Myanmar teak export: అమెరికాకు చెందిన కొన్ని వ్యాపార సంస్థలు మయన్మార్ నుంచి అక్రమంగా టేకును దిగుమతి చేసుకోవడం ద్వారా అక్కడి జుంటాను (సైనిక ప్రభుత్వాన్ని) పరోక్షంగా పెంచి పోషిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మయన్మార్‌లో పెరిగే టేకుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఆ కలపతో అమెరికాలో సంపన్నులకోసం విలాసవంతమైన చిన్న ఓడలను తయారు చేస్తున్నారు. టేకు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంతో బలపడుతున్న జుంటా ప్రజలపై దాష్టీకాలకు తెగబడుతోందని మయన్మార్ ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కృషిచేసే 'జస్టిస్ ఫర్ మయన్మార్' గ్రూపు పేర్కొంటోంది.
Burma teak export:
గతేడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో పదేళ్ల ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ టాట్మడవ్ (మయన్మార్ సైన్యం) అధిపతి జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్ సైనిక తిరుగుబాటుతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కలప ఎగుమతుల ద్వారా జుంటాకు నిధులు అందే అవకాశం ఉందని గ్రహించిన అమెరికా, గత ఫిబ్రవరి నుంచే మయన్మార్ టింబర్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంటీఈ)పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంస్థ అయిన ఎంటీఈ ఒక్కటే వేలంపాట ద్వారా ప్రైవేటు కంపెనీలకు కలపను విక్రయిస్తుంటుంది. ఆంక్షలు ఉన్నప్పటికీ, అగ్రరాజ్యంలో మయన్మార్ కలపకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని అక్కడి సంస్థలు అడ్డదారిలో కలపను తరలిస్తున్నాయని జస్టిస్ ఫర్ మయన్మార్ గ్రూపు పేర్కొంటోంది. కలప విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అధికంగా జుంటాయే తీసుకొంటోందని, అలా బలం పుంజుకొంటున్న సైన్యం- ప్రజలపై మారణకాండకు తెగబడుతోందని ఆరోపిస్తోంది. చిన్నపిల్లలపైనా హత్యాకాండ సాగిస్తోందని వాపోతోంది.
Burma teak Myanmar military
గతేడాది ఫిబ్రవరి నుంచి మయన్మార్‌లో జుంటా రాక్షస క్రీడలో దాదాపు 1,400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదివేల మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు. స్థానికంగా కొన్ని సాయుధ సంస్థలు జుంటా పాలనపై తిరుగుబాటు ప్రకటించడంతో ప్రస్తుతం అక్కడ అంతర్యుద్ధ ఛాయలు నెలకొన్నాయి. గతేడాది జనవరి-నవంబరు మధ్యలో అమెరికా సంస్థలు మయన్మార్ నుంచి దాదాపు 1,600 టన్నుల టేకును తరలించుకుపోయినట్లు జస్టిస్ ఫర్ మయన్మార్ గ్రూపు చెబుతోంది. జుంటాకు నిధులు దక్కకుండా మయన్మార్ నుంచి అన్నిరకాల కలప దిగుమతులను అగ్రరాజ్యం నిషేధించాలని డిమాండు చేస్తోంది.