తెలంగాణ

telangana

ETV Bharat / opinion

డీలాపడ్డ ఎంఎస్​ఎంఈలకు నిధులిస్తేనే జవసత్వాలు! - కరోనా వైరస్​

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం కరోనా ధాటికి కుదేలైంది. ఎంఎస్‌ఎంఈల సమస్యలకు, వీటిలో నెలకొన్న నిరుద్యోగితకు నిధుల కటకటే మూల కారణం. కొవిడ్‌ సంక్షోభ సమయంలో కార్మికులకు వేతనాలు చెల్లించడం, సరకుల సరఫరాదారులకు బకాయిలు కట్టడం అంతకంతకూ కష్టంగా మారుతోంది. నైపుణ్య కార్మికులకు సంబంధించి తీవ్రమైన కొరత ఉత్పన్నం కావడం మరో పెద్ద సమస్యగా మారింది. అనేక ఎంఎస్‌ఎంఈలు ఈ సమస్యతో సక్రమంగా నడవడం లేదు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వ బకాయిల చెల్లింపు త్వరితగతిన జరిగేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖలో జవాబుదారీ వ్యవస్థ సామర్థ్యం పెంచాలి.

MSME's facing hardship due to corona virus pandemic
డీలాపడ్డ ఎంఎస్​ఎంఈలకు నిధులిస్తేనే జవసత్వాలు!

By

Published : Aug 26, 2020, 6:01 AM IST

కొవిడ్‌ మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ఒకటి. ఎంఎస్‌ఎంఈగా వ్యవహరించే ఈ రంగంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఎన్నో వ్యాపారాలు మూతపడ్డాయి. సగానికి సగం సంస్థలు 50 శాతం వరకు ఆదాయ నష్టానికి గురయ్యాయి. 'భవన్స్‌ బిజినెస్‌ స్కూల్‌', 'మాగ్మా ఫిన్‌కార్ప్‌' కలిసి చేపట్టిన ఓ సర్వే ఈ రంగం స్థితిగతులను వివరించింది. గత మే నెలలో జరిపిన ఈ సర్వేలో 14,444 సంస్థలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 6.34 కోట్ల ఎంఎస్‌ఎంఈలలో సగానికి పైగా గ్రామీణ భారత్‌లోనే నెలకొని ఉన్నాయి. ఇవన్నీ కలిసి 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీరిలో 55 శాతం పట్టణ ప్రాంత ఎంఎస్‌ఎంఈ రంగంలో పని చేస్తున్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే, విడివిడిగా వీటి స్థాయి ఎంతో చిన్నది. సగటున ఒక్కో సంస్థలో ఇద్దరు కూడా ఉద్యోగులు లేరు. వీటిలో 99.5 శాతం వరకు సూక్ష్మ తరగతి సంస్థలు కావడమే ఇందుకు కారణం. దాదాపు మూడింట రెండొంతుల సంస్థలకు షెడ్యూలు కులాలు (12.5 శాతం), షెడ్యూలు తెగలు (4.1 శాతం), ఇతర వెనకబడిన తరగతుల (49.7 శాతం)కు చెందిన వారే యజమానులుగా ఉన్నారు. దీనిపై ఆధారపడిన వారు ఇతరత్రా ఎలాంటి అండదండలు లేని నిస్సహాయులే. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్తోమత కల్పించే శక్తి ఉన్నందు వల్లే ఈ రంగం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

పొంచి ఉన్న రుణభారం

పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం- ఎంఎస్‌ఎంఈల సమస్యలకు, వీటిలో నెలకొన్న నిరుద్యోగితకు నిధుల కటకటే మూల కారణం. కొవిడ్‌ సంక్షోభ సమయంలో కార్మికులకు వేతనాలు చెల్లించడం, సరకుల సరఫరాదారులకు బకాయిలు కట్టడం అంతకంతకూ కష్టంగా మారుతోంది. చేతిలో ఉన్న డబ్బులతో మూడు నెలలకు మించి మనుగడ సాగించడం- కేవలం ఏడు శాతం చిన్న, మధ్య తరహా సంస్థలకు మాత్రమే సాధ్యమవుతోంది. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు ప్రకటించింది. ప్రభుత్వ పూచీకత్తు మీద రూ.3 లక్షల కోట్ల విలువైన తనఖారహిత రుణాలు, రూ.20 వేల కోట్ల విలువైన అధీన రుణాలు అందించడం వంటివి వీటిలో కొన్ని చర్యలు. అయితే, గడువు తేదీ నాటికి రుణ బకాయి చెల్లించిన ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం కింద ఎలాంటి సహకారం పొందే అర్హత లేకపోవడం, ఈ పథకంలో లోపంగా చెప్పుకోవచ్ఛు లాక్‌డౌన్‌ అనంతరం కూడా అత్యధిక సంస్థలు నిర్వహణ పెట్టుబడి అవసరాలు తీరక నానా అవస్థలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగ్యమైన, నిష్కళంకంగా పేరొందిన సంస్థలకు వాటి నిర్వహణ పెట్టుబడి పరిమితుల ప్రాతిపదికగా- అదనపు పరపతిని సమకూర్చే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ రంగంలోని అనుబంధ సరఫరాదారులు తెరిపిన పడటమనేది భారీ పరిశ్రమల పనితీరుపై ఆధారపడి ఉంది. పర్యాటకం, ఆతిథ్యం, నిర్మాణం వంటి రంగాల్లోని సంస్థలు కోలుకోవడానికి దీర్ఘకాలమే పడుతుంది. ఇవి కోలుకోనిదే, వీటిపై ఆధారపడిన సంస్థలు రుణాలు చెల్లించలేవు. అంతిమంగా, ఆదాయం రాని రుణాల వంటి నిరర్థక ఆస్తులు పెరిగిపోయి బ్యాంకులు చిక్కుల్లో పడతాయి. రుణ వ్యవహారాలకు సంబంధించిన సంస్థ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌- సిబిల్‌ గణాంకాల ప్రకారం, రూ.2.3 లక్షల కోట్ల విలువైన ఎంఎస్‌ఎంఈ రుణాలు నిరర్థకంగా మారే ముప్పు బ్యాంకుల ముంగిట పొంచి ఉంది.

