తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొత్త విద్యా విధానం అమల్లో ఈ సవాళ్లే కీలకం! - Rashtriya Shiksha Aayog

విద్యా వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి ఇటీవలే కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫలితంగా 34 ఏళ్లలో తొలిసారి విద్యా రంగంలో సంస్కరణల దిశగా ముందడుగు పడింది. ఈ విధానంలోని సానుకూలాంశాలు, అమలులో ఉన్న సవాళ్లను విశ్లేషించారు విద్యా రంగ నిపుణుడు కుమార్ సింగ్.

National Education Policy 2020
జాతీయ విద్యా విధానం 2020.. అవకాశాలు-అవరోధాలు

By

Published : Aug 4, 2020, 2:19 PM IST

జాతీయ విద్యా విధానం-2020ను జూలై 29న ఆమెదించింది కేంద్ర ప్రభుత్వం. ఇది దేశంలోని విద్యా వ్యవస్థను సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నంగా మోదీ సర్కార్​ చెప్పుకొచ్చింది. ప్రాథమిక, ఉన్నత విద్య సహా నిర్మాణాత్మక అంశాలు, బోధనా పద్ధతుల్లో మార్పులకు కొత్త విధానంలో పెద్దపీట వేశారు.

జాతీయ విద్యా విధానం 8 విధానపర అంశాలపై ముఖ్యంగా దృష్టిసారించనుంది.

  • ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్య
  • పాఠశాల మౌలిక వసతులు, వనరులు
  • విద్యార్థుల సమగ్ర అభివృద్ధి
  • సమ్మిళితం
  • ప్రగతి/ప్రతిభను అంచనా వేయడం
  • పాఠ్యప్రణాళిక, బోధనా ముసాయిదా
  • ఉపాధ్యాయ నియామకం, బోధనా విద్య
  • ప్రభుత్వ శాఖలు, సంస్థలు, విభాగాల పాత్ర

విద్యకు సంబంధించిన ఈ ప్రధాన రంగాల్లో మార్పులు, విద్యకు గణనీయమైన నిధులు పెంపు వల్ల 2035 నాటికి 50 శాతం 'స్థూల నమోదు నిష్పత్తి' సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. రిపోర్టు కార్డులు మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్థ్యాలను నివేదికగా భావించనున్నారు. తద్వారా విద్యావ్యవస్థలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నూతన విధానం అంతిమ లక్ష్యం "భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్" గా మార్చడం.

బోధనాపరంగానూ ప్రాథమిక, ఉన్నత విద్య పాఠ్యాంశాలలో గణనీయమైన మార్పు తేవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరిగేలా చూడాలని కీలక నిర్ణయం తీసుకుంది.

లిబరల్​ ఆర్ట్స్​ అప్రోచ్​:

లిబరల్ ఆర్ట్స్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటకెళ్లే నాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా మార్పులు చేస్తున్నారు. ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తివిద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తివిద్యలో ప్రవేశం ఉంటుంది.

పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. పదో తరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లస్‌టూకు వెళ్లినవారికి ప్రత్యేక సబ్జెక్ట్‌లు వస్తాయి. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు. 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు ఫౌండేషన్‌ స్టేజీలో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్‌లో, 11-14 ఏళ్ల వారు మిడిల్‌ స్కూల్‌లో, 14-18 ఏళ్లవారు సెకెండరీ స్థాయిలో ఉంటారు.

6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనైనా సబెక్టులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్‌తో పాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు కానీ ఎంచుకోవచ్చు. విద్యాహక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్‌ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.

లిబరల్ ఆర్ట్స్ విధానం, సారూప్య వృత్తి విద్యపై పెట్టిన ప్రత్యేక దృష్టి.. ఉన్నత విద్యలోనూ కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సిబీసీఎస్) ఉంటుంది.

ప్రస్తుతం ఆర్ట్స్, సైన్స్​లో మూడేళ్లు ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమం ఇక నాలుగేళ్లు ఉంటుంది. అయితే విద్యార్థి ఒక సంవత్సరం (సర్టిఫికేట్ ప్రోగ్రామ్), రెండేళ్లు (డిప్లొమా ప్రోగ్రామ్) లేదా మూడు సంవత్సరాల (డిగ్రీ ప్రోగ్రామ్) తర్వాత నిష్క్రమించే అవకాశం ఉంది. పరిశోధనా వృత్తిని కోరుకునే వారు నాల్గవ సంవత్సరాన్ని ఎంచుకోవాలి. విద్యార్థులు తమ క్రెడిట్లను సేవ్ చేసుకొని.. కొంతకాలం తర్వాత తిరిగి కోర్సులో చేరవచ్చు.

