ప్రపంచవ్యాప్తంగా 20లక్షలమంది మరణానికి కారణమైన కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టిందనే దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు. చైనాలో గబ్బిలాల నుంచి వైరస్ మానవులకు పాకిందని, అదెలా జరిగిందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి నివారించగలుగుతామని డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 15మంది శాస్త్రజ్ఞులను అక్కడికి పంపాలని నిశ్చయించినా చైనా ప్రభుత్వం సకాలంలో అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేసింది. దీనిపై తీవ్ర నిరుత్సాహం చెందుతున్నామని డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ అధొనోమ్ వ్యాఖ్యానించిన దరిమిలా, జనవరి 14వ తేదీ నుంచి శాస్త్ర బృంద పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇంతలో డబ్ల్యూహెచ్‌ఓ బృందంలో ఇద్దరు శాస్త్రజ్ఞులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు సింగపూర్‌లోనే ఆగిపోయారు. మిగిలిన బృంద సభ్యులు వుహాన్‌కు చేరుకున్నా, వారు అక్కడ 14 రోజుల క్వారంటైన్‌లో ఉండి పరిశోధనలు సాగించాల్సి ఉంటుందని చైనా అధికారులు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రజ్ఞుల పరిశోధనను చైనా శాస్త్రవేత్తలు పర్యవేక్షించడానికి అంగీకరించాలని బీజింగ్ డిమాండ్ చేస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి ఎలాంటి సమాచారం అందించాలో తామే నిర్ణయిస్తానంటోంది.
వుహాన్ విజయోత్సవం... వ్యూహాత్మకం!
కొవిడ్‌కి కారణమైన కరోనా వైరస్ వుహాన్ మాంసం మార్కెట్లో పుట్టిందనే అభిప్రాయాన్ని మార్చడానికి చైనా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని శాస్త్రీయ దృష్టితో చూడాల్సింది పోయి, రాజకీయం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తికి చైనాయే కారణమని మిగతా ప్రపంచం ఆగ్రహిస్తున్నందువల్ల- దెబ్బతిన్న తమ దేశ ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రజ్ఞుల పర్యటనను బీజింగ్ నాయకత్వం ఉపయోగించుకొంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వుహాన్ నగరంలో నిరుడు 76రోజుల లాక్‌డౌన్ విధించి కరోనా వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేశామంటూ స్థానిక అధికారులు విజయోత్సవం జరుపుతున్నారు. వుహాన్‌లో లాక్‌డౌన్ విధించి ఈ జనవరి 23వ తేదీకల్లా ఏడాది పూర్తి కానుండటంతో నగరంలోని ఒక పురావస్తుశాలలో ఆర్భాటంగా ప్రదర్శన జరుగుతోంది. కొవిడ్‌ను అరికట్టే కృషిలో నిమగ్నమైన వైద్య సిబ్బంది హాలోగ్రామ్‌ను, సామూహిక క్వారంటైన్ ఆస్పత్రి నమూనాను, కమ్యూనిస్టు పతాకాలను సగర్వంగా ప్రదర్శిస్తున్నారు. కానీ, చైనాలో కరోనా వైరస్ గురించి మొట్టమొదట హెచ్చరించిన వైద్యుడు ఐ ఫెన్ ఫొటోలు కానీ, వైరస్ జినోమ్‌ను ప్రపంచానికి వెల్లడించిన మరో వైద్యుడు జాంగ్ యాంగ్ జెన్ ఊసు కానీ ప్రదర్శనలో ఎక్కడా కనిపించలేదు. వుహాన్ నేత్ర వైద్యుడు లీ వెన్లియాంగ్ ఫొటోను అమర వీరుల కుడ్యం మీద అతికించి సందర్శకులు చేమంతి పూలు సమర్పించడానికి అనుమతిస్తున్న అధికారులు- లీ తన సహచరులకు వైరస్ గురించి తెలిపినందుకు ప్రభుత్వ అభిశంసనకు గురయ్యారని, తరవాత వైరస్ సోకి మరణించారనే వాస్తవాలను వెల్లడించలేదు. దీనికి బదులు వైరస్‌ను జయించి వుహాన్ ఆర్థికంగా పునరుత్థానం చెందిందంటూ ప్రశంసాత్మక వ్యాసాలను ప్రచురింపజేస్తున్నారు. ప్రపంచంలోని అనేకానేక ప్రజాస్వామ్య దేశాలు కొవిడ్‌ను సమర్థంగా నియంత్రించలేక సతమతమవుతుంటే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వైరస్‌పై ఘన విజయం సాధించిందని చాటుకుంటోంది. వుహాన్‌లో జరుగుతున్న ప్రదర్శనలో కమ్యూనిస్టు అధినేత షీ జిన్ పింగ్ చిత్రాలను అట్టహాసంగా అలంకరించారు. వైరస్ గురించి ఆదిలోనే హెచ్చరించిన వైద్యులను పట్టించుకోనందువల్లే చైనానుంచి కొవిడ్ ప్రపంచమంతటా వ్యాపించిందనే వాస్తవాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం కప్పిపెడుతూనే ఉంది. సర్కారు నిర్లక్ష్యంపై ఉద్యమించినవారిని ఇప్పటికీ నిర్బంధంలోనే ఉంచారు. లాక్‌డౌన్‌లో వుహాన్ ప్రజల కడగండ్ల గురించి రాసిన జాంగ్ జాన్ అనే 37ఏళ్ల పౌర పాత్రికేయురాలికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.