MP CM Constituency Budhni : వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు అందరీ దృష్టి.. సెహోర్ జిల్లాలోని నర్మదా నది ఒడ్డున ఉన్న బుధ్ని అనే ఓ చిన్నపట్టణంపై పడింది. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలప్పుడు ఇది వార్తల్లో నిలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడ నుంచి పోటీ చేయడమే. తన కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి సీఎం శివరాజ్‌సింగ్ మరోసారి బరిలోకి దిగారు.
బుధ్ని నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన శివరాజ్ సింగ్.. ఆరోసారి విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక్కడ రెండు ముఖ్యమైన టెక్స్‌టైల్స్ పరిశ్రమలను నెలకొల్పి.. వందలాది యువతకు ఉపాధి కల్పించినట్లు అధికార పార్టీ చెబుతోంది.
"ముఖ్యమంత్రి(శివరాజ్ సింగ్ చౌహాన్) వల్లే బర్ధమాన్ ఫ్యాబ్రిక్స్, ట్రైడెంట్ గ్రూప్ రెండు ఫ్యాక్టరీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది యువకులు అక్కడికి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. యువతలో కొంత ప్రతిభ కూడా ఉండాలి. అందుకే నేర్చుకుని పని చేసేందుకు సీఎం 8 వేల రూపాయలను ఇస్తున్నారు"
-- బుధ్ని నియోజకవర్గం ఓటరు
Shivraj Singh Chouhan Political Career : బుధ్ని నియోజకవర్గంలో 1990లో మొదటిసారి గెలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్.. 2006లో జరిగిన బైఎలక్షన్‌లో రెండోసారి గెలుపొందారు. అక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ తన ఆధిపత్యాన్ని చూపించారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడి ఓటర్ల మద్దతు ఆయనకు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలు.. ఆయన గెలుపునకు అడ్డంకిగా మారాయి.