ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సమర్థంగా నిర్వహించడం కోసం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని ప్రకటించింది. 21వ శతాబ్దిలో సాంకేతికం, సంక్లిష్టం అవుతున్న పరిపాలనా విధుల నిర్వహణలో ప్రభుత్వ సిబ్బందికి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వడానికి ఐగాట్ (ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్) అనే డిజిటల్ వేదికను ఏర్పరుస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ శిక్షణ సంస్థల అనుభవాన్ని రంగరించి కోర్సులను రూపొందిస్తారు. ఈ కోర్సులలో సంతరించుకున్న నైపుణ్యాల ఆధారంగా ప్రభుత్వ సిబ్బందికి పోస్టింగులు ఇస్తారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడం కూడా మిషన్ కర్మయోగిలో ముఖ్యభాగం. సివిల్ సర్వీసుల సిబ్బంది పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి జాతీయ స్థాయి సంస్థ- ఎన్‌పీసీఎస్‌సీబీని లాభాపేక్ష లేకుండా పని చేసే ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ కార్యకలాపాలకు ప్రధానమంత్రి ఛత్రం కింద పనిచేసే పబ్లిక్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్ దిగ్దర్శకత్వం వహిస్తుంది. ఈ మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సభ్యులుగా ఉంటారు. మిషన్ కర్మయోగి కింద 46 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శిక్షణ లభిస్తుందని కొన్ని వార్తా కథనాలు వెలువడితే- కేంద్ర, రాష్ట్రాల్లోని మొత్తం రెండు కోట్ల ఉద్యోగులకు శిక్షణ ఇస్తారని ఇతర కథనాలు చెబుతున్నాయి. 2020-2025 మధ్య కాలంలో మిషన్ కర్మయోగిపై రూ.511 కోట్లు వెచ్చిస్తారు. అందులో 60 శాతాన్ని ఐక్యరాజ్యసమితి సంస్థలు అందిస్తాయి.
గతంలోనూ సంస్కరణలు
పూర్వ ప్రభుత్వాల హయాములలోనూ మూడు పాలనా సంస్కరణల సంఘాలు ఏర్పాటై, పుంఖానుపుంఖంగా నివేదికలు సమర్పించాయి. వాటి లక్ష్యం కూడా ప్రభుత్వోద్యోగుల పని సామర్థ్యాన్ని మెరుగుపరచడమే. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరవాత ఇదే లక్ష్య సాధనకు మూడు ముఖ్యమైన చర్యలు తీసుకుంది. కానీ, అవి విమర్శలకు గురయ్యాయి. వీటిలో మొదటి చర్య లేదా సంస్కరణను 2016 ఏప్రిల్ లో చేపట్టారు. దీని కింద సంయుక్త కార్యదర్శులకన్నా పైస్థాయి అధికారుల పనితీరును క్షుణ్నంగా పరిశీలించాకనే పదోన్నతులు ఇవ్వాలి. దీనికి ముందు సంబంధిత మంత్రితో పాటు మూడు స్థాయుల ఉన్నతాధికారులు చేసే వార్షిక మూల్యాంకనం, సిబ్బంది పదోన్నతులకు ప్రాతిపదికగా ఉండేది. సంబంధిత అధికారి తన పనితీరుపై స్వీయ సమీక్షనూ సమర్పించాల్సి ఉండేది. కొత్త 360 డిగ్రీల సమీక్ష కింద ఒక అధికారి పదోన్నతికి నిజంగా అర్హుడేనా అన్నదీ పరిశీలించాలి. ఈ పని నిపుణుల సంఘానికి అప్పగించాలి. సాటి ఉద్యోగులు, జూనియర్లు, సీనియర్లు, బయటివారు, పదవిలో ఉన్న కార్యదర్శులు సంబంధిత అధికారి పదోన్నతిపై వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిని గోప్యంగా ఉంచుతారు. రెండో సంస్కరణ- ప్రభుత్వేతర రంగాలకు చెందిన నిపుణులు, అనుభవజ్ఞులను ఉన్నత పదవుల్లోకి తీసుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ప్రకటించిన సంస్కరణ ప్రకారం ఇటువంటి నిపుణులను సంయుక్త కార్యదర్శి హోదాలోకి తీసుకుంటారు.
ఇది కూడా బొత్తిగా కొత్త విషయమేమీ కాదు. 1980లలోనూ వెలుపలి నుంచి అనుభవజ్ఞులను ప్రభుత్వం లోకి తీసుకునేవారు. నూతక్కి భాను ప్రసాద్, డీవీ కపూర్ తదితరులు అలా వచ్చినవారే. అయితే, ఎన్డీయే ప్రభుత్వం ఇటువంటి నిపుణులను చాలా పెద్ద సంఖ్యలో తీసుకోవాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. వీరిని ఎంపిక చేసే బాధ్యతను క్యాబినెట్ కార్యదర్శికి అప్పగించారు. తరవాత 2019లో తొమ్మిదిమంది బయటి నిపుణులను సంయుక్త కార్యదర్శి హోదాలో తీసుకునే ప్రక్రియను యూపీఎస్‌సీకి అప్పగించాక వివాదం సద్దుమణిగింది. ఇలా బయటి నుంచి వచ్చినవారి పనితీరుపై ఇంకా మూల్యాంకనం జరగకపోయినా, కేంద్రం మరో 40 మందిని వెలుపలి నుంచి తీసుకోవడానికి సిద్ధమైంది. కేంద్రంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులు కేంద్రానికి డిప్యుటేషన్ మీద వెళ్లడానికి ఇష్టపడటం లేదు. సివిల్ సర్వీసులకూ పాలనా సంస్కరణల్లో భాగస్వామ్యం కల్పించి, ఈ సాధకబాధకాలను పరిష్కరించాలి.
అసమర్థులను సాగనంపాల్సిందే