వేధిస్తున్న కార్మికుల కొరత

నైపుణ్య కార్మికులకు సంబంధించి తీవ్రమైన కొరత ఉత్పన్నం కావడం మరో పెద్ద సమస్యగా మారింది. అనేక ఎంఎస్‌ఎంఈలు ఈ సమస్యతో సక్రమంగా నడవడం లేదు. సొంతూళ్లకు తరలిపోయిన వలస కార్మికులు అందరూ వెనక్కు రావడం లేదు. వీరిని తిరిగి రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిర్మాణాత్మక ప్రయత్నాలు కొరవడ్డాయి. తిరుగు వలసలు పూర్తి స్థాయిలో జరగనిదే ఈ సమస్య పరిష్కారం కాదు. కార్మికుల్లో వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లింది. వారిలో తిరిగి విశ్వాసం పాదుగొలిపేందుకు పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారిని వెనక్కు తీసుకురావడం సాధ్యపడుతుంది. ఇవన్నీ ఇలా ఉండగా, వినియోగదారుల నుంచి గిరాకీ పుంజుకోనంతకాలం- సంస్థలకు స్థిరమైన విక్రయాలు, ఆదాయాలు ఉండవు. అందుకని, ఇలాంటి సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వస్తుసేవల పన్ను (జీఎస్టీ), కార్పొరేట్‌ పన్నులకు సంబంధించి కొన్ని రాయితీలు సమకూర్చాలి. పన్ను తిరిగి చెల్లింపులనూ వేగవంతం చేయాలి. ఇక ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈలకు అందాల్సిన అన్ని బకాయిలనూ తక్షణం చెల్లించాల్సిన అవసరం ఉంది. అప్పుడే, వాటికి చేతిలో డబ్బులు ఆడతాయి. ఉత్పత్తి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ప్రభుత్వం పీఎం-కిసాన్‌ వంటి పథకాల ద్వారా గ్రామీణ భారతానికి అదనపు ప్రోత్సాహకాలు కల్పించి, అండదండలు అందిస్తే... అది ఎంఎస్‌ఎంఈల వస్తూత్పత్తులకు గిరాకీనీ పెంపొందించే అవకాశం ఉంది. అతిపెద్ద వ్యవస్థాగత కొనుగోలుదారు ప్రభుత్వమే. అది నేరుగా ఈ సంస్థలకు మద్దతు అందిస్తూ, అండగా నిలవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి నియంత్రణలోని ప్రభుత్వ సంస్థలతో కలిసి తమ స్వీయ వినియోగానికి ఎంఎస్‌ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులనే కొనుగోలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి కొనుగోలు భరోసా నేటి తక్షణ అవసరం.

సహాయంకోసం ఎదురు చూపులు

'ఎన్డ్యూరెన్స్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్' అనే సంస్థ చేసిన మరొక సర్వే ప్రకారం... వ్యాపారాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలు పడుతుందని 60 శాతం సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. సగానికి పైగా సంస్థలు ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తుందని ఆశలు పెట్టుకున్నాయి. ఇక మూడోవంతు ఎంఎస్‌ఎంఈలు సున్నావడ్డీకి లేదా అతి చౌకరేట్లకు రుణాలు లభిస్తాయని ఎదురు చూస్తున్నాయి. సీఈఈడబ్ల్యూ-ఎన్‌ఐపీఎఫ్‌పీ జూన్‌లో సమర్పించిన తాజా నివేదిక ప్రకారం... ఎంఎస్‌ఎంఈ రంగానికి ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా ప్రకటించిన అనేక చర్యల అమలు అంత సులువేమీ కాదు. ఆర్థిక సాయాన్ని సక్రమంగా పంపిణీ చేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. అత్యంత అవసరంలో ఉన్న సంస్థలను గుర్తించి వాటికి నిధులను అందించడం నిజంగానే పెను సవాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో సత్వరమే దృష్టి సారిస్తే మంచిది. సీఈఈడబ్ల్యూ- ఎన్‌ఐపీఎఫ్‌పీ చేసిన ముఖ్యమైన సిఫారసుల ప్రకారం... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను, వాటి కార్మికులను గుర్తించాలి. ఎంఎస్‌ఎంఈల దుర్భర స్థితిగతుల్ని మదింపు చేసే విధానాన్ని రూపొందించాలి. ప్రభుత్వ బకాయిల చెల్లింపు త్వరితగతిన జరిగేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖలో జవాబుదారీ వ్యవస్థ సామర్థ్యం పెంచాలి. చిన్న వ్యాపారాల పరపతి యోగ్యత పెరగాలి. అంతిమంగా- ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పటిష్ఠపరచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థ సత్వర స్వస్థత సాధ్యమవుతుందన్న సంగతిని గుర్తెరగాలి!

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతికుమార్‌

(రచయిత- మిజోరం విశ్వవిద్యాలయంలో వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి)

ABOUT THE AUTHOR

...view details