ప్రధాని నేతృత్వంలో రాష్ట్రీయ శిక్షా ఆయోగ్​:

హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖకు మార్చడం మొదలు.. ఉన్నత విద్యా సంస్థల సమగ్ర పునర్నిర్మాణాన్ని ఈ విధానం ప్రతిపాదించింది. విద్యా వనరులు, నైపుణ్యాల రూపకల్పనకు సంబంధించిన అన్ని స్థాయిలు, ప్రక్రియలను నిర్ణయించి.. నియంత్రణ, పర్యవేక్షణ చూసుకునే అత్యున్నత సంస్థ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్రీకృత రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ (ఆర్‌ఎస్‌ఏ). ఇందులో కేంద్ర మంత్రులు, సీనియర్ ప్రభుత్వాధికారులు సభ్యులుగా ఉంటారు. ఆర్‌ఎస్‌ఏ.. తన కార్యనిర్వాహక మండలి ద్వారా బడ్జెట్ కేటాయింపులు, ప్రణాళికలను సమీక్షిస్తుంది. విద్యా ప్రమాణాలను నిర్ణయించడం, ఉన్నత విద్యా సంస్థలను (హెచ్‌ఇఐలు) గుర్తించడం, నియంత్రణ సంస్థలపై పర్యవేక్షణనూ ఆర్​ఎస్​ఏ చూస్తుంది.

విశ్వవిద్యాలయాలు:

ప్రైవేట్, ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలపై ఏకరీతి నియంత్రణ ఉండనుంది. అనుబంధ విశ్వవిద్యాలయాలను మూసివేయాలని ఈ విధానం ప్రతిపాదించింది. వాటి స్థానంలో మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్శిటీలు (టైప్ 1), మల్టీడిసిప్లినరీ టీచింగ్ యూనివర్శిటీలు (టైప్ 2), అటానమస్ మల్టీడిసిప్లినరీ కాలేజీలు (టైప్ 3).. ఇలా మూడు రకాల సంస్థల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. అధ్యాపకుల నియామకం, నిలుపుదల కోసం మెరిట్ ఆధారిత ప్రమాణాలు ఉంటాయి.

బొలోగ్నా కన్వెన్షన్​:

ప్రారంభ సమస్యలు లేకుండా సంస్కరణలను అమలు చేయవచ్చని నమ్మడం అమాయకత్వమే అవుతుంది. అందువల్ల ఎన్ఈపీ-2020 నమూనాను అమలు చేసేముందు నూతన విద్యా సంస్కరణల్లో ఇబ్బందులు గుర్తించడం ముఖ్యం.

ఐరోపాలో బొలోగ్నా సదస్సు 1998-1999లో జరిగింది. మూడు అంచెల డిగ్రీ నిర్మాణం (బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టరేట్)లో సంస్కరణలను ఆయా సభ్య దేశాలు అమలు చేయాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. యూరోపియన్ క్రెడిట్స్ ట్రాన్స్​ఫర్​ అండ్ అక్యుములేషన్ సిస్టమ్ (ఈసీటీఎస్), యూరోపియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏరియా (ఈఎస్జీ)లో.. క్వాలిటీ అస్యూరెన్స్ కోసం యూరోపియన్ స్టాండర్డ్స్ అండ్ గైడ్​లైన్స్​నూ ఏర్పాటు చేశారు.

బొలోగ్నా నమూనా:

బొలోగ్నా సదస్సు విద్యా సంస్కరణలు, జాతీయ విద్యా విధానం-2020.. రెండూ చాలా వరకు వాటి లక్ష్యాలు, ప్రమాణాలలో ఒకేలా ఉన్నాయి. ఈ సదస్సు సంస్కరణలను అమలు చేయాలనుకున్నప్పుడు ఐరోపాలో విద్యార్థులతో పాటు జర్మన్ మాట్లాడే దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఐరోపా అంతటా విద్యార్థి సంఘాల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విధానం విషయంలో తీసుకున్న నిర్ణయ ప్రక్రియలో.. తమను నామమాత్రంగానే పరిగణించారని ఐరోపా విద్యార్థి సంఘం(ఈఎస్​యూ) ఆందోళన చేసింది. చాలా దేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలపై సరైన రీతిలో దృష్టి సారించలేదన్నది ఈఎస్​యూ అభిప్రాయం.

జర్మనీ, ఆస్ట్రియా విద్యార్థి ప్రతినిధులు కూడా బోలోగ్నా ప్రక్రియను సూత్రప్రాయంగా తిరస్కరించారు. వారు ముఖ్యంగా ఉపాధి భావనలను వ్యతిరేకించారు. కార్మిక మార్కెట్ డిమాండ్లకు విశ్వవిద్యాలయాలు తలొగ్గుతాయని అందరూ అభిప్రాయపడ్డారు. బొలోగ్నా, పాలనా సంస్కరణలు హంబోల్టియన్ సంప్రదాయాలపై ప్రభావితం చేస్తాయని విమర్శలు వచ్చాయి. జర్మనీ, ఆస్ట్రియాకు చెందిన విద్యావేత్తలు.. బొలోగ్నా గురించి చర్చలో చురుకుగా పాల్గొనేవారు. విద్యార్థుల విమర్శలలో పాలుపంచుకునే వారు. బ్యాచిలర్, మాస్టర్ కోర్సులను మార్చాలనేది విశ్వవిద్యాలయ నిర్వాహకులు, ఉన్నత విద్యాసంస్థలు, విధాన నిర్ణేతల ఆలోచనే. అందుకే ఆయా సంస్కరణలను రూపకల్పన చేసిన వారికి విద్యావేత్తల మధ్య అంతరం ఏర్పడింది.

