తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చిన్న పరిశ్రమలపై శరాఘాతం- అభివృద్ధికి ఆటంకం - ఈనాడు ఎడిటోరియల్ న్యూస్

కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఎంఎస్‌ఎంఈల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ప్రయోజనాలను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. అనధికారికంగా ఉన్న యూనిట్లు అధికారిక పరిధిలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎంఎస్‌ఎంఈల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్న అంశాలను గుర్తించి, కార్మిక చట్టాల సంస్కరణల ద్వారా పరిష్కరించాలి. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగంలో ఉండిపోయిన ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన సమాచారంతో సమగ్ర డేటాబేస్‌ను అభివృద్ధి చేయడం ప్రయోజనకరం.

msme
ఎంఎస్‌ఎంఈ

By

Published : Nov 3, 2020, 7:50 AM IST

సమగ్ర, సుస్థిర అభివృద్ధి ప్రస్థానంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల ప్రాధాన్యం ఎనలేనిది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండే విస్తృత విలువ, సరఫరా గొలుసు వ్యవస్థలో ముఖ్య భూమిక వాటిదే. పెద్దసంఖ్యలో వినియోగ, మూలధన వస్తుసేవలను అందించగలిగే సామర్థ్యం ఆ వ్యవస్థ ప్రత్యేకత. భారత్‌లో 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఈలు, 12 కోట్ల మందికి ఉద్యోగావకాశాల్ని కల్పిస్తున్నాయి. ఎగుమతుల్లో 45శాతం, ఉత్పత్తిలో 30శాతం వాటా వీటిదే.

ఈ రంగం ఎక్కువగా అసంఘటిత రూపంలోనే ఉంటోంది. మొత్తం 6.33 కోట్ల ఎంఎస్‌ఎంఈల్లో 99శాతం సూక్ష్మ విభాగంలోకి వస్తాయి. ఇవి ఎక్కువగా ఏకవ్యక్తి వ్యాపారాలే. సాధారణంగా ఒక్కో సూక్ష్మ పరిశ్రమ సుమారు పది మందికి పని కల్పిస్తుంది. ఇవి ఎక్కువగా తయారీ, వ్యాపారం, సేవారంగ కార్యకలాపాలను సాగించే భిన్నమైన వ్యాపార సంస్థలు.

మారాల్సిన నిర్వచనం

ఇలాంటి ఎంఎస్‌ఎంఈల గురించి, వాటిలో పనిచేసే సిబ్బంది గురించి నిర్దిష్టమైన, నవీకరించిన, సమగ్ర సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంది. అయితే, సూక్ష్మవ్యాపార సంస్థలకు దక్కే ప్రోత్సాహకాల్ని పొందాలనే ఉద్దేశంతో చాలా సంస్థలు చిన్నవిగా ఉండిపోయేందుకే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్యరంగ కేటాయింపులు, రుణహామీలు, ఉచిత రుణాలు వంటి అవకాశాల్ని పొందాలనే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈలు తమ స్థాయిని పెంచుకొనేందుకు యత్నించడం లేదనే వాదనలున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మారాల్సిన అవసరం నెలకొంది. సంస్కరణలతో కూడిన ఇలాంటి చర్యల ద్వారా ఎంఎస్‌ఎంఈలపై సంప్రదాయ, విధానపరమైన విచక్షణను తొలగించే అవకాశం ఉంది. పెట్టుబడి మూలధనం ఆధారంగా నిర్వచించే కాలంచెల్లిన పద్ధతి వల్ల ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాల నిర్వహణకు పరిమితులు ఏర్పడ్డాయి. మరోవైపు, వార్షికాదాయం ఆధారంగా మాత్రమే చేసే నిర్వచనం తయారీదారులకంటే, వ్యాపారులకే ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందనే అభ్యంతరాలున్నాయి. తయారీరంగ పరిశ్రమ పూర్తిగా నాశనమైపోతుందనే భయాలూ లేకపోలేదు.

ఇలాంటి భయాందోళనలన్నింటినీ పోగొట్టేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం- కర్మాగారంలోని పెట్టుబడి, యంత్రాంగం, పరికరాలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయిస్తూనే, వార్షికాదాయాన్నీ ప్రాతిపదికగా భావిస్తూ సమస్యను పరిష్కరించేందుకు పూనుకొంది. దీనివల్ల ఒక సంస్థను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా వర్గీకరించే విషయంలో సమ్మిళితమైన ప్రమాణాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

