ఎన్నో ఆకాంక్షలు మోసుకొని, భవిష్యత్తు పట్ల గొప్ప ఆశలు రేకెత్తిస్తూ మన ముందుకు వచ్చిన తేజోభరితమైన విధానం ఎన్‌ఈపీ-2020. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన వారిలో కొందరితో నేను గతంలోనే సమావేశమై నా అభిప్రాయాలు పంచుకున్నాను. దాంతో ఎన్‌ఈపీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో నాకు ముందుగానే కొంత అంచనా ఉంది. అందుకే దేశ భావి విద్యాగతిని శాసించే ఆ పత్రం నన్ను ఆశ్చర్యపరచలేదు. అది ఊహించినట్లుగానే ఉందనిపించింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె.కస్తూరి రంగన్, బెంగళూరు ఉన్నత విద్యా విధాన పరిశోధన సంస్థ అధిపతి, వ్యాపార నిర్వహణ నేపథ్యం ఉన్న విద్యావేత్త డాక్టర్ ఎం.కె.శ్రీధర్ మాకమ్ వంటివారితో నేను అభిప్రాయాలు పంచుకున్నాను. కమిటీ సభ్యుల్లో ఒకరైన మంజుల్ భార్గవ్- సృజనాత్మకతకు, వినూత్న ఆలోచనా ధోరణికి ప్రభావశీల ప్రతినిధిగా కనిపించారు. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్న మంజుల్- తన గణిత ప్రతిభకు చాలావరకు భారతీయ నృత్యశాస్త్రమే కారణమని సగర్వంగా ప్రకటించారు.
మూసనుంచి విముక్తి
భారత్‌లాంటి మదపుటేనుగును భవిష్యత్తులోకి నడిపించాలన్న నూతన విద్యా విధాన రూపకర్తల యత్నం నిజంగా ఒక సాహసకృత్యం. దీని విజయం భారీ నిధుల కేటాయింపుపై అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఒక విధానం ఎంత మంచిదో దాని అమలూ అంతే మంచిగా ఉండాలన్నది అక్షరసత్యం. ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్‌ఈపీ 2020లో విశేషమైన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అధ్యయన శాస్త్రాల మూసల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం! ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాలను వేరు చేసి, విద్యార్థులను వాటిలోకి మూస పోసే ప్రక్రియ- మన చదువుల వ్యవస్థలో హైస్కూలు నుంచే ఆరంభమవుతుంది. విద్యానంతర వృత్తి, ఆమాటకొస్తే భావిజీవితం సైతం ఈ మూస ప్రకారం రూపుదిద్దుకొంటాయి... తప్పించుకునే వీల్లేదు. గోధుమ వర్ణ భారతీయులను మాంచి గుమస్తాలుగా తయారు చేయడానికి బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన ఈ విధానం నేటికీ మన నెత్తిన కూర్చుని మన తలరాతలు రాస్తోంది. ఒక వంక మనం ఈ మూసలో బిగుసుకుపోయి ఉండగా, మరోవంక ప్రపంచం మున్ముందుకు సాగింది.
ఆశలు రేకెత్తిస్తోంది
ఎవరైనా ఏ పాఠ్యాంశాలనైనా అభ్యసించవచ్చు(ఇంటర్ డిసిప్లినారిటీ) అనే కీలకాంశంపై దృష్టి సారించిన తాజా విధానపత్రం- భారతీయ ఉన్నత విద్యావ్యవస్థను ఇకమీదట 21వ శతాబ్దపు ఆవిష్కరణాత్మక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెడుతుందన్న ఆశలు రేకెత్తిస్తోంది. బోధనను పరిశోధనను సమైక్యపరచే 'మల్టీడిసిప్లినరీ' విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదన ఈ ఆలోచనల పర్యవసానమే. బోధన శాస్త్రాల వేర్పాటు ఒక్కటే కాదు, బోధనలూ పరిశోధనలు కూడా భిన్న ధ్రువాలుగా ఉండటం అనేది సైతం 19వ శతాబ్దపు వలస పాలకుల మూస విధాన వ్యవస్థాగత వారసత్వమే. పరిశోధనలను కేవలం పరిశోధన సంస్థలకో, ప్రత్యేక శాస్త్రీయ వ్యవస్థలకో పరిమితం చేసి, బోధనను పూర్తిగా కళాశాలలకు విడిచిపెట్టారు. బోధన, పరిశోధనలను ఒకే ప్రాంగణంలోకి తెస్తూ అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ రూపొందించిన జర్మన్ నమూనా 20వ శతాబ్దపు అత్యున్నతాధికార యూఎస్ విశ్వవిద్యాలయాలకు స్ఫూర్తిదాయకమైంది. మన దేశంలో పరిమిత సంఖ్యలోనే విశ్వవిద్యాలయాల్లో మినహాయిస్తే ఈ తరహా ధోరణి కొరవడటం బాధాకరం. ఎన్‌ఈపీ 2020 ఈ అవసరాన్ని గుర్తించింది. మానవీయ శాస్త్రాలనుంచి, సైన్సు, ఇంజినీరింగు, గణిత అంశాల వరకు అన్ని విద్యావిభాగాల్లో పరిశోధన బోధనల ఏకీకరణకు ప్రాధాన్యం ఇచ్చింది.
మస్తిష్కాన్ని పునర్నిర్మించాలి
ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన బోధనలు ఏకీకృతం కావాలన్న ఆలోచనను తలకెక్కించేందుకు, అధ్యాపకీయ మస్తిష్కాన్ని ఆసాంతం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయిలో పరిశోధన వ్యవస్థను ప్రక్షాళించడం ద్వారా దీనికి ప్రయత్నించాలి. అప్పుడే భవిష్యత్ అధ్యాపకులకు ఇది తగు శిక్షణ ఇవ్వగలుగుతుంది. ప్రతిపాదిత జాతీయ పరిశోధన సంస్థ (నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్) అత్యుత్తమంగా పనిచేసినట్లయితే, ఈ కీలక లక్ష్యం నెరవేరుతుంది. ఈ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుంటే, పరిశోధన, అధ్యాపక అభివృద్ధికి గణనీయంగా పెట్టుబడి అవసరమవుతుంది. ఎన్‌ఈపీ ఏ విషయంలోనూ మనల్ని నిరుత్సాహపరచదు. విధాన పత్రంలో ప్రతిదీ చాలా స్పష్టంగా ఉంది.