Nagaland Army killings: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో పది రోజుల క్రితం ఆరుగురు బొగ్గుగని కార్మికులను భారత సైన్యం కాల్చిచంపింది. వారి వాహనాన్ని ఆపమన్నా ఆపకుండా ముందుకు ఉరికించడం వల్లే సైనికులు కాల్పులు జరిపినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. ఆ రోజు బతికి బట్టకట్టిన ఇద్దరిలో ఒకరు ఆ వాదనలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. హత్యాకాండపై ఎగసిన ఆందోళనలను అదుపు చేయలేక సైనికులు మళ్ళీ తుపాకులను పనిచెప్పారు. మరో ఏడుగురిని పొట్టనపెట్టుకున్నారు. బాధితులను తీవ్రవాదులుగా పొరపడటం వల్లే మొదటి ఘటన జరిగిందంటున్న సైన్యం ప్రకటనను విశ్వసించినా- రెండో విడత హత్యలను ఎలా సమర్థించుకోగలరు? అత్యవసర పరిస్థితుల్లో తుపాకులను ఎక్కుపెట్టాల్సి వచ్చినా, ప్రాణాలను తోడేసేలా శరీరంలోని సున్నిత భాగాలపై కాల్పులు ఎలా జరపగలరు? ఆ తరవాత విధ్వంసంలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోగా, భద్రతా దళాల్లో ఒకరు మరణించారు. మొత్తమ్మీద 14 మంది పౌరులు అన్యాయంగా బలయ్యారు. నాగా తిరుగుబాటుదారులతో 24 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని సైన్యం ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి సంభవించింది.
విస్మయకర ధోరణి
CDS Helicopter Crash:డిసెంబర్ ఎనిమిదిన తమిళనాడులో హెలికాప్టర్ కూలిపోవడంతో త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు మరో 12 మంది సైన్య సిబ్బంది అసువులు బాశారు. ఆ దుర్ఘటన యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ విషాదం మూలంగా నాగాలాండ్ పరిణామాలు జాతి స్మృతిపథం నుంచి చెరిగిపోయాయి. విధినిర్వహణలో సైన్యం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే మోన్ మారణకాండ చోటుచేసుకునేది కాదు. మరోవైపు భారతీయ సమాజమూ దానిపై స్పందించాల్సినంతగా స్పందించలేదు. అమరులైన సైన్యాధికారులకు శోకతప్త హృదయాలతో నివాళులు తెలుపుతున్న ప్రజలు- నాగా బాధితుల పట్ల ఆ స్థాయిలో సహానుభూతిని చూపడం లేదు. జనాభాలో అత్యధికుల వ్యవహార సరళిని గమనిస్తే- అసలు ఆ ఘటనే జరగలేదేమో అన్నంత మామూలుగా ఉంటున్నారు. దేశీయంగా వేళ్లుదిగిన వర్గ దృక్పథానికి ఇది అద్దంపడుతోంది. ప్రజాస్వామ్యంలో పౌరులందరూ సమానులు. సైనికుల ప్రాణాలు ఎంత విలువైనవో బొగ్గుగని కార్మికుల ప్రాణాలూ అంతే. మృతిచెందిన సైనిక సిబ్బంది కుటుంబాలు ఎలా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయో- మోన్ మారణకాండ మృతుల పరివారాలూ అంతగా తల్లడిల్లుతున్నాయి. బాధితుల్లో ఒకరి భార్య తొమ్మిది నెలల పసిగుడ్డుకు తల్లి! ఆమె ఎంతగా క్షోభిస్తోందో ఎవరు అర్థం చేసుకోగలరు?
కానీ, భారతీయ భూస్వామ్య సమాజంలో పాతుకుపోయిన వర్గం, ప్రాంతం, కులం, లింగ అసమానతలతో పాటు బాధితుల సామాజిక, రాజకీయ స్థితిగతుల ఆధారంగానే పౌర సమాజం ఈనాటికీ స్పందిస్తుంటుంది. దశాబ్దాలుగా దుర్విచక్షణకు గురవుతున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల వెతలను గమనంలోకి తీసుకుంటే- నాగా బాధిత కుటుంబాలు మరింత సానుభూతికి అర్హమైనవే. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్సా) అమలులో ఉండటంతో ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మానవ హక్కులు తరచూ ఉల్లంఘనలకు గురవుతున్నాయి. 2004లో చోటుచేసుకున్న మనోరమా హత్యాచారం తరవాత మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ముందు ఒక మహిళా బృందం నగ్నంగా ఉద్విగ్నభరిత నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని ఇరోమ్ షర్మిల పదహారేళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అయినా ఫలితం లేకపోయింది. నాగాలాండ్‌లో శాంతిస్థాపనకు పాతికేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలూ ఒక కొలిక్కి రావడం లేదు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఇసాక్ ముయివా) నేతలతో దాదాపు ఆరుగురు ప్రధానులు చర్చలు జరిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఒక కార్యాచరణ ఒప్పందాన్ని ఆమోదించారు. కానీ, దాని అమలు అంశానికి వచ్చేసరికి, నాగాల డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించడం లేదు. తత్ఫలితంగా అవతలి పక్షంలో అసంతృప్తి నెలకొంది.