా యోజన, జననీ శిశు సురక్షిత వంటి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. పోషణ్‌ అభియాన్‌, రక్తహీనత ముక్త్‌ భారత్‌ వంటివాటికి శ్రీకారం చుట్టినా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో లోపాన్ని నివారించ లేకపోయినట్లు అనేక జాతీయ, అంతర్జాతీయ సర్వేలు పేర్కొన్నాయి. పోషకాహార వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ఇటీవల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ... తరగతి గది పర్యవేక్షకులు ఉన్నట్లుగానే పోషకాహార పర్యవేక్షకులు ఉండాలని, బడిలో ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డు మాదిరిగా న్యూట్రిషన్‌ రిపోర్టు కార్డును నిర్వహించడానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఇది గొప్ప ముందడుగుగా భావించవచ్ఛు పౌష్టికాహార విలువలతో కూడిన పంటల సంపూర్ణ సమాచారాన్ని అందించే భారతీయ ‘వ్యవసాయ కోశాన్ని’ రూపొందించాలని ప్రధాని పేర్కొనడం హర్షణీయం.

అధిగమించాలంటే?

పోషకాహార లోపం అనేది ప్రజారోగ్య సమస్య. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన, చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. సమతుల ఆహారం కోసం క్యాలరీలు, మాంసకృత్తులతోపాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, విటమిన్‌ ఎ, డి, జింకు వంటి అనుబంధ ఆహారాన్నీ అందించాలి. పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంచాలి. సరైన పారిశుద్ధ్య వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఆహారంలో మాంసకృత్తులను పెంచేందుకు సరైన మోతాదుల్లో పాలు, గుడ్లు, మాంసం, చిరుధాన్యాలు తీసుకోవాలి. సమతుల ఆహారంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. జామ, అరటి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, ఆపిల్‌ పండ్లు, కూరగాయలు తీసుకుంటే పోషకాల లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించి, ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలి. ప్రతి వంటిల్లూ పోషకాహారశాలగా రూపుదిద్దుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛ ఆహారమే మూలమని... నేడు కరోనా అనుభవం నేర్పుతున్న నేపథ్యంలో పోషకాలనిచ్చే ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలి.

- సంపతి రమేష్‌ మహారాజ్‌

(సామాజిక విశ్లేషకులు)

ఇదీ చదవండి:ప్రతి రోజూ పళ్లెంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా..

ABOUT THE AUTHOR

...view details