తయారీ, సేవల రంగం తేడాలు లేకుండా- మూలధన పెట్టుబడి, వార్షిక ఆదాయాల సమ్మిళిత పద్ధతి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ జరుగుతుంది. దీనివల్ల ఎంఎస్‌ఎంఈలు తమను వేధిస్తున్న తక్కువ మూలధన పరిమితుల్ని అధిగమించి ఎదిగే అవకాశాలు పెరుగుతాయి. ఎంఎస్‌ఎంఈ హోదాకు భంగం కలగకుండానే ఆధునికీకరణ దిశగా ఆ సంస్థలను ప్రోత్సహించడం, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయడమే కొత్త నిర్వచనం ప్రక్రియ వెనక ఉద్దేశం. వార్షికాదాయం ఆధారంగా ఎంఎస్‌ఎంఈలను నిర్వచించాలనే భావనను గతంలో రిజర్వుబ్యాంకు నిపుణుల కమిటీ సైతం సిఫార్సు చేసింది. ఎంఎస్‌ఎంఈ రంగంలో చాలా సంస్థలు సూక్ష్మపరిశ్రమలుగా అవతరించాయి. ఇందుకు చాలా అంశాలు దోహదపడినా- కార్మిక చట్టాలు, నిబంధనల్లోని సంక్లిష్టతలే ప్రధాన కారణం. ప్రస్తుతం 44 కేంద్ర చట్టాలతో కలిపి 165 దాకా కార్మిక చట్టాలున్నట్లు అంచనా.

పుట్టి ముంచిన కొవిడ్‌ సంక్షోభం

కొవిడ్‌ మహమ్మారి తీవ్రత, లాక్‌డౌన్‌ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీశాయి. నిర్మాణాత్మక బలహీనతలతో సతమతమయ్యే ఎంఎస్‌ఎంఈ రంగంపై మరింత భారం పడింది. ఫలితంగా అన్ని రంగాల్లోని ఎంఎస్‌ఎంఈలు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరాయి. 46 వేల పరిశ్రమలపై చేపట్టిన సర్వే వివరాల్ని అఖిల భారత తయారీదారుల సంఘం ఇటీవలే వెల్లడించింది. ప్రతి మూడు పరిశ్రమల్లో ఒకటి కోలుకొనే పరిస్థితికి దూరమైందని, 32శాతం కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని తేలింది.

ఈ ప్రభావం కోట్లాది కార్మికులు, వారి కుటుంబాల జీవితాలపై ప్రసరిస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందే తయారీ రంగం నెమ్మదించింది. పైగా కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆతిథ్య, ప్రయాణ, పర్యాటక అనుబంధ రంగాల్లో వినియోగం బాగా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ మొదటి భాగంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ 21 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీలో ఉపశమన చర్యలను ప్రకటించారు.

ఎదుగు బొదుగూ లేని వైనం

ఒక సంస్థలో పది, అంతకుమించి కార్మికులు ఉంటే నిబంధనల అమలుకోసం ప్రభుత్వానికి- ప్రతి కార్మికుడికి 35శాతం దాకా వ్యయం పెరుగుతుందని ఒక అంచనా. అలాంటప్పుడు దేశంలోని చాలా ఎంఎస్‌ఎంఈలలో ఉద్యోగులు పదిమందిలోపే ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యంగా, ప్రైవేటు యాజమాన్యంలోని సంస్థలకు ఈ తరహా వ్యయాలు ఎక్కువవుతూ, సంస్థ స్థాయి పెరిగేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం 44 కేంద్ర కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి- వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, భద్రత వంటి అంశాలతో రూపొందించేందుకు కృషి చేస్తోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు, ఎంఎస్‌ఎంఈ రంగంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు, కార్మిక నిబంధనల అమలు భారం తగ్గించేందుకు ఈ చర్యలు ఉపకరించనున్నాయి.

ఎంఎస్‌ఎంఈలకు అదనంగా నగదు లభ్యత, ఉద్దీపనల కోసం ప్రభుత్వం పలు ఆర్థికపరమైన చర్యలను ప్రకటించింది. అత్యవసర పరపతి మార్గం హామీ పథకం, ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఈక్విటీ మద్దతు ఇచ్చేందుకు రూ.20 వేల కోట్ల సబార్డినేట్‌ రుణం, ప్రభుత్వ సేకరణ విధానాల సవరణ, దివాలా చట్టానికి సంబంధించిన చర్యలు, ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో చెల్లింపులు చేయాల్సిందిగా ప్రభుత్వరంగ పరిశ్రమలకు ఆదేశాలివ్వడం వంటి చర్యలు తీసుకుంది. ఎంఎస్‌ఎంఈలు స్వావలంబన సాధించి, వాటి స్థాయిని పెంచుకునే దిశగా ప్రోత్సహించాల్సి ఉంది. ఈ క్రమంలో వాటి నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎంఎస్‌ఎంఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి చేసిన మార్పుల్లో నిర్వచనం మార్చడం కీలకమైనది. ఎందుకంటే ఇది ఎంఎస్‌ఎంఈ చట్టం పరిధిలోకి అనేక సంస్థలను తీసుకొస్తుంది.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఎంఎస్‌ఎంఈల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ప్రయోజనాలను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. అనధికారికంగా ఉన్న యూనిట్లు అధికారిక పరిధిలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎంఎస్‌ఎంఈల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్న అంశాలను గుర్తించి, కార్మిక చట్టాల సంస్కరణల ద్వారా పరిష్కరించాలి. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగంలో ఉండిపోయిన ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన సమాచారంతో సమగ్ర డేటాబేస్‌ను అభివృద్ధి చేయడం ప్రయోజనకరం.

(రచయిత్రి- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని, వాణిజ్యరంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details