పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దర్శకత్వంలో ముకుల్ రాయ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన తాజా రాజకీయ చిత్ర విశేషాలివి! తొండాటల్లో తలపండిపోయిన నాయకరత్నాలే దిమ్మెరపోయేంత అపూర్వ కథాకథనాలతో దీన్ని దీదీ రక్తికట్టించిన విధంబెట్టిదనగా... శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) అధ్యక్ష పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కట్టబెట్టడం ఆనవాయితీ. దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ పశ్చిమ్ బంగలో ముకుల్‌రాయ్‌కు ఆ అధ్యక్ష కిరీటం తొడిగేశారు! ఆయన భాజపాకు జెల్లకొట్టేసి తృణమూల్ గూట్లోకి చేరిపోయారు కదా... అలా ఎలా చేస్తారనుకుంటున్నారా? అదే మరి రంజైన బెంగాలీ రసగుల్లా రాజకీయమంటే!
కండువా మార్చినంత వేగంగా కుర్చీ దిగాలంటే కుదురుతుందా ఏమిటి? విలువల కోసం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే తేలేదెవరో మునిగేదెవరో ఎవరికి తెలుసు? కోట్లు గుమ్మరించినా ఓట్లు పడకపోతే అసలుకే మోసం కదా! అందుకే ముకుల్‌కు 'కమలం' కాకరకాయ అయ్యింది కానీ... ఆ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పోస్టు చేదు కాలేదు. బయట మమతమ్మ స్కంధావార సభ్యుడైతేనేమి... సభా దస్త్రాల ప్రకారం ఆయన 'భాజపా సభ్యుడు' కాబట్టి అదే అర్హతగా భేషుగ్గా పీఏసీ అధ్యక్షుడై కూర్చున్నారు. ఇది అన్యాయం... అక్రమం అని ప్రతిపక్షనేత సువేందు అధికారి గొంతు చించుకుంటుంటే- 'అధికారికం'గా ముకుల్ మీ మనిషే కదయ్యా అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు తృణమూల్ పెద్దలు! కుర్చీ కోసం గోడలు దూకే జంగురు పిల్లులు ఎంతమందిని చూడటం లేదు కానీ, కొత్త పార్టీలో చేరినా పాత పార్టీ పేరిటే పదవి దఖలు పడటమన్నది... అఖిల భారత దుర్రాజకీయ చరిత్రలోనే న భూతో న భవిష్యతి!
ముకుల్ రాయ్‌ను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న మమతమ్మే మొన్నామధ్య 'ఆయన బీజేపీ సభ్యుడు' అని నిండు పేరోలగంలో మొహమాటం లేకుండా ప్రకటించారు. ప్రతిపక్షంలోని ఆ కీలకనేతకు కచ్చితంగా పీఏసీ పదవి ఇచ్చి తీరతామని అప్పుడే మనసులో మాట వెల్లడించారు. చెప్పాల్సిందంతా చెప్పాక 'అయినా నాదేముంది లెండి- అంతా స్పీకర్ నిర్ణయమైతేనూ' అని తేల్చేశారు. ధర్మరాజు అంతటి వాడే 'అశ్వత్థామ హతః కుంజరః' అనగా లేనిది రాజకీయాల్లో కాకలుతీరిన నాయకురాలు నాగమ్మ వంటి దీదీ అంటే తప్పొచ్చిందా? మమత ముందుజాగ్రత్త మాటల మర్మాన్ని అప్పుడే అర్థం చేసుకోకుండా... జరుగుతున్నదంతా అర్ధనిమీలిత నేత్రాలతో పరికించిన కమల దళాధిపతులు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం ఏమి లాభం?