ప్రపంచవ్యాప్తంగా పాతిక లక్షలమందికి సోకి లక్షా 70వేల మందిని పొట్టన పెట్టుకొన్న కరోనా మహమ్మారి- మానవాళికి పెను సవాలు రువ్వుతున్న మహా మాయరోగం. కొవిడ్ సోకిన వ్యక్తికి రెండు వారాల దాకా రోగలక్షణాలు బయటపడకపోవడం, ఆలోగా అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ అది అంటుకోవడం- కరోనా మృత్యుపాశాల పదునుకు నిదర్శనం.
కరోనా వైరస్ సోకినవారు రోగ లక్షణాలు బయటపడటానికి రెండు మూడు రోజుల ముందే వ్యాధి ప్రజ్వలన శక్తులుగా మారతారని, కొవిడ్ రోగుల్లో 44శాతానికి అలాంటివారి వల్లే వైరస్ పాకిందని ‘నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం చాటుతోంది. చైనాలో లాక్‌డౌన్ విధించకముందు నమోదైన కొవిడ్ కేసుల్లో 79శాతానికి, సింగపూర్‌లో 48శాతానికి- కరోనా సోకినా ఆ లక్షణాలు బయటపడని వ్యక్తులే కారణమని మరో అధ్యయనం నిర్ధారించింది. 2002నాటి సార్స్ వైరస్ రోగ లక్షణాలు బయటపడ్డాకే అంటువ్యాధిగా ప్రబలిందని, అందుకు భిన్నంగా కరోనా యావత్ మానవాళినీ దొంగదెబ్బ తీస్తోందనీ పలు నివేదికలు ఎలుగెత్తుతున్నాయి.
లక్షణాలు లేకుండానే
అందుకు తగ్గట్లే- దిల్లీలో తాజాగా 186మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయినా వారెవరిలోనూ వ్యాధి లక్షణాలు కనపడనే లేదు. మహారాష్ట్రవ్యాప్తంగా 65శాతం, ఉత్తర్ ప్రదేశ్‌లో 75శాతం రోగుల విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలప్పుడు వారిలో ఎలాంటి లక్షణాలూ లేనే లేవు. కొన్ని కేసుల్లో రోగ లక్షణాల్లేక పూర్తి క్వారంటైన్‌లో ఉండివచ్చినవాళ్లలో తరవాత కొవిడ్ బయటపడుతున్న తీరు దిగ్భ్రాంతపరుస్తోంది. జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బందుల వంటివి లేకున్నా విస్తృత ప్రాతిపదికన వ్యాధి నిర్ధారణ టెస్టులు జరపడమే ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది.
భారత్ నియంత్రించగలుగుతోంది
దేశవ్యాప్త లాక్‌డౌన్ ద్వారా కరోనా ఉరవడికి కళ్లెం వేసి, కేసులు మరణాల సంఖ్యను ఇండియా సమర్థంగా నియంత్రించగలుగుతోందని చెబుతోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. భారత్తో సహా పది దేశాలు చేసిన మొత్తం రోగ నిర్ధారణ పరీక్షల్ని మించి ఒక్క అమెరికాయే 43 లక్షల కరోనా టెస్టుల్ని చేసిందని డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకొంటున్నా- అగ్రరాజ్యంలో కొవిడ్ మరణ మృదంగం ఆగక మోగుతూనే ఉంది! చేతులు కాలాక ఆకులకోసం వెంపర్లాట ఎంత చేటు కొనితెస్తుందో అమెరికా అనుభవమే చాటుతున్న నేపథ్యంలో- విస్తృత ప్రాతిపదికన కొవిడ్ పరీక్షలకు ఇండియా సిద్ధం కావాలి. ఇప్పటికే నాలుగు లక్షల పైచిలుకు పరీక్షలు జరిపామని భారతీయ వైద్య పరిశోధనా మండలి చెబుతున్నా- కొవిడ్ సృష్టించగల జనారోగ్య సంక్షోభం తీవ్రతతో పోలిస్తే అవి అత్యల్పమని బోధపడుతూనే ఉంది. కొవిడ్ సోకిన తొమ్మిదేళ్లలోపు పిల్లల్లో అత్యధికంగా 27శాతానికి ఎలాంటి రోగ లక్షణాలూ కనిపించలేదన్న ఇజ్రాయెల్ అధ్యయనం- ముద్దులొలికే పిల్లలూ మృత్యుదూతలయ్యే ప్రమాదాన్ని ప్రస్తావిస్తోంది.
విదేశాల నుంచి వచ్చే వారికి అధికంగా
మొదట విదేశాలనుంచి వచ్చినవారిని, వారి కుటుంబీకులను క్వారంటైన్ చేసి కరోనా పరీక్షలు నిర్వహించిన ఇండియా- కరోనా గొలుసును తెగతెంచడంలో భాగంగా లాక్‌డౌన్ అమలు చేసి, విస్తృత పరీక్షలకు అవసరమైన కిట్లను ఇప్పుడిప్పుడే సమకూర్చుకొంటోంది. వరస వాయిదాల తరవాత ఎట్టకేలకు చైనా నుంచి అయిదు లక్షల రాపిడ్ యాంటీ బాడీ పరీక్ష కిట్లు ఇండియాకు చేరాయి. మే నెలనుంచి దేశీయంగానే నెలకు 20 లక్షల టెస్టు కిట్లు తయారు కానున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భారత ఔషధ రంగ దిగ్గజాలూ కరోనా పరీక్షా కిట్ల అభివృద్ధి, దిగుమతులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆంక్షలనుంచి మినహాయింపులు ఇచ్చినా ఔషధ రంగం 50శాతం సామర్థ్యంతోనే పని చేస్తున్న తీరు బాధాకరం. కొవిడ్ ఎవరిని పూనిందో తెలియని వాతావరణంలో చేతుల పరిశుభ్రత, ముఖాలకు మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతోనే కొవిడ్ ముప్పును సమర్థంగా కాచుకోగలం!
ఇదీ చదవండి:రాష్ట్రపతి భవన్లో కరోనా కలకలం- 125 కుటుంబాలకు క్వారంటైన్