బొలోగ్నా సంస్కరణ ఫలితాలు దాని అసలు లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయన్నది విమర్శకులు వాదన. విద్యార్థులకు పనిభారాన్ని తగ్గించి మరింత పారదర్శకంగా మార్చడానికి బదులుగా బొలోగ్నా ప్రక్రియ పనిభారాన్ని పెంచుతోందని విమర్శలు వచ్చాయి. విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు బదులుగా కొత్త అధ్యయన నిర్మాణం వల్ల ఆ చైతన్యం తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గ్రాడ్యుయేట్ల ఉపాధిని మెరుగుపరచడం మాని.. బొలోగ్నా కార్మిక మార్కెట్లో అంగీకరించని కొత్త డిగ్రీని సృష్టించిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఎన్ఈపీ ముందున్న సవాళ్లు:

జాతీయ విద్యా విధానం-2020 బోలోగ్నా అవరోధాలను అధిగమించగలదా? అన్నది ప్రశ్న. 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి 50 శాతానికి పెరగాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వాస్తవికతకు అది చాలా పెద్ద సంఖ్య. ఇటువంటి మార్పులు రావాలంటే ప్రాథమిక విద్యలో మౌలిక సదుపాయాలు పెరగడం అవసరం. మరి వాటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? ప్రైవేటు, దాతృత్వ సంస్థల ఆర్థిక సహాయం ఆశించాల్సి వస్తుంది. అయితే గ్రామీణ ప్రాథమిక విద్యలో ఇటువంటి సహకారం చాలా తక్కువగా ఉంది.

విధాన పత్రం ప్రకారం.. ఆన్​లైన్ దూర విద్యా బోధన (ఓడిఎల్), మాసివ్ ఆన్​లైన్​ కోర్సులు (మూక్స్) ద్వారా విద్యా వ్యాప్తి జరగాలి. దీని వల్ల జీఈఆర్ 50 శాతానికి పెరుగుతుందన్నది అంచనా. కానీ లాక్​డౌన్​ అనుభవాలు అందుకు భిన్న ఫలితాలు చూపిస్తున్నాయి. పేద విద్యార్థులకు ఆన్​లైన్​ విద్య చాలా ప్రతికూలాంశం. ఆన్​లైన్ కోర్సుల కోసం వారు ఎలక్ట్రానిక్ పరికరాలు సమకూర్చుకునే పరిస్థితిలో లేరు. ఈ విధానం అంతర్గత ధోరణి చుస్తే.. ప్రస్తుత మార్కెట్ ఆధారిత కోర్సులకు అనుకూలంగా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే బలహీనంగా ఉన్న పరిశోధన, ఉన్నత విద్య అభివృద్ధి సామర్థ్యాలకు ప్రతికూలంగా తయారయ్యే అవకాశముంది.

అధిక భారం మోసేదెవరు..?

నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం వల్ల గతంలో కన్నా ఒక సంవత్సరం అదనపు వ్యయాన్నిభరించాల్సి వస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. ఫలితంగా పరిశోధన, ఉన్నత విద్యా సంబంధిత వృత్తిని ఎన్నుకోవడం తగ్గుతుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేయొచ్చు. ఇంకా చదవాలనుకుంటే ఫీజుల భారాన్ని తట్టుకోడానికి ఎన్ఈపీ విద్యా రుణాల వల్ల కుటుంబాలు మరింత అప్పుల్లో పడొచ్చు.

పరిశ్రమ, వాణిజ్య వ్యాపారాల ఆర్ అండ్ డీ అవసరాలకు అనుగుణంగా.. ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధన సామర్థ్యాన్ని సమన్వయం చేయాలని ఈ విధానం సూచిస్తోంది. అయితే దీని వల్ల సైన్స్, సాంఘిక శాస్త్రాల్లో అధునాతన పరిశోధనలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చే ముందు ఈ అంశాలన్నిటినీ సమూలంగా చర్చిస్తే అందరికీ శ్రేయస్కరం.

(కుమార్ సింగ్- దిల్లీ విశ్వవిద్యాలయం, స్వామి శ్రద్ధానంద కళాశాలలో ప్రొఫెసర్​)

ABOUT THE AUTHOR

...view details