MP Election Vindhya Region:ఉత్తర్‌ప్రదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో 9 జిల్లాలు ఉన్నాయి. వాటిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 30. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీని దక్కించుకోలేకపోయింది. అందుకు ప్రధాన కారణం- ఆ పార్టీ వింధ్యలో బోల్తా పడటమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వింధ్యలో ఏకంగా 24 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ ఆరు సీట్లకే పరిమితమైంది. అందుకే ఈ సారి వింధ్యలో పట్టు సాధించాలని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
బీజేపీ ధీమా!
2003 తర్వాత సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఓబీసీలు, గిరిజనులు, దళితుల ఓట్లను బీజేపీ ఎక్కువగా ఆకర్షించింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక ఓబీసీల్లో ఎక్కువ మంది బీజేపీవైపే నిలిచారు. గత కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వింధ్య ప్రాంతంలో 2018 నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని బీజేపీ ధీమాతో ఉంది. మొత్తం 30 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
వింధ్యపై కమలం ప్రత్యేక దృష్టి
Vindhya Range Madhya Pradesh Election : గత అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య ప్రజలు కమలదళానికి పట్టం కట్టినా.. తర్వాత పరిస్థితుల్లో మార్పు మొదలైంది. రీవా మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. 2021 నాటి ఉప ఎన్నికల్లో సత్నా జిల్లాలోని రాయ్‌గావ్‌లోనూ హస్తం పార్టీ జయభేరి మోగించింది. తాజాగా వింధ్యలో బ్రాహ్మణ ఓటర్లను ప్రభావితం చేయగల కీలక నేత నారాయణ్ త్రిపాఠి తమ గూటికి చేరడం కాంగ్రెస్‌కు కొత్త జోష్‌నిస్తోంది. ఓబీసీలకు బీజేపీ తమకంటే అధిక ప్రాధాన్యమిస్తోందన్న భావన స్థానిక రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణుల్లో ఇప్పటికే మొదలైంది. 2020లో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయాక గద్దెనెక్కిన శివరాజ్‌సింగ్ చౌహాన్.. వింధ్య ప్రాంత ఎమ్మెల్యేలెవరికీ మంత్రివర్గంలో చోటివ్వలేదు. ఈ పరిణామాలన్నీ బీజేపీకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం వింధ్యపై ప్రత్యేక దృష్టిసారించింది.
బీజేపీ X కాంగ్రెస్
వింధ్యలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ సర్కారుపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున ఈసారి వింధ్యలోని 30 స్థానాల్లో 22 చోట్ల తాము గెలుస్తామని వారు ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలకు ఇక్కడ చోటు లేదని వారు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం సీధీ జిల్లాలో అగ్రవర్ణాలకు చెందిన ఓ వ్యక్తి.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. అప్పటి బీజేపీ నేత సీధీ ఎమ్మెల్యే కేదార్ శుక్లాకు ఆ కేసు నిందితుడు దూరపు బంధువని ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. గిరిజన ఓటర్లు పార్టీకి దూరమయ్యే ముప్పుందని గ్రహంచిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. నాడు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆదివాసీ వ్యక్తి కాళ్లు కడిగారు. ప్రస్తుత ఎన్నికల్లో శుక్లాను కాదని.. సీధీ ఎంపీ రీతి పాఠక్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీని వీడిన శుక్లా.. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.