తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సర్కారీ సేవలకు జవసత్వాలు- ప్రజల నమ్మకమే పరమావధి - నైపుణ్యాల ఆధారంగా ప్రభుత్వ సిబ్బందికి పోస్టింగులు

ప్రభుత్వ సిబ్బంది నైపుణ్యాలను ఆధునికీకరించాలని కేంద్రసర్కారు తీర్మానించడం బాగానే ఉంది. కానీ ఆదాయపన్ను శాఖలో అనుభవం గడించిన వారిని విద్యాశాఖకు, అటవీ శాఖాధికారులను ఆరోగ్య శాఖకు బదిలీ చేయడం లాంటివి ఈ మధ్య బాగా పెరిగాయి. పదవీ విరమణ చేసిన ప్రభుత్వాధికారులను సలహాదారులుగా నియమించే సంస్కృతి రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రబలింది. వీటిని రాజకీయ నియామకాలుగా పరిగణిస్తారు.

NARENDRA-MODI-GOVTS-LATEST-STEP-TO-REFORM-BUREAUCRACY-MISSION-KARMAYOGI
సర్కారీ సేవలకు జవసత్వాలు...ప్రజల నమ్మకమే పరమావధి

By

Published : Sep 19, 2020, 7:56 AM IST

ప్రభుత్వ సిబ్బంది నైపుణ్యాలను ఆధునికీకరించాలనికేంద్రసర్కారు తీర్మానించడం బాగానే ఉంది కానీ, దీర్ఘకాలం ఒక రంగంలో పనిచేసి నైపుణ్యం గడించినవారిని, ఉన్నట్లుండి బొత్తిగా అపరిచిత రంగంలోకి బదలీచేసే ధోరణి ఈమధ్య బాగా పెరిగింది. ఆదాయపన్ను శాఖలో అనుభవం గడించినవారిని విద్యాశాఖకు, అటవీ శాఖాధికారులను ఆరోగ్య శాఖకు బదిలీ చేయడంలాంటివి దీనికి ఉదాహరణలు. మంత్రుల ఇష్టాయిష్టాల మేరకు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. పదవీ విరమణ చేసిన ప్రభుత్వాధికారులను సలహాదారులుగా నియమించే సంస్కృతి రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రబలింది. వీటిని రాజకీయ నియామకాలుగా పరిగణిస్తారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వాధికారులకు వర్తించే క్రమశిక్షణ నిబంధనలు ఈ సలహాదారులకు వర్తించవు. ఈ సలహాదారులు ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి ఆదేశాలూ జారీచేయకూడదు. ప్రభుత్వ దస్త్రాలను పరిశీలించే అధికారమూ వారికి లేదు. అయినా, అనధికారికంగా వారు తమకు కావలసిన ప్రభుత్వ ఫైళ్లన్నింటినీ చూస్తూనే ఉంటారు. బయటివారికి ప్రభుత్వ సమాచారాన్ని అందించగలరు కూడా. చాలా సందర్భాల్లో ప్రభుత్వ కార్యదర్శికి, సలహాదారుడికి మధ్య అప్రకటిత యుద్ధం నడుస్తూ ఉంటుంది. సలహాదారులు బాధ్యతలేని అధికారం చలాయిస్తుంటారు. ఇకనైనా సాధ్యమైనంత తక్కువగా సలహాదారుల నియామకాలను జరపడం మంచిది.

దుస్సంప్రదాయంతో చేటు

భారతీయ సివిల్‌ సర్వీసు అధికారులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుల కోవకు చెందినవారే అయినా, రెండు కారణాలవల్ల ప్రభుత్వ విధానాల అమలులో వెనకబడి ఉంటున్నారు. మొదటి కారణం- సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే, క్షేత్రస్థాయి ఉద్యోగుల అధికార హోదా తక్కువ కావడం. కార్యదర్శి పని విధాన రూపకల్పన అయితే, దాన్ని అమలు చేసేది శాఖాధిపతి మాత్రమే. కానీ, ప్రభుత్వ కార్యదర్శులకు నేరుగా మంత్రులతో సంబంధాలు ఉండటం వల్ల శాఖాధిపతికన్నా పైచేయిగా నిలవగలుగుతున్నారు. శాఖాధిపతి మనస్ఫూర్తిగా విధానాలను అమలుచేయాలంటే, ఈ దుస్సంప్రదాయాన్ని తక్షణం మార్చాలి. రెండో కారణం- విధానాల అమలుకు నిజంగా బాధ్యులను చేయాల్సినవాళ్లను కాకుండా వేరేవాళ్లను బాధ్యులుగా చేయడం. మంత్రివర్గ సభ్యులు కేంద్ర, రాష్ట్ర సచివాలయాల నుంచి పనిచేస్తారు. కానీ, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు రాష్ట్రాలు, జిల్లాల స్థాయుల్లో జరుగుతుంది. ఉదాహరణకు కేంద్రం నిజామాబాద్‌కు విమానాశ్రయాన్ని మంజూరు చేసిందనుకుందాం. దాని ఏర్పాటుకు కావలసిన భూమి, నీరు, విద్యుత్‌ వగైరాలను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంతో పనిచేస్తే కానీ, విమానాశ్రయ నిర్మాణం పూర్తికాదు.

రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయం, నీటిపారుదల, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యాలపై కేంద్రం ఎన్ని పథకాలు, ప్రాజెక్టులను ప్రకటించినా వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. వాటిలో అవకతవకలు జరిగితే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులను నిందించడం సమంజసం కాదు. దీనికిబదులు సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులను ప్రాజెక్టుల జాప్యానికి సంయుక్తంగా బాధ్యులను చేయాలి. ఉదాహరణకు ఏదైనా రాష్ట్రంలో కేంద్ర నిధులతో కడుతున్న నీటిపారుదల ప్రాజెక్టు ఉందనుకోండి. దాని నిర్మాణం సక్రమంగా జరుగుతోందా లేదా అన్నది పర్యవేక్షించడానికి ఒక బృందాన్ని నియమించాలి. అందులో కేంద్ర రాష్ట్రాల నీటిపారుదల శాఖల కార్యదర్శులు, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరును సభ్యులుగా చేయాలి. ముఖ్యమంత్రులకూ తగు పాత్ర కల్పించాలి. ప్రాజెక్టు పర్యవేక్షక బృంద పనితీరును మూల్యాంకనం చేయడం, అధికారులకు తగు శిక్షణ ఏర్పాటు వంటి విషయాల్లో ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. మిషన్‌ కర్మయోగి ప్రతిపాదించే సలహాదారుల బోర్డులో ముఖ్యమంత్రులూ సభ్యులుగా ఉంటారని గమనించాలి. మిషన్‌ కర్మయోగి కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ శిక్షణ ఇస్తారో లేదో స్పష్టం కాలేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో దాదాపు 12 శాతం గ్రూపు ఏ, బీ అధికారులే. ప్రభుత్వోద్యోగుల్లో అత్యధికులు అవినీతిపరులు, గర్విష్ఠులని, తమను వేధిస్తారని జనం భావిస్తారు. మిషన్‌ కర్మయోగి ప్రభుత్వోద్యోగుల స్వభావాన్ని మార్చడానికి ప్రాధాన్యమివ్వాలి.

శిక్షణ లోటుపాట్లు

ప్రస్తుతం రంగంలో ఉన్న శిక్షణ సంస్థల గురించి పరిశీలించడం ఇక్కడ సముచితంగా ఉంటుంది. అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులకు సువిశాల ప్రాంగణాల్లో సొంత శిక్షణ సంస్థలు ఉన్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలానే పాలనా శిక్షణ సంస్థలను ఏర్పాటుచేసుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్‌, బీమా సంస్థలకూ సొంత శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఇది కాకుండా సీనియర్‌ ప్రభుత్వాధికారులకు స్వదేశంలోని ఐఐఎంలలో, విదేశాల్లోని బిజినెస్‌ స్కూళ్లలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. కొన్ని బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు అందించే శిక్షణ నాసిరకంగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి కారణం శిక్షకులు, శిక్షితులలో శ్రద్ధ, సావధానత లోపించడమే. రకరకాల కారణాల వల్ల పదోన్నతులు పొందలేక, నిస్పృహలో కూరుకుపోయిన అధికారులను ఈ శిక్షణ సంస్థల సారథులుగా నియమిస్తుంటారు. వారి నిరాశా దృక్పథాన్ని శిక్షణార్థులకూ అంటిస్తారు. ఒక ప్రత్యేక కోర్సులో శిక్షణ పొందిన అధికారిని, ఆ నైపుణ్యం అవసరమైన పదవుల్లో నియమించడం లేదు. మిషన్‌ కర్మయోగి కింద ఏర్పాటుచేయదలచిన బృహత్తర శిక్షణ సంస్థకైనా సమర్థులు, అర్హులను అధిపతులుగా నియమించాలి.

మొదటి భాగం కోసం ఇక్కడ చూడండిసర్కారీ సేవల జవసత్వాలను మార్చనున్న 'మిషన్‌ కర్మయోగి'!

ABOUT THE AUTHOR